ఆదికాండము 49:2-10
ఆదికాండము 49:2-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“యాకోబు కుమారులారా, సమావేశమై వినండి మీ తండ్రియైన ఇశ్రాయేలు చెప్పేది వినండి. “రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి నా బలం యొక్క మొదటి గుర్తు, ఘనతలోను శక్తిలోను ఆధిక్యత గలవాడవు కానీ నీళ్లలా అస్థిరంగా ఉండే నీవు ఇకపై రాణించవు, ఎందుకంటే నీవు నీ తండ్రి మంచం ఎక్కావు, నా పడకను అపవిత్రం చేశావు. “షిమ్యోను లేవీ సోదరులు వారి ఖడ్గాలు హింసాయుధాలు. వారి సమావేశాల్లో నేను ప్రవేశించకుందును గాక, నా ఘనతను వారి కూడికలో చేర్చకుందును గాక, ఎందుకంటే వారి కోపంలో వారు మనుష్యులను చంపేశారు సరదా కోసం ఎడ్ల కాలి నరాలు తెగగొట్టారు. వారి కోపం శపించబడాలి, అది భయంకరమైనది, వారి ఆగ్రహం ఎంతో క్రూరమైనది! వారిని యాకోబులో చెల్లాచెదురు చేస్తాను, ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను. “యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసిస్తారు; నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది; నీ తండ్రి కుమారులు నీకు తలవంచుతారు యూదా, నీవు ఒక కొదమసింహం; నా కుమారుడా, నీవు వేటాడి తిరిగి వచ్చావు. అతడు సింహంలా కాళ్లు ముడుచుకుని, ఆడ సింహంలా పడుకుంటాడు, అతన్ని లేపడానికి ఎవరు తెగిస్తారు? రాజదండం యూదా దగ్గర నుండి తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు, అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చేవరకు తొలగదు, దేశాలు అతనికి విధేయులై ఉంటాయి.
ఆదికాండము 49:2-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి. రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి, నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి. పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. నువ్వు నా మంచం మీదికి ఎక్కావు. షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. కోపంలో వారు మనుషులను చంపారు. సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు. వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది. అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను. ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను. యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. యూదా సింహం పిల్ల. నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. అతన్ని లేపడానికి తెగించేవాడెవడు? షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి.
ఆదికాండము 49:2-10 పవిత్ర బైబిల్ (TERV)
“యాకోబు కుమారులారా, మీరంతా కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాటలు వినండి. “రూబేనూ, నీవు నా మొట్టమొదటి కుమారుడవు, నా బలం నీవు. పురుషునిగా నా శక్తికి మొదటి ఋజువు నీవే. నా కుమారులందరిలోను గౌరవించదగినవాడివి, మహా బలశాలివి నీవు. కానీ నీవు ఉద్రేకంతో అదుపుదప్పిన ప్రవాహం వలే ఉన్నావు, కాబట్టి నీవు ఎక్కువ గౌరవించదగిన నా కుమారుడవు కావు నీ తండ్రి పడకను నీవు ఎక్కావు. నీ తండ్రి భార్యలలో ఒకదానితో నీవు శయనించావు నీవు నా పడకకు అవమానం తెచ్చావు, ఆ పడకపై నీవు శయనించావు. “షిమ్యోను, లేవీ సోదరులు. తమ ఖడ్గములతో పోరాడటం అంటే వారికి ప్రీతి. రహస్యమందు వారు చెడు కార్యాలను తలస్తారు. వారి పథకాలలో నా ఆత్మ భాగాన్ని కోరటం లేదు, వారి రహస్య సమావేశాలను నేను అంగీకరించను, వారు వారి పగవారిని కోపంతో చంపారు. వారు కేవలం సరదాలకు పశువులకు హాని చేశారు. వారి కోపం శాపం, అది చాల బలీయమయింది. వారికి కోపం వచ్చినప్పుడు వారు చాలా క్రూరులు. యాకోబు దేశంలో వారి వంశాలకు వారి స్వంత భూమి వారికి ఉండదు. ఇశ్రాయేలు అంతటిలో వారు చెదరి ఉంటారు. “యూదా, నీ సోదరులు నిన్ను పొగడుదురు. నీవు నీ శత్రువులను ఓడిస్తావు. నీ సోదరులు నీకు సాగిలపడ్తారు. యూదా సింహంలాంటివాడు. కుమారుడా, తాను చంపిన జంతువు దగ్గర నిలిచిన సింహం వంటి వాడవు నీవు. యూదా సింహంవంటి వాడు. అతడు విశ్రాంతికోసం పండుకొంటాడు. అతణ్ణి లేపుటకు ఎవరూ సాహసించరు. యూదా వంశపు పురుషులు రాజులుగా ఉంటారు. అతని కుటుంబం పరిపాలిస్తుంది అనే సూచన అసలైన రాజు వచ్చేంతవరకు అతని కుటుంబాన్ని విడువదు. అప్పుడు అనేక మంది అతనికి విధేయులై అతణ్ణి సేవిస్తారు.
ఆదికాండము 49:2-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేనూ, నీవు నా పెద్దకుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను. షిమ్యోను లేవి అనువారు సహోదరులువారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి. వారికోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము నా కుమారుడా, నీవు పెట్టినదానితిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడుసింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు? షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్లమధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైయుందురు.