హబక్కూకు 2:1-5 - Compare All Versions

హబక్కూకు 2:1-5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నేను నా కావలి స్థలం దగ్గర కనిపెట్టుకుని నగర గోడపై నిలబడి ఉంటాను; ఆయన నాతో ఏమి చెప్తాడో, ఈ ఫిర్యాదుకు నేను ఏమి జవాబు చెప్పాలో చూస్తాను. యెహోవా నాకిలా జవాబిచ్చారు: “ప్రకటించేవాడు పరుగెడుతూ సులభంగా చదవడానికి వీలుగా దర్శన సందేశాన్ని పలక మీద స్పష్టంగా వ్రాయి. దర్శన సందేశం ఒక నియమిత సమయంలో జరుగుతుంది; అది అంతం గురించి మాట్లాడుతుంది అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యమైనా, దాని కోసం వేచి ఉండండి; ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఆలస్యం కాదు. “చూడండి, శత్రువు కోరికలు న్యాయమైనవి కాకపోయినా అతడు అతిశయపడుతున్నాడు; కాని నీతిమంతుడు తన నమ్మకత్వాన్ని బట్టి జీవిస్తాడు. ద్రాక్షరసం అతన్ని మోసం చేస్తుంది; గర్విష్ఠియైన అతడు ఎప్పుడూ విశ్రమించడు. అతనికి పాతాళమంత దురాశ ఉన్నందున మరణంలా అది ఎన్నడూ తృప్తిపడదు, అతడు సమస్త జనాలను వశపరచుకుంటాడు ప్రజలందరిని బందీలుగా తీసుకెళ్తాడు.

షేర్ చేయి
హబక్కూకు 2 TSA

హబక్కూకు 2:1-5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆయన నాకు ఏమి సెలవిస్తాడో, నా వాదం విషయమై నేనేమి చెబుతానో చూడడానికి నేను నా కావలి స్థలంపైనా గోపురంపైనా కనిపెట్టుకుని ఉంటాననుకున్నాను. యెహోవా నాకు ఇలా చెప్పాడు. చదివేవాడు పరిగెత్తేలా, నీవు ఆ దర్శన విషయాన్ని పలక మీద స్పష్టంగా రాయి. ఆ దర్శన విషయం రాబోయే కాలంలో జరుగుతుంది. అది ఎంత మాత్రం విఫలం కాదు. అది ఆలస్యమైనా తప్పక నెరవేరుతుంది. దాని కోసం కనిపెట్టు. అది ఆలస్యం చేయక వస్తుంది. మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది. అది యథార్థంగా ఉండదు. అయితే నీతిమంతుడు తన విశ్వాసమూలంగా బ్రదుకుతాడు. ద్రాక్షారసం గర్విష్టి యువకుణ్ణి మోసం చేసి నిలవననీయకుండా చేస్తుంది. అతని ఆశలను పాతాళమంతగా విస్తరింప జేస్తుంది. మరణం లాగా అది తృప్తినొందదు. అతడు సకలజనాలను వశపరచుకుంటాడు. ప్రజలందరినీ తన కోసం సమకూర్చుకుంటాడు.

షేర్ చేయి
హబక్కూకు 2 IRVTEL

హబక్కూకు 2:1-5 TERV (పవిత్ర బైబిల్)

నేనొక కాపలాదారునిగా నిలబడి గమనిస్తాను. యెహోవా నాకు ఏమి చెపుతాడో వినటానికి నేను వేచి ఉంటాను. ఆయన నా ప్రశ్నలకు ఎలా సనాధానమిస్తాడో నేను వేచివుండి తెలుసుకుంటాను. యెహోవా నాకు సమాధానమిచ్చాడు: “నేను నీకు చూపించేవాటిని వ్రాయి. ప్రజలు సులభంగా చదవగలిగే రీతిలో దానిని ఒక పలకమీద స్పష్టంగా వ్రాయి. ఈ వర్తమానం భవిష్యత్తులో ఒక ప్రత్యేక సమయం గురించినది. ఈ వర్తమానం పరిసమాప్తిని గురించినది. అది నిజమవుతుంది! ఆ సమయం ఎన్నడూ రానట్టుగా కన్పించవచ్చు. కాని ఓపికతో దానికొరకు వేచివుండు. ఆ సమయం వస్తుంది. అది ఆలస్యం కాదు. దీనిని విన నిరాకరించే వారికి ఈ వర్తమానం సహాయపడదు. కాని మంచివాడు ఈ వర్తమానాన్ని నమ్ముతాడు. తన విశ్వాసం కారణంగా, ఆ మంచి వ్యక్తి దీనిని నమ్ముతాడు.” దేవుడు చెప్పాడు: “ద్రాక్షమద్యం మనిషిని మోసం చేయగలదు. అదే మాదిరి ఒక బలవంతుని గర్వం అతనిని అవివేకునిగా చేస్తుంది. అతనికి శాంతి ఉండదు. అతడు మృత్యువువలె ఉంటాడు. అతడు ఇంకా, ఇంకా కోరుతూనే ఉంటాడు. మృత్యువువలె అతనికి తృప్తి అంటూ ఉండదు. అతడు ఇతర దేశాలను ఓడించటం కొనసాగిస్తూనే ఉంటాడు. ఆ ప్రజలను చెరపట్టటం కొనసాగిస్తూ ఉంటాడు.

షేర్ చేయి
హబక్కూకు 2 TERV

హబక్కూకు 2:1-5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురముమీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకీలాగు సెలవిచ్చెను –చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును. వారు యథార్థపరులుకాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును. మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును.

షేర్ చేయి
హబక్కూకు 2 TELUBSI