ఆదికాండము 46:1-34

ఆదికాండము 46:1-34 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

కాబట్టి ఇశ్రాయేలు తనకున్నదంతటితో బయలుదేరాడు, బెయేర్షేబకు వచ్చాక, తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులు అర్పించారు. రాత్రి దర్శనం ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడారు. ఆయన, “యాకోబూ! యాకోబూ!” అని పిలిచారు. అతడు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు. ఆయన, “నేను దేవున్ని, నీ తండ్రి యొక్క దేవున్ని. ఈజిప్టుకు వెళ్లడానికి భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నేను నీతో ఈజిప్టుకు వస్తాను, ఖచ్చితంగా నిన్ను తిరిగి తీసుకువస్తాను. యోసేపు స్వహస్తాలే నీ కళ్లు మూస్తాయి” అని అన్నారు. అప్పుడు యాకోబు బెయేర్షేబ నుండి బయలుదేరాడు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును, వారి పిల్లలను, వారి భార్యలను ఫరో పంపిన బండ్లలో తీసుకెళ్లారు. కాబట్టి యాకోబు, అతని సంతానమంతా వారి పశువులతో, కనానులో వారు సంపాదించిన సమస్త సంపదతో ఈజిప్టుకు వెళ్లారు. యాకోబు తనతో తన కుమారులను, మనవళ్లను, కుమార్తెలను, మనవరాళ్లను, తన సంతానమంతటిని ఈజిప్టుకు తీసుకువచ్చాడు. ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల (యాకోబు అతని సంతానం) పేర్లు: రూబేను, యాకోబు యొక్క మొదటి కుమారుడు. రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. షిమ్యోను కుమారులు: యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీ యొక్క కుమారుడైన షావూలు. లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి. యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (కాని ఏరు, ఓనాను కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు. ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువా, యోబు, షిమ్రోను. జెబూలూను కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు. వీరు పద్దనరాములో లేయాకు యాకోబుకు పుట్టిన కుమారులు, దీనా వారి కుమార్తె. కుమారులు, కుమార్తెలు కలిసి వీరంతా ముప్పై ముగ్గురు. గాదు కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, అరోది, అరేలీ. ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. శెరహు వారి సోదరి. బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు. వీరు లాబాను తన కుమార్తె లేయాకు ఇచ్చిన జిల్పా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం మొత్తం పదహారు మంది. యాకోబు భార్య రాహేలు యొక్క కుమారులు: యోసేపు, బెన్యామీను. ఈజిప్టులో యోసేపుకు ఓను పట్టణానికి యాజకుడైన పోతీఫెర కుమార్తె ఆసెనతు ద్వారా మనష్షే, ఎఫ్రాయిం పుట్టారు. బెన్యామీను కుమారులు: బేల, బెకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీ, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు. వీరు యాకోబుకు కలిగిన రాహేలు సంతానం మొత్తం పద్నాలుగు మంది. దాను కుమారుడు: హూషీము. నఫ్తాలి కుమారులు: యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము. వీరు లాబాను తన కుమార్తె రాహేలుకు ఇచ్చిన బిల్హా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం మొత్తం ఏడుగురు. యాకోబుతో ఈజిప్టుకు అతని కుమారుల భార్యలు కాక, యాకోబు సంతతివారు మొత్తం అరవై ఆరు మంది వ్యక్తులు. ఈజిప్టులో యోసేపుకు పుట్టిన కుమారులు ఇద్దరితో కలిపి, ఈజిప్టుకు వెళ్లిన యాకోబు కుటుంబీకులంతా డెబ్బైమంది. గోషేనుకు త్రోవ చూపడానికి యాకోబు యూదాను తనకన్నా ముందు యోసేపు దగ్గరకు పంపాడు. వారు గోషేను ప్రాంతం చేరుకున్నప్పుడు, యోసేపు తన రథం సిద్ధం చేయించుకుని తన తండ్రి ఇశ్రాయేలును కలవడానికి గోషేనుకు వెళ్లాడు. యోసేపు కనుపరచుకున్న వెంటనే, తన తండ్రిని కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చాడు. ఇశ్రాయేలు యోసేపుతో, “నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను కళ్లారా చూశాను కాబట్టి, ఇప్పుడు హాయిగా చనిపోగలను” అని అన్నాడు. అప్పుడు యోసేపు తన సోదరులతో తన తండ్రి ఇంటివారితో, “నేను వెళ్లి ఫరోతో మాట్లాడి అతనికి, ‘కనాను దేశంలో నివసించే నా సోదరులు, నా తండ్రి ఇంటివారు నా దగ్గరకు వచ్చారు. ఈ మనుష్యులు కాపరులు; వారు పశువులను మేపుతారు, వారు తమ మందలను, పశువులను, వారికి ఉన్నదంతా తెచ్చారు’ అని చెప్తాను. ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే, ‘మీ సేవకులు మా పితరులు చేసినట్టే బాల్యం నుండి పశువులను మేపేవారము’ అని జవాబివ్వాలి. అప్పుడు గోషేనులో స్థిరపడడానికి మీకు అనుమతి వస్తుంది, ఎందుకంటే గొర్రెల కాపరులంటే ఈజిప్టువారికి అసహ్యం” అని చెప్పాడు.

ఆదికాండము 46:1-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకు ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు “యాకోబూ, యాకోబూ” అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. ఆయన “నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.” యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకు రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ పిల్లలనూ తమ భార్యలనూ ఎక్కించారు. యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తు వచ్చారు. వారు తమ పశువులనూ తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసికెళ్లారు. అతడు తన కొడుకులనూ మనుమలనూ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసుకు వచ్చాడు. ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే. యాకోబు పెద్ద కొడుకు, రూబేను. రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. షిమ్యోను కొడుకులు, యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కొడుకు షావూలు. లేవి కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి. యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను, కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు. ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను. జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు. వీరు లేయా కొడుకులు. ఆమె పద్దనరాములో యాకోబుకు వారిని అతని కూతురు దీనానూ కన్నది. అతని కొడుకులూ అతని కుమార్తెలూ మొత్తం ముప్ఫై ముగ్గురు. గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ. ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు. లాబాను తన కూతురు లేయా కిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ పదహారు మందిని యాకోబుకు కన్నది. యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను. యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తుదేశంలో ఓనుకు యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు అతనికి కన్నది. బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు. యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు. దాను కొడుకు హుషీము. నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము. లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వారిని యాకోబుకు కన్నది. వారంతా ఏడుగురు. యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు. ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది. యాకోబు గోషెనుకు దారి చూపడానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు. యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను. కాబట్టి నేనిక చనిపోగలను” అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో తన తండ్రి కుటుంబం వారితో “నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి, ‘కనాను దేశంలో ఉన్న నా సోదరులూ నా తండ్రి కుటుంబం వారూ నా దగ్గరికి వచ్చారు. వారు గొర్రెల కాపరులు. పశువులను మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసుకు వచ్చారు’ అని అతనితో చెబుతాను. కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే ‘మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మేమూ మా పూర్వీకులంతా కాపరులం.’ మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే, గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం.”

ఆదికాండము 46:1-34 పవిత్ర బైబిల్ (TERV)

కనుక ఇశ్రాయేలు ఈజిప్టుకు తన ప్రయాణం మొదలు పెట్టాడు. మొదట ఇశ్రాయేలు బెయేర్షెబాకు వెళ్లాడు. అక్కడ తన తండ్రియైన ఇస్సాకు దేవుణ్ణి ఇశ్రాయేలు ఆరాధించాడు. అతడు బలులు అర్పించాడు. ఆ రాత్రి ఒక కలలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. “యాకోబూ, యాకోబూ” అన్నాడు దేవుడు. “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని ఇశ్రాయేలు జవాబు ఇచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు: “నేను దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి. ఈజిప్టు వెళ్లేందుకు భయపడకు. ఈజిప్టులో నిన్ను ఒక గొప్ప జనంగా నేను చేస్తాను. నీతో కూడ నేను ఈజిప్టుకు వస్తాను. మళ్లీ నేనే నిన్ను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వస్తాను. నీవు ఈజిప్టులో మరణిస్తావు, కాని యోసేపు నీతో ఉంటాడు. నీవు చనిపోయినప్పుడు అతని స్వంత చేతులే నీ కళ్లను మూస్తాయి.” అప్పుడు యాకోబు బెయేర్షెబా విడిచి, ఈజిప్టుకు ప్రయాణం చేశాడు. అతని కుమారులు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రిని, భార్యలను, తమ పిల్లలందరిని ఈజిప్టుకు తీసుకొని వచ్చారు. ఫరో పంపిన బండ్లలో వారు ప్రయాణం చేశారు. తమ పశువులు, కనాను దేశంలో వారికి ఉన్నవి అన్నీ వారితోబాటు ఉన్నవి. కనుక ఇశ్రాయేలు తన పిల్లలందరితో, తన కుటుంబం అంతటితో కలిసి ఈజిప్టు వెళ్లాడు. అతని కుమారులు అతని మనుమళ్లు, అతని కుమార్తెలు, అతని మనమరాళ్లు అతనితో ఉన్నారు. అతని కుటుంబం అంతా అతనితో కలిసి ఈజిప్టుకు వెళ్లారు. ఇశ్రాయేలుతో కలిసి ఈజిప్టుకు వెళ్లిన అతని కుమారులు, కుటుంబము వాళ్ల పేర్లు: రూబేను యాకోబుయొక్క మొదటి కుమారుడు. రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. షిమ్యోను కుమారులు; యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీ స్త్రీ కుమారుడు షావూలు. లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారీ. యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను కనానులో ఉన్నప్పుడే చనిపోయారు) పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు, ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్యా, యోబు, షిమ్రోను. జెబూలూను కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను యాకోబు భార్య లేయా ద్వారా అతని కుమారులు. లేయా ఆ కుమారులను పద్దనరాములో కన్నది. ఆమె కుమార్తె దీనా కూడ ఉంది. ఈ కుటుంబంలో 33 మంది ఉన్నారు. గాదు కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, అరోదీ, అరేలీ, ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరీయా, వారి సోదరి శెరహు. బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు. వారంతా యాకోబుకు అతని భార్య లేయా సేవకురాలు జిల్ఫాద్వారా పుట్టిన కుమారులు. ఈ కుటుంబంలో 16 మంది ఉన్నారు. మరియు అతని భార్య రాహేలు ద్వారా పుట్టిన కుమారుడు బెన్యామీను కూడ యాకోబుతో ఉన్నాడు. (యోసేపు కూడ రాహేలుకు పుట్టినవాడే కాని అతడు అప్పటికే ఈజిప్టులో ఉన్నాడు.) ఈజిప్టులో యోసేపుకు ఇద్దరు కుమారులు: మనష్షే, ఎఫ్రాయిము. (ఓను పట్టణ యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతు యోసేపు భార్య). బెన్యామీను కుమారులు: బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు. వారంతా యాకోబుకు అతని భార్య రాహేలు ద్వారా కలిగిన సంతానం. ఈ కుటుంబంలో 14 మంది ఉన్నారు. దాను కుమారుడు: హుషీము నఫ్తాలి కుమారులు: యహసేలు, గూనీ, యోసేరు, షల్లేము. వారు యాకోబు, బిల్హాలకు పుట్టిన కుమారులు (రాహేలు సేవకురాలు బిల్హా). ఈ కుటుంబంలో 7 మంది ఉన్నారు. ఇలా యాకోబు సంతానం ఈజిప్టుకు వెళ్లారు. యాకోబు మూలంగా కలిగిన పిల్లలు మొత్తం 66 మంది. (యాకోబు భార్యలు ఈ లెక్కలో లేరు). మరియు యోసేపు ఇద్దరు కుమారులు కూడ ఉన్నారు. వారు ఈజిప్టులో పుట్టారు. కనుక ఈజిప్టులో యాకోబు కుటుంబంలో 70 మంది ఉన్నారు. యాకోబు మొదట యూదాను యోసేపు దగ్గరకు పంపించాడు. గోషెను దేశంలోని యోసేపు దగ్గరకు యూదా వెళ్లాడు. ఆ తర్వాత యాకోబు, అతని వాళ్లు ఆ దేశంలో ప్రవేశించారు. యోసేపు తన తండ్రి వచ్చేస్తున్నాడని విన్నాడు. గోషెనులో తన తండ్రి ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు యోసేపు తన రథం సిద్ధం చేసుకొని బయల్దేరాడు. యోసేపు తన తండ్రిని చూడగానే అతని మెడమీద పడి కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు, “ఇప్పుడు నేను మనశ్శాంతిగా మరణించవచ్చు, నీ ముఖం నేను చూశాను, నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను చూడగలిగాను” అని యోసేపుతో చెప్పాడు. తన సోదరులతోను, తన తండ్రి కుటుంబంతోను యోసేపు ఇలా చెప్పాడు: “నేను వెళ్లి మీరు వచ్చినట్లు ఫరోతో చెబుతాను. ఫరోతో నేను ఏమని చెబుతానంటే ‘నా అన్నలు, నా తండ్రి కుటుంబం కనాను దేశం విడిచి ఇక్కడ నా దగ్గరకు వచ్చారు. ఈ నా కుటుంబం గొర్రెల కాపరుల కుటుంబం. నిత్యం వాళ్లు పశువుల్ని, మందల్ని కలిగి ఉండేవాళ్లు. వారి పశువుల్ని, వారికి కలిగిన అంతటిని వాళ్లతోబాటు వారు తెచ్చుకొన్నారు.’ ఫరో మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేం పని చేస్తారు? అని మిమ్మును అడుగుతాడు. అప్పుడు మీరు ‘మేము గొర్రెల కాపరులం, మా జీవితకాలమంతా మా పశువుల్ని మేపుకొంటూ జీవించాం. మాకు ముందు మా పూర్వీకులు ఇలాగే జీవించారు’ అని చెప్పండి. అప్పుడు ఫరో మిమ్మును గోషెను దేశంలో జీవింపనిస్తాడు. గొర్రెల కాపరులంటే ఈజిప్టు ప్రజలకు యిష్టం లేదు, కనుక మీరు గోషెను దేశంలో ఉండవచ్చు.”

ఆదికాండము 46:1-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు–యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు–చిత్తము ప్రభువా అనెను. ఆయన–నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను. నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, యోసేపు నీ కన్నులమీద తన చెయ్యి యుంచునని సెలవియ్యగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లెను. ఫరో అతని నెక్కించి తీసికొని వచ్చుటకు పంపిన బండ్లమీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపా దించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను. యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే; యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ. షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావూలు. లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు. ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను. జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబునకు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు. గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ. ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు. లాబాను తన కుమార్తెయైన లేయా కిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను. యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీ రోషు ముప్పీము హుప్పీము ఆర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు. దాను కుమారుడైన హుషీము. నఫ్తాలి కుమారులైన యహసేలు గూనీ యేసెరు షిల్లేము. లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు. యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బదిమంది. అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీదపడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో–నీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినిచూచి–నేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనానుదేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి; ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱెల కాపరులు. వారు తమ గొఱ్ఱెలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పెదను. గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు–మా చిన్నతనమునుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గలవారమై యున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను.