ఆదికాండము 9:20-29 - Compare All Versions
ఆదికాండము 9:20-29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వ్యవసాయకుడైన నోవహు ద్రాక్షతోట నాటడం ఆరంభించాడు. అతడు కొంత మద్యం త్రాగి మత్తులో తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు. కనాను తండ్రియైన హాము తన తండ్రి దిగంబరిగా ఉండడం చూసి బయట ఉన్న తన ఇద్దరు అన్నలకు చెప్పాడు. అయితే షేము, యాపెతు ఒక వస్త్రం తీసుకుని తమ భుజాల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి నగ్న శరీరాన్ని కప్పారు. తండ్రి నగ్న శరీరం వైపు చూడకుండ వారు తమ ముఖాలను మరోవైపుకు తిప్పుకున్నారు. నోవహుకు మత్తు వదిలిన తర్వాత చిన్నకుమారుడు తనకు చేసింది తెలుసుకుని, ఇలా అన్నాడు, “కనాను శపించబడాలి! అతడు తన సహోదరులకు దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.” ఇంకా అతడు, “షేము దేవుడైన యెహోవాకు స్తుతి! కనాను అతనికి దాసుడవాలి. దేవుడు యాపెతు సరిహద్దును విస్తరింపజేయాలి; యాపెతు షేము గుడారాల్లో నివసించాలి, కనాను యాపెతుకు దాసుడవాలి” అని అన్నాడు. జలప్రళయం తర్వాత నోవహు ఇంకా 350 సంవత్సరాలు జీవించాడు. నోవహు మొత్తం 950 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
ఆదికాండము 9:20-29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నోవహు భూమిని సాగుచేయడం ప్రారంభించి, ద్రాక్షతోట వేశాడు. ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు. అప్పుడు కనాను తండ్రి అయిన హాము, తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండడం చూసి, బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయం చెప్పాడు. అప్పుడు షేము, యాపెతు, ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచివెళ్ళి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు. అప్పుడు నోవహు మత్తులోనుంచి మేల్కొని తన చిన్నకొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు. “కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు. అతడు “షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక. కనాను అతనికి సేవకుడవుతాడు గాక. దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడు గాక. అతడు షేము గుడారాల్లో నివాసం ఉంటాడు. అతనికి కనాను సేవకుడవుతాడు” అన్నాడు. ఆ జలప్రళయం తరువాత నోవహు మూడు వందల ఏభై సంవత్సరాలు బ్రతికాడు. నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు.
ఆదికాండము 9:20-29 TERV (పవిత్ర బైబిల్)
నోవహు వ్యయసాయదారుడయ్యాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. నోవహు ద్రాక్షారసం చేసి, దాన్ని త్రాగాడు. అతడు మత్తెక్కి తన గుడారంలో పండుకొన్నాడు. నోవహు బట్టలు ఏమీ వేసుకొనలేదు. కనాను తండ్రి హాము, దిగంబరంగా ఉన్న తన తండ్రిని చూశాడు. గుడారం వెలుపలున్న తన సోదరులతో హాము ఈ విషయం చెప్పాడు. అప్పుడు షేము, యాఫెతు కలసి ఒక అంగీని తెచ్చారు. వాళ్లు ఆ అంగీని తమ భుజాలమీద మోసి గుడారంలోకి తీసుకువెళ్లారు. వారు వెనక్కి గుడారంలోకి నడిచివెళ్లి బట్టలు లేకుండా ఉన్న తమ తండ్రి ఒంటిమీద బట్ట కప్పారు. ఆ తర్వాత నోవహు మేల్కొన్నాడు. (ద్రాక్షారసంవల్ల అతడు నిద్రపోతూ ఉన్నాడు). అప్పుడు తన చిన్న కుమారుడు హాము తనకు చేసినదాన్ని అతడు తెలుసుకొన్నాడు. కనుక నోవహు అన్నాడు: “కనాను శపించబడును గాక! కనాను తన సోదరులకు బానిస అగును గాక!” నోవహు ఇంకా ఇలా అన్నాడు: “షేము దేవుడగు యెహోవా స్తుతించబడును గాక! కనాను షేముకు బానిస అవును గాక. యాఫెతుకు దేవుడు ఇంకా ఎక్కువ భూమిని ఇచ్చును గాక! షేము గుడారాలలో దేవుడు నివసించును గాక! కనాను వారికి బానిస అవును గాక!” జలప్రళయం తర్వాత నోవహు 350 సంవత్సరాలు బ్రతికాడు. నోవహు మొత్తం 950 సంవత్సరాలు బ్రతికాడు. తరువాత అతడు మరణించాడు.
ఆదికాండము 9:20-29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు. అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని– కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. మరియు అతడు– షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను. నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.