ఆదికాండము 43:1-34

ఆదికాండము 43:1-34 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దేశంలో కరువు ఇంకా తీవ్రంగా ఉంది. ఈజిప్టు నుండి తెచ్చుకున్న ధాన్యమంతా వారు తిన్న తర్వాత, వారి తండ్రి వారితో, “మీరు తిరిగివెళ్లి మన కోసం ఇంకా కొంచెం ఆహారం కొనండి” అని అన్నాడు. కానీ యూదా అతనితో, “ఆ మనుష్యుడు, ‘మీ తమ్ముడు మీతో ఉండే వరకు నన్ను మీరు మళ్ళీ చూడరు’ అని గట్టిగా హెచ్చరించాడు. ఒకవేళ మా తమ్మున్ని మాతో పంపితే, మేము వెళ్లి నీకు ఆహారం కొంటాము. కానీ ఒకవేళ అతన్ని పంపకపోతే, మేము వెళ్లం ఎందుకంటే, ‘మీ తమ్ముడు మీతో ఉండకపోతే మీరు నన్ను మళ్ళీ చూడరు’ అని ఆ మనుష్యుడు అన్నాడు” అని చెప్పాడు. “మీకు ఇంకొక సోదరుడున్నాడని చెప్పి ఎందుకు ఈ శ్రమ నాకు తెచ్చి పెట్టారు?” అని ఇశ్రాయేలు అడిగాడు. వారు, “ఆయన మమ్మల్ని ఖండితంగా ప్రశ్నించాడు. ‘మీ తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? మీకు ఇంకొక సోదరుడు ఉన్నాడా?’ అని అడిగాడు. మేము అతని ప్రశ్నలకు జవాబిచ్చాం అంతే. ‘మీ తమ్మున్ని ఇక్కడకు తీసుకురండి’ అని అంటాడని మాకు ఎలా తెలుస్తుంది?” అని అన్నారు. అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో, “బాలున్ని నాతో పంపించు, మేము వెంటనే వెళ్తాము. అప్పుడు మేము నీవు మా పిల్లలు చావకుండ బ్రతుకుతాము. నేను అతని భద్రతకు హామీ ఇస్తున్నాను; అతని కోసం నన్ను బాధ్యున్ని చేయవచ్చు. నేను అతన్ని నీ దగ్గరకు తిరిగి తీసుకువచ్చి నీ ఎదుట ఉంచకపోతే, నా జీవితం అంతా ఆ నిందను భరిస్తాను. ఇలా ఆలస్యం కాకపోయి ఉంటే, రెండవసారి కూడా వెళ్లి వచ్చియుండేవారం” అని అన్నాడు. అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు, “ఒకవేళ అలాగైతే, ఇలా చేయండి: దేశంలో ఉన్న శ్రేష్ఠమైన వాటిని అంటే ఔషధతైలం, కొంచెం తేనె, కొన్ని సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తా గింజలు, బాదం పప్పులు మీ సంచుల్లో పెట్టుకుని ఆ వ్యక్తికి కానుకగా తీసుకెళ్లండి. మీ దగ్గర ఉన్న వెండికి రెట్టింపు తీసుకెళ్లండి, ఎందుకంటే మీ గోనెసంచులలో పెట్టబడిన వెండిని మీరు తిరిగి ఇచ్చేయాలి. బహుశ అది పొరపాటు కావచ్చు. మీ సోదరున్ని కూడా తీసుకుని వెంటనే ఆ మనుష్యుని దగ్గరకు తిరిగి వెళ్లండి. సర్వశక్తిగల దేవుడు ఆ మనుష్యుని ఎదుట కరుణ చూపును గాక తద్వారా మీ ఇంకొక సోదరుడు బెన్యామీను మీతో తిరిగి వచ్చేలా అనుమతిస్తాడు. నా మట్టుకైతే, ఒకవేళ నేను కోల్పోవలసి వస్తే కోల్పోతాను.” కాబట్టి ఆ మనుష్యులు కానుకలను, రెట్టింపు డబ్బును, బెన్యామీనును కూడా తీసుకుని త్వరగా ఈజిప్టుకు వెళ్లి యోసేపు ఎదుట హాజరయ్యారు. యోసేపు వారితో బెన్యామీనును చూసి తన గృహనిర్వాహకునితో, “ఈ మనుష్యులను నా ఇంటికి తీసుకెళ్లి, ఒక జంతువును వధించి, భోజనం సిద్ధం చేయి; వారు మధ్యాహ్నం నాతో భోజనం చేస్తారు” అని చెప్పాడు. ఆ మనుష్యుడు యోసేపు చెప్పినట్టు చేశాడు, వారిని యోసేపు ఇంటికి తీసుకెళ్లాడు. యోసేపు వారిని తన ఇంటికి తీసుకెళ్లినందుకు ఆ మనుష్యులు భయపడ్డారు. “మొదటిసారి మన గోనెసంచులలో పెట్టబడిన వెండి గురించి మనం ఇక్కడకు రావలసివచ్చింది. అతడు మనపై దాడి చేసి, మనలను బానిసలుగా బంధించి మన గాడిదలను తీసుకుంటాడు” అని అనుకున్నారు. కాబట్టి వారు యోసేపు యొక్క గృహనిర్వాహకుని దగ్గరకు వెళ్లి ద్వారం దగ్గర అతనితో మాట్లాడారు. “అయ్యా, మా మనవి వినండి. మేము మొదటిసారి ఆహారం కొనడానికే వచ్చాము. కానీ మేము రాత్రి గడిపిన స్థలంలో మా గోనెసంచులను విప్పి చూస్తే, ఎవరు ఎంత వెండి తెచ్చారో సరిగ్గా అంతే వెండి వారి గోనెసంచిలో ఉంది. కాబట్టి మేము తిరిగి దానిని తెచ్చాము. ఆహారం కొనడానికి మరికొంత వెండిని కూడా తీసుకుని వచ్చాము. మా గోనెసంచులలో వెండిని ఎవరు పెట్టారో మాకు తెలియదు” అన్నారు. అప్పుడు అతడు, “మీకు క్షేమం కలుగును గాక మీరు భయపడకండి, మీ దేవుడు, మీ తండ్రి యొక్క దేవుడు, ఈ ధనాన్ని మీ గోనెసంచులలో పెట్టారు; మీ వెండి నాకు ముట్టింది” అని అన్నాడు. తర్వాత షిమ్యోనును వారి దగ్గరకు తీసుకువచ్చాడు. గృహనిర్వాహకుడు ఆ మనుష్యులను యోసేపు ఇంట్లోకి తీసుకెళ్లాడు, కాళ్లు కడుక్కోడానికి వారికి నీళ్లిచ్చాడు, వారి గాడిదలకు మేత పెట్టాడు. తాము భోజనం చేయాల్సింది అక్కడే అని విన్నందుకు మధ్యాహ్నం యోసేపు రాక కోసం తమ కానుకలను సిద్ధపరచుకున్నారు. యోసేపు ఇంటికి రాగానే, వారు ఇంట్లోకి తెచ్చిన కానుకలను అతనికి ఇచ్చి, అతని ఎదుట సాష్టాంగపడ్డారు. వారు ఎలా ఉన్నారని వారిని అడిగి, “వృద్ధుడైన మీ తండ్రి గురించి మీరు నాకు చెప్పారు కదా, ఆయన ఎలా ఉన్నారు? ఇంకా బ్రతికే ఉన్నారా?” అని అన్నాడు. వారు జవాబిస్తూ, “తమ దాసుడు, మా తండ్రి బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు” అన్నారు, అప్పుడు వారు తలవంచి, సాష్టాంగపడ్డారు. యోసేపు కళ్ళెత్తి తన తమ్ముడు అనగా తన సొంత తల్లి కుమారుడైన బెన్యామీనును చూసి, “మీరు నాకు చెప్పిన మీ చిన్న తమ్ముడు ఇతడేనా?” అని అడిగి, “నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక!” అని అన్నాడు. తమ్మున్ని చూడగానే యోసేపుకు అతని మీద ప్రేమ పొర్లుకు వచ్చింది, అందుకు అతడు వెంటనే లోపలి గదిలోకి వెళ్లి ఏడ్చాడు. తన ముఖం కడుక్కున్న తర్వాత, తనను తాను అదుపుచేసుకుని, “భోజనం వడ్డించండి” అని చెప్పాడు. సేవకులు యోసేపుకు తన బల్ల దగ్గర, అతని సోదరులకు వేరే బల్ల దగ్గర, అతనితో భోజనంచేస్తున్న ఈజిప్టువారికి వరుసగా భోజనం వడ్డించారు, ఎందుకంటే హెబ్రీయులతో కలసి భోజనం చేయడం ఈజిప్టువారికి అసహ్యము. వారి వయస్సు ప్రకారం మొదటివాడు మొదలుకొని చివరివాని వరకు అతని ఎదుట కూర్చున్నారు; వారు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. యోసేపు బల్ల నుండి వారికి భోజనం వడ్డించబడినప్పుడు, ఇతరులకంటే అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. కాబట్టి వారు అతనితో స్వేచ్ఛగా విందు చేసుకున్నారు, త్రాగారు.

ఆదికాండము 43:1-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తరువాత వారి తండ్రి “మీరు మళ్ళీ వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనండి” అని వారితో అన్నాడు. యూదా “అతడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖం చూడకూడదు, అని మాతో గట్టిగా చెప్పాడు. కాబట్టి నువ్వు మా తమ్ముణ్ణి మాతో పంపితే మేము వెళ్ళి నీ కోసం ఆహారం కొంటాము. నువ్వు వాణ్ణి పంపకపోతే మేము వెళ్ళం. మీ తమ్ముడు మీతో లేకపోతే మీరు నా ముఖం చూడకూడదని అతడు మాతో చెప్పాడు” అన్నాడు. అందుకు ఇశ్రాయేలు “మీకు ఇంకొక తమ్ముడు ఉన్నాడని మీరు అతనితో చెప్పి నాకు ఇంత కీడు ఎందుకు తెచ్చిపెట్టారు?” అన్నాడు. వారు “అతడు ‘మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా?’ అని మా గురించి, మన కుటుంబం గురించిన వివరాలు అడిగాడు. మేము ఆ ప్రశ్నలకు తగినట్టు జవాబిచ్చాము. ‘మీ తమ్ముణ్ణి తీసుకు రండి’ అని అతడు అడుగుతాడని మాకెలా తెలుస్తుంది?” అన్నారు. యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో “ఆ చిన్నవాణ్ని నాతో పంపు. మేము వెళతాము. అప్పుడు మేమే కాదు, నువ్వూ మా పిల్లలూ చావకుండా బతుకుతాం. నేను అతనికి జామీను ఉంటాను. నువ్వు నన్ను బాధ్యుడుగా ఎంచవచ్చు. నేను అతణ్ణి తిరిగి నీ దగ్గరికి తీసుకువచ్చి నీముందు నిలబెట్టకపోతే నా జీవితమంతా ఆ నింద భరిస్తాను. మాకు ఆలస్యం కాకపోతే ఈపాటికి రెండవ సారి వెళ్లి మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళమే” అన్నాడు. వారి తండ్రి ఇశ్రాయేలు, వారితో “అలాగైతే మీరిలా చేయండి. ఈ దేశంలోని మేలైన వస్తువులను మీ సంచుల్లో వేసుకుని తీసుకెళ్ళండి. కొంచెం సుగంధ ద్రవ్యాలు, కొంచెం తేనె, మసాలా దినుసులు, బోళం, పిస్తా కాయలు, బాదం కాయలు మీ సంచుల్లో వేసుకుని అతనికి కానుకగా తీసుకెళ్లండి. రెండింతల డబ్బు తీసుకు వెళ్ళండి. మీ సంచుల మూతిలో వాళ్ళు ఉంచిన డబ్బు కూడా మళ్ళీ చేత పట్టుకుని వెళ్ళండి. బహుశా అది పొరబాటు కావచ్చు. మీ తమ్ముణ్ణి వెంటబెట్టుకుని అతని దగ్గరికి తిరిగి వెళ్ళండి. అతడు మీ అన్ననూ బెన్యామీనును మీకు అప్పగించేలా సర్వశక్తుడైన దేవుడు, అతని ముందు మిమ్మల్ని కరుణించు గాక. నేను సంతానాన్ని పోగొట్టుకోవలసి ఉంటే పోగొట్టుకుంటాను” అని వారితో చెప్పాడు. వాళ్ళు ఆ కానుక తీసికుని, చేతుల్లో రెండింతల డబ్బు, తమవెంట బెన్యామీనును తీసుకు ఐగుప్తుకు వెళ్ళి యోసేపు ముందు నిలబడ్డారు. యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూసి తన గృహనిర్వాహకునితో “వీరిని ఇంట్లోకి తీసికెళ్ళి ఒక జంతువును కోసి వంట సిద్ధం చేయించు. మధ్యాహ్నం వీరు నాతో భోజనం చేస్తారు” అని చెప్పాడు. యోసేపు చెప్పినట్లు అతడు చేసి వారిని యోసేపు ఇంటికి తీసికెళ్ళాడు. తమను యోసేపు ఇంటికి తీసుకువెళ్ళినందుకు వారు భయపడి “మొదట మన సంచుల్లో తిరిగి ఇచ్చేసిన డబ్బు కోసం అతడు మన మీద దాడి చేసే అవకాశం ఉంది. మనలను బంధించి, దాసులుగా చెరపట్టి, మన గాడిదలను తీసుకోవచ్చు” అనుకున్నారు. వారు యోసేపు గృహనిర్వాహకుని దగ్గరికి వచ్చి, ఇంటి గుమ్మం ముందు అతనితో మాట్లాడి, “అయ్యగారూ, మొదట మేము ఆహారం కొనడానికి మొదటిసారి వచ్చాము. అయితే, మేము దిగిన చోటికి చేరి మా సంచులు విప్పితే, చూడండి, మా అందరి డబ్బు మొత్తం, ఎవరి డబ్బు వారి సంచి మూతిలో ఉంది. అదంతా పట్టుకొచ్చాము. ఆహారం కొనడానికి వేరే డబ్బు కూడా తెచ్చాము. మా డబ్బు మా సంచుల్లో ఎవరు వేశారో మాకు తెలియదు” అని చెప్పారు. అందుకతడు “మీకు అంతా క్షేమమే. భయపడవద్దు. మీ తండ్రి దేవుడూ, మీ దేవుడు, మీ సంచుల్లో మీ డబ్బు పెట్టి ఉంటాడు. మీ డబ్బు నాకు అందింది” అని చెప్పి షిమ్యోనును వారి దగ్గరికి తెచ్చాడు. గృహనిర్వాహకుడు వారిని యోసేపు ఇంట్లోకి తీసికు వచ్చి, వారికి నీళ్ళిస్తే, వారు కాళ్ళు కడుక్కున్నారు. అతడు వారి గాడిదలకు మేత వేయించాడు. అక్కడ తాము భోజనం చేయాలని వారు విన్నారు కాబట్టి మధ్యాహ్నం, యోసేపు వచ్చే సమయానికి తమ కానుక సిద్ధంగా ఉంచారు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంట్లోకి తెచ్చి, అతనికి నేలను వంగి, నమస్కారం చేశారు. అప్పుడు “మీరు చెప్పిన ముసలివాడైన మీ నాన్న క్షేమంగా ఉన్నాడా? అతడు ఇంకా బతికే ఉన్నాడా?” అని వారి క్షేమ సమాచారం అడిగినప్పుడు వారు, “నీ దాసుడైన మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు” అని చెప్పి వంగి సాగిలపడ్డారు. అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడూ తన తమ్ముడు అయిన బెన్యామీనును చూసి “మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా?” అని అడిగి “బాబూ, దేవుడు నీకు దయ చూపుతాడు గాక” అన్నాడు. అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకుని వచ్చింది కాబట్టి అతడు త్వరగా ఏడవడానికి చోటు వెతికి, లోపలి గదిలోకి వెళ్ళి, అక్కడ ఏడ్చాడు. అతడు తన ముఖం కడుక్కుని బయటికి వచ్చాడు. అతడు తన్ను తాను సముదాయించుకుని “భోజనం వడ్డించండి” అని చెప్పాడు. అతనికీ వారికీ అతనితో భోజనం చేస్తున్న ఐగుప్తీయులకు వేర్వేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు అసహ్యం. పెద్దవాడు మొదలుకుని చిన్నవాడి వరకూ వారు అతని ముందు తమ తమ వయసు ప్రకారం కూర్చున్నారు. వారంతా ఆశ్చర్యపోయారు. అతడు తన దగ్గర నుంచి వారికి పళ్ళేల్లో భోజనం వంతులెత్తి పంపాడు. బెన్యామీను వంతు వారందరి వంతులకంటే అయిదంతలు ఎక్కువగా ఉంది. వారంతా తాగి, యోసేపుతో విందారగించి ఉల్లాసంగా గడిపారు.

ఆదికాండము 43:1-34 పవిత్ర బైబిల్ (TERV)

దేశంలో కరువు చాలా దారుణంగా ఉంది. అక్కడ ఎలాంటి ఆహారం పండటం లేదు. ప్రజలు ఈజిప్టునుండి తెచ్చుకొన్న ధాన్యం అంతా తినేసారు. ధాన్యం అయిపోయినప్పుడు, “మళ్లీ ఈజిప్టుకు వెళ్లి, మనం తినేందుకు మరింత ధాన్యం కొనండి” అని యాకోబు తన కుమారులతో చెప్పాడు. అయితే యాకోబుతో యూదా చెప్పాడు: “మీ సోదరుడ్ని మీరు నా దగ్గరకు తీసుకొని రాకపోతే నేను మీతో మాట్లాడను అని ఆ దేశ పాలకుడు మమ్మల్ని హెచ్చరించాడు. బెన్యామీనును నీవు మాతో పంపిస్తేనే మేము వెళ్లి ధాన్యం కొంటాం. కానీ బెన్యామీనును పంపించేందుకు నీవు ఒప్పుకొనకపోతే మేము వెళ్లం. అతడు లేకుండా తిరిగి రావద్దని ఆయన మమ్మల్ని హెచ్చరించాడు.” “మీకు ఇంకో సోదరుడు ఉన్నాడని అసలు మీరెందుకు చెప్పారు? ఇంత కీడు మీరెందుకు నాకు చేశారు?” ఇశ్రాయేలు (యాకోబు) అడిగాడు. ఆ సోదరులు జవాబు చెప్పారు: “ఆ మనిషి మమ్మల్ని అనేక ప్రశ్నలు వేశాడు. మా విషయం, మా కుటుంబం విషయం అతడు తెలుసుకోవాలనుకున్నాడు, ‘మీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా? ఇంటి దగ్గర మీకు ఇంకో సోదరుడు ఉన్నాడా?’ అని అతడు మమ్మల్ని అడిగాడు. అతని ప్రశ్నలకు మాత్రమే మేము జవాబిచ్చాం. మా మిగిలిన సోదరుని కూడ తన దగ్గరకు తీసుకొని రమ్మంటాడని మాకు తెలియదు!” అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో ఇలా చెప్పాడు: “బెన్యామీనును నాతో పంపించు. అతని విషయం నేను జాగ్రత్తగా చూసుకొంటాను. మేము మాత్రం ఈజిప్టుకు వెళ్లాలి, ఆహారం తీసుకురావాలి. మేము వెళ్లకపోతే మనమూ, మన పిల్లలూ అందరం చస్తాం. అతని క్షేమం నేను చూసుకొంటాను. అతని భాద్యత నాది. అతణ్ణి నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే శాశ్వతంగా నీవు నన్ను నిందించవచ్చు. నీవు మమ్మల్ని వెళ్లనిచ్చి ఉంటే ఇప్పటికి రెండు సార్లు వెళ్లి వచ్చే వాళ్లం.” అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు: “ఇదే గనుక నిజంగా సత్యమైతే, అలాగే బెన్యామీనును నీతో తీసుకొని వెళ్లు. అయితే ఆ పాలకునికి కానుకలు తీసుకొని వెళ్లు. మన దేశంలో మనం సంపాదించగలిగినవి కొన్ని తీసుకొని వెళ్లు. కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తాచ కాయలు, బాదం కాయలు, అతనికి తీసుకొని వెళ్లండి. ఈ సారి రెండంతల డబ్బు మీతో తీసుకు వెళ్లండి. పోయిన సారి మీరు చెల్లించగా తిరిగి మీకు ఇవ్వబడిన సొమ్ము మళ్లీ తీసుకు వెళ్లండి. ఒకవేళ ఆ పాలకుడు పొరబడ్డాడేమో. బెన్యామీనును తీసుకొని ఆ మనిషి దగ్గరకు తిరిగి వెళ్లు. మీరు ఆ పాలకుని ముందర నిలిచినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను. బెన్యామీను, షిమ్యోనులను అతడు క్షేమంగా తిరిగి వెళ్లనిచ్చేటట్లు నేను ప్రార్థన చేస్తాను. లేనట్లయితే నా కుమారుని పోగొట్టుకొని నేను మరల దుఃఖంలో మునిగిపోతాను.” కనుక ఆ పాలకుని కోసం కానుకలన్నీ తీసుకొన్నారు ఆ సోదరులు. వారు మొదటిసారి తీసుకొని వెళ్లిన దానికి రెట్టింపు సొమ్ము వారితో కూడా తీసుకొని వెళ్లారు. బెన్యామీను ఆ సోదరులతో కలిసి ఈజిప్టుకు వెళ్లాడు. ఈజిప్టులో, వారితోబాటు బెన్యామీను ఉండటం యోసేపు చూశాడు. యోసేపు, “ఆ మనుష్యుల్ని నా ఇంటికి తీసుకొని రండి. ఒక పశువును చంపి వంట చేయండి. ఈవేళ మధ్యాహ్నం వాళ్లు నాతోనే భోజనం చేస్తారు” అని తన గృహనిర్వాహకునితో చెప్పాడు. అతను చెప్పినట్లే ఆ సేవకుడు చేశాడు. అతడు వాళ్లను యోసేపు ఇంటికి తీసుకొని వచ్చాడు. వాళ్లు యోసేపు ఇంటికి తీసుకొని రాబడినప్పుడు ఆ సోదరులు భయపడ్డారు. “పోయినసారి మన సంచుల్లో డబ్బు ఉంచబడినందువల్లనే మనల్ని ఇక్కడకు తీసుకు వచ్చారు. మనల్ని నేరస్తులుగా నిరూపించటానికి దాన్ని వారు వినియోగిస్తారు. తర్వాత మన గాడిదల్ని దొంగిలించి, మనల్ని బానిసలుగా చేస్తారు” అని వారనుకొన్నారు. కనుక యోసేపు ఇంటికి బాధ్యుడైనవాని దగ్గరకు ఆ సోదరులు వెళ్లారు. వారు చెప్పారు: “అయ్యా, ప్రమాణం చేసి సత్యం చెబుతున్నాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేము వచ్చాం. ఇంటికి వెళ్తూ మార్గంలో మేము మా సంచులు విప్పితే, మా ప్రతి ఒక్కరి సంచిలోనూ డబ్బు కనబడింది. ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు. అయితే ఆ డబ్బు మళ్లీ మీకు ఇచ్చేయాలని ఇప్పుడు మాతో తెచ్చాం. పైగా ఇప్పుడు మేము కొనాలనుకొంటున్న ధాన్యంకోసం ఇంకా ఎక్కువ మొత్తంకూడ మళ్లీ ఇప్పుడు తెచ్చాం.” అయితే ఆ సేవకుడు, “భయపడకండి, నన్ను నమ్మండి. మీ దేవుడు, మీ తండ్రి దేవుడు ఆ డబ్బును మీ సంచుల్లో కానుకగా పెట్టి ఉంటాడు. పోయినసారి ధాన్యంకోసం డబ్బును మీరు నాకే చెల్లించినట్లు నాకు గుర్తు” అని వారితో చెప్పాడు. ఆ సేవకుడు షిమ్యోనును చెరసాలలోనుంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఆ సేవకుడు వాళ్లందరిని యోసేపు ఇంటికి తీసుకొని వెళ్లాడు. అతడు వారికి నీళ్లు ఇస్తే, వాళ్లు కాళ్లు కడుక్కొన్నారు. తర్వాత అతడు వారి గాడిదలకు మేత పెట్టాడు. ఆ సోదరులు తాము యోసేపుతోబాటు భోంచేయబోతున్నట్లు విన్నారు. కనుక వారు అతనికోసం తెచ్చిన కానుకల్ని మధ్యాహ్నంవరకు సిద్ధం చేసుకొన్నారు. యోసేపు ఇంటికి వచ్చాడు, ఆ సోదరులు వారితో తెచ్చిన కానుకలు అతనికి ఇచ్చారు. తర్వాత వారు నేలమీద సాష్టాంగపడ్డారు. వారెలా ఉన్నారని యోసేపు వాళ్లను అడిగాడు, “మీరు నాతో చెప్పిన మీ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా?” అన్నాడు యోసేపు. ఆ సోదరులు, “అయ్యా, మా తండ్రి బాగున్నాడు. ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడు” అని జవాబిచ్చారు. మళ్లీ వాళ్లంతా యోసేపు ముందర సాష్టాంగపడ్డారు. అప్పుడు యోసేపు తన సోదరుడు బెన్యామీనును చూశాడు, (బెన్యామీను, యోసేపు ఒక్క తల్లి పిల్లలు). “మీరు నాతో చెప్పిన మీ చిన్న సోదరుడు ఇతడేనా?” అని యోసేపు అడిగాడు. అప్పుడు యోసేపు, “కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించు గాక!” అన్నాడు బెన్యామీనుతో. అప్పుడు యోసేపు ఆ గదిలోనుంచి పరుగెత్తిపోయాడు. బెన్యామీను మీద తనకు ఉన్న ప్రేమను అతనికి చూపెట్టాలని యోసేపు ఎంతో ఆశించాడు. అతనికి ఏడ్చెయ్యాలనిపించింది గాని అతడు ఏడ్వటం అతని సోదరులు చూడకూడదు అనుకొన్నాడు. కనుక యోసేపు తన గదిలోనికి పరుగెత్తి పోయి అక్కడ ఏడ్చాడు. తర్వాత యోసేపు తన ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు. అతడు తనను తాను ఓదార్చుకొని, “భోజనానికి వేళ అయ్యింది” అన్నాడు. ఆ సేవకులు యోసేపు ఒక్కడిని ఒక బల్ల దగ్గర వేరుగాను, సోదరులను మరో బల్ల దగ్గర వేరుగాను కూర్చుండబెట్టారు. వారితో భోంచేస్తున్న ఈజిప్టు వారిని వారి మట్టుకే ఒక బల్లదగ్గర కూర్చుండ బెట్టారు. ఈజిప్టువాళ్లు హీబ్రూవారితో కలిసి భోజనం చేయరు, అది ఈజిప్టు మత విరోధం. యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ సోదరులను పెద్దవానితో మొదలుబెట్టి చిన్నవాని వరకు వరుసక్రమంలో కూర్చోబెట్టారు. అందువల్ల వాళ్ళకు ఆశ్చర్యమైంది. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్లు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటున్నారు. సేవకులు యోసేపు బల్లమీద నుంచే వారికి భోజనం వడ్డిస్తున్నారు. అయితే ఆ సేవకులు మిగిలిన వాళ్లకంటె అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. ఆ సోదరులు దాదాపు మత్తెక్కినంత వరకు యోసేపుతో కలిసి తిని త్రాగారు.

ఆదికాండము 43:1-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి–మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా యూదా అతని చూచి–ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనేగాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. కాబట్టి నీవు మా తమ్ముని మాతోకూడ పంపినయెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము. నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడు–మీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను. అందుకు ఇశ్రాయేలు–మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా వారు–ఆ మనుష్యుడు–మీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మునుగూర్చియు మా బంధువులనుగూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి–మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి. యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి–ఆ చిన్న వానిని నాతోకూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము; నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టనియెడల ఆ నింద నామీద ఎల్లప్పుడును ఉండును. మాకు తడవు కాక పోయినయెడల ఈపాటికి రెండవమారు తిరిగి వచ్చి యుందుమని చెప్పగా వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితో–అట్లయిన మీ రీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొని పోవుడి. రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేతపట్టుకొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును; మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి. ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై యుండవలసినయెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను. ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి. యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహ కునితో–ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను. ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందునవారు భయపడి–మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపెట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి. వారు యోసేపు గృహనిర్వాహకునియొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడి –అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగినచోటికి వచ్చి మా గోనెలను విప్పి నప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరి రూకలను తీసికొని వచ్చితిమి; మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. అందుకతడు–మీకు క్షేమమగునుగాక భయపడకుడి; మీపితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారియొద్దకు తీసికొని వచ్చెను. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసికొని వచ్చి వారికి నీళ్లియ్యగా వారు కాళ్లు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి. యోసేపు ఇంటికి వచ్చి నప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు –మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంక బ్రతికియున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగినందుకు వారు –నీ దాసుడైన మా తండ్రి ఇంక బ్రదికియున్నాడు క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి–మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి –నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అనెను. అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్నుతాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను. అతనికిని వారికిని అతనితో భోజనముచేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠునివరకు వారు అతని యెదుట తమతమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తనయెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.