ఆదికాండము 45:1-8

ఆదికాండము 45:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు యోసేపు తన సేవకులందరి ఎదుట తనను తాను అదుపు చేసుకోలేక, “అందరిని నా ఎదుట నుండి పంపివేయండి!” అని బిగ్గరగా చెప్పాడు. తన సోదరులకు తనను తాను తెలియపరచుకున్నప్పుడు యోసేపుతో ఎవరు లేరు. అతడు ఈజిప్టువారు వినేటంతగా బిగ్గరగా ఏడ్చాడు, ఫరో ఇంటివారు దాని గురించి విన్నారు. యోసేపు తన సోదరులతో, “నేను యోసేపును! నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా?” అని అన్నాడు. అతన్ని చూసి అతని సోదరులు కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు. యోసేపు తన సోదరులతో, “నా దగ్గరకు రండి” అన్నాడు. వారు అతని దగ్గరకు వచ్చాక, “నేను మీ సోదరుడైన యోసేపును, మీరు ఈజిప్టుకు అమ్మివేసినవాన్ని! ఇప్పుడు నన్ను ఇక్కడకు అమ్మివేసినందుకు బాధపడకండి, మీపై మీరు కోప్పడకండి, ఎందుకంటే జీవితాలను రక్షించడానికి మీకంటే ముందే దేవుడు నన్ను పంపించారు. ఇప్పటికి దేశంలో కరువు వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది, ఇంకా వచ్చే అయిదు సంవత్సరాలు దున్నడం, కోత కోయడం ఉండదు. అయితే దేవుడు భూమిపై మిమ్మల్ని సంరక్షించి, మీ జీవితాలను కాపాడడానికి మీకంటే ముందు నన్ను ఇక్కడకు పంపించారు. “కాబట్టి ఇప్పుడు, నన్ను ఇక్కడకు పంపింది మీరు కాదు, దేవుడే. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటికి ప్రభువుగా, ఈజిప్టు అంతటికి పాలకునిగా చేశారు.

ఆదికాండము 45:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు యోసేపు తన దగ్గర నిలబడ్డ పరివారం ఎదుట తమాయించుకోలేక “అందరినీ నా దగ్గరనుంచి బయటికి పంపేయండి” అని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన అన్నలకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు అతని దగ్గర ఎవరూ లేరు. అతడు పెద్దగా ఏడవగా ఐగుప్తీయులు విన్నారు. ఫరో ఇంటివారు ఆ ఏడుపు విన్నారు. అప్పుడు యోసేపు “నేను యోసేపును. నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా?” అని అడిగినప్పుడు, అతని సోదరులు అతని సమక్షంలో కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు. అప్పుడు యోసేపు “నా దగ్గరికి రండి” అని తన సోదరులతో చెబితే, వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడతడు “ఐగుప్తుకు వెళ్లిపోయేలా మీరు అమ్మేసిన మీ తమ్ముడు యోసేపును నేనే. అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు. మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు.

ఆదికాండము 45:1-8 పవిత్ర బైబిల్ (TERV)

యోసేపు ఇంకెంతమాత్రం తనను తాను ఓర్చుకోలేక పోయాడు. అక్కడున్న ప్రజలందరి ముందు అతడు గట్టిగా ఏడ్చేశాడు. “అందర్నీ ఇక్కడనుండి వెళ్లిపొమ్మనండి” అన్నాడు యోసేపు. అందుచేత అందరూ అక్కడనుండి వెళ్లిపోయారు. ఆ సోదరులు మాత్రమే యోసేపు దగ్గర ఉన్నారు. అప్పుడు యోసేపు తాను ఎవరయిందీ వారితో చెప్పేశాడు. యోసేపు ఇంకా ఏడుస్తూనే ఉన్నందుచేత, ఫరో ఇంటిలో ఉన్న ఈజిప్టు ప్రజలంతా అది విన్నారు. యోసేపు తన సోదరులతో “మీ సోదరుడు యోసేపును నేనే, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?” అన్నాడు. కాని ఆ సోదరుల నోట మాట రాలేదు. వారు భయంతో కలవరపడిపోయారు. కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో, “నా దగ్గరకు రండి. ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలుతున్నాను, రండి” అన్నాడు. కనుక ఆ సోదరులంతా యోసేపుకు దగ్గరగా వెళ్లారు. యోసేపు వాళ్లతో చెప్పాడు, “నేనే మీ సోదరుణ్ణి, యోసేపును. ఈజిప్టుకు బానిసగా మీరు అమ్మిన వాడిని నేనే. ఇప్పుడేమీ బాధపడకండి. మీరు చేసినదాన్నిబట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు. మీ ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను. భయంకరమైన ఈ కరవు కాలం ఇప్పటికే రెండు సంవత్సరాలనుండి ఉంది. నాట్లు వేయకుండా, కోతలు కోయకుండా ఇంకా అయిదు సంవత్సరాలు గడచిపోవాలి. కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు. నేను యిక్కడికి పంపబడటం మీ తప్పుకాదు. అదంతా దేవుని సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేశాడు. ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు అంతటికిని నేను పాలకుడ్ని.”

ఆదికాండము 45:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్నుతాను అణచుకొనజాలక–నా యొద్దనుండి ప్రతిమనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్నుతాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు. అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి. అప్పుడు యోసేపు–నేను యోసేపును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగి నప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందర పడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి. అంతట యోసేపు–నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పి నప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు–ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. రెండు సంవత్సరములనుండి కరవు దేశములోనున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటి వారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను.