ఆదికాండము 46:26-34

ఆదికాండము 46:26-34 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యాకోబుతో ఈజిప్టుకు అతని కుమారుల భార్యలు కాక, యాకోబు సంతతివారు మొత్తం అరవై ఆరు మంది వ్యక్తులు. ఈజిప్టులో యోసేపుకు పుట్టిన కుమారులు ఇద్దరితో కలిపి, ఈజిప్టుకు వెళ్లిన యాకోబు కుటుంబీకులంతా డెబ్బైమంది. గోషేనుకు త్రోవ చూపడానికి యాకోబు యూదాను తనకన్నా ముందు యోసేపు దగ్గరకు పంపాడు. వారు గోషేను ప్రాంతం చేరుకున్నప్పుడు, యోసేపు తన రథం సిద్ధం చేయించుకుని తన తండ్రి ఇశ్రాయేలును కలవడానికి గోషేనుకు వెళ్లాడు. యోసేపు కనుపరచుకున్న వెంటనే, తన తండ్రిని కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చాడు. ఇశ్రాయేలు యోసేపుతో, “నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను కళ్లారా చూశాను కాబట్టి, ఇప్పుడు హాయిగా చనిపోగలను” అని అన్నాడు. అప్పుడు యోసేపు తన సోదరులతో తన తండ్రి ఇంటివారితో, “నేను వెళ్లి ఫరోతో మాట్లాడి అతనికి, ‘కనాను దేశంలో నివసించే నా సోదరులు, నా తండ్రి ఇంటివారు నా దగ్గరకు వచ్చారు. ఈ మనుష్యులు కాపరులు; వారు పశువులను మేపుతారు, వారు తమ మందలను, పశువులను, వారికి ఉన్నదంతా తెచ్చారు’ అని చెప్తాను. ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే, ‘మీ సేవకులు మా పితరులు చేసినట్టే బాల్యం నుండి పశువులను మేపేవారము’ అని జవాబివ్వాలి. అప్పుడు గోషేనులో స్థిరపడడానికి మీకు అనుమతి వస్తుంది, ఎందుకంటే గొర్రెల కాపరులంటే ఈజిప్టువారికి అసహ్యం” అని చెప్పాడు.

ఆదికాండము 46:26-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు. ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది. యాకోబు గోషెనుకు దారి చూపడానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు. యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను. కాబట్టి నేనిక చనిపోగలను” అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో తన తండ్రి కుటుంబం వారితో “నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి, ‘కనాను దేశంలో ఉన్న నా సోదరులూ నా తండ్రి కుటుంబం వారూ నా దగ్గరికి వచ్చారు. వారు గొర్రెల కాపరులు. పశువులను మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసుకు వచ్చారు’ అని అతనితో చెబుతాను. కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే ‘మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మేమూ మా పూర్వీకులంతా కాపరులం.’ మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే, గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం.”

ఆదికాండము 46:26-34 పవిత్ర బైబిల్ (TERV)

ఇలా యాకోబు సంతానం ఈజిప్టుకు వెళ్లారు. యాకోబు మూలంగా కలిగిన పిల్లలు మొత్తం 66 మంది. (యాకోబు భార్యలు ఈ లెక్కలో లేరు). మరియు యోసేపు ఇద్దరు కుమారులు కూడ ఉన్నారు. వారు ఈజిప్టులో పుట్టారు. కనుక ఈజిప్టులో యాకోబు కుటుంబంలో 70 మంది ఉన్నారు. యాకోబు మొదట యూదాను యోసేపు దగ్గరకు పంపించాడు. గోషెను దేశంలోని యోసేపు దగ్గరకు యూదా వెళ్లాడు. ఆ తర్వాత యాకోబు, అతని వాళ్లు ఆ దేశంలో ప్రవేశించారు. యోసేపు తన తండ్రి వచ్చేస్తున్నాడని విన్నాడు. గోషెనులో తన తండ్రి ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు యోసేపు తన రథం సిద్ధం చేసుకొని బయల్దేరాడు. యోసేపు తన తండ్రిని చూడగానే అతని మెడమీద పడి కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు, “ఇప్పుడు నేను మనశ్శాంతిగా మరణించవచ్చు, నీ ముఖం నేను చూశాను, నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను చూడగలిగాను” అని యోసేపుతో చెప్పాడు. తన సోదరులతోను, తన తండ్రి కుటుంబంతోను యోసేపు ఇలా చెప్పాడు: “నేను వెళ్లి మీరు వచ్చినట్లు ఫరోతో చెబుతాను. ఫరోతో నేను ఏమని చెబుతానంటే ‘నా అన్నలు, నా తండ్రి కుటుంబం కనాను దేశం విడిచి ఇక్కడ నా దగ్గరకు వచ్చారు. ఈ నా కుటుంబం గొర్రెల కాపరుల కుటుంబం. నిత్యం వాళ్లు పశువుల్ని, మందల్ని కలిగి ఉండేవాళ్లు. వారి పశువుల్ని, వారికి కలిగిన అంతటిని వాళ్లతోబాటు వారు తెచ్చుకొన్నారు.’ ఫరో మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేం పని చేస్తారు? అని మిమ్మును అడుగుతాడు. అప్పుడు మీరు ‘మేము గొర్రెల కాపరులం, మా జీవితకాలమంతా మా పశువుల్ని మేపుకొంటూ జీవించాం. మాకు ముందు మా పూర్వీకులు ఇలాగే జీవించారు’ అని చెప్పండి. అప్పుడు ఫరో మిమ్మును గోషెను దేశంలో జీవింపనిస్తాడు. గొర్రెల కాపరులంటే ఈజిప్టు ప్రజలకు యిష్టం లేదు, కనుక మీరు గోషెను దేశంలో ఉండవచ్చు.”

ఆదికాండము 46:26-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బదిమంది. అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీదపడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో–నీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినిచూచి–నేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనానుదేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి; ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱెల కాపరులు. వారు తమ గొఱ్ఱెలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పెదను. గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు–మా చిన్నతనమునుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గలవారమై యున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను.