ఆదికాండము 4:1-16
ఆదికాండము 4:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అటు తర్వాత ఆదాము హవ్వను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై కయీనుకు జన్మనిచ్చింది. “యెహోవా సహాయంతో నేను కుమారున్ని సంపాదించుకున్నాను” అని ఆమె అన్నది. తర్వాత అతని సహోదరుడైన హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి, కయీను వ్యవసాయకుడు. కోత సమయం వచ్చినప్పుడు కయీను పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడా తన గొర్రెలలో మొదటి సంతానంగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పణగా తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను అంగీకరించారు. కానీ కయీనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. అందుకు కయీనుకు చాలా కోపం వచ్చి ముఖం మాడ్చుకున్నాడు. అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నారు, “నీవెందుకు కోపంతో ఉన్నావు? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకొన్నావు? నీవు చేసేది మంచిదైతే నీవు అంగీకరించబడవా? నీవు సరియైనది చేయకపోతే, పాపం నీ వాకిట్లో పొంచుకొని ఉంది; అది నిన్ను పొందుకోవాలని వాంఛతో ఉంది, కానీ నీవు దానిని జయించాలి.” ఒక రోజు కయీను తన తమ్మున్ని పిలిచి, “మనం పొలానికి వెళ్దాం” అని అన్నాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను హేబెలు మీద దాడి చేసి అతన్ని చంపేశాడు. అప్పుడు యెహోవా కయీనును, “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అని అడిగారు. అందుకు అతడు, “ఏమో నాకు తెలియదు, నేనేమైన నా తమ్మునికి కావలివాడినా?” అని అన్నాడు. అందుకు యెహోవా, “నీవేం చేశావు? విను, నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది. ఇప్పుడు నీవు శపించబడ్డావు, నీ చేతి నుండి వచ్చిన నీ తమ్ముని రక్తాన్ని పీల్చుకున్న నేల నుండి నీవు తరిమివేయబడ్డావు. నీవు భూమిలో ఎంత కృషి చేసినా, అది ఇకమీదట నీకు మంచి పంటను ఇవ్వదు. నీవు భూమిపై విశ్రాంతి లేని దేశదిమ్మరిగా ఉంటావు” అని చెప్పారు. కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది. ఈ రోజు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు, మీ సన్నిధిలో నుండి దూరం చేశారు; నేను విశ్రాంతి లేని దేశదిమ్మరిని అవుతాను, నేను కంటపడితే నన్ను చంపేస్తారు” అని అన్నాడు. అయితే యెహోవా అతనితో, “అలా జరగదు; ఎవరైనా కయీనును చంపితే, వారు ఏడు రెట్లు ఎక్కువ శిక్ష అనుభవిస్తారు” అని అన్నారు. అప్పుడు యెహోవా కయీనును ఎవరూ చంపకుండ ఉండేలా కయీను మీద ఒక గుర్తు వేశారు. కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లి ఏదెనుకు తూర్పున ఉన్న నోదు దేశంలో నివసించాడు.
ఆదికాండము 4:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆదాము తన భార్య హవ్వను కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చి కయీనుకు జన్మనిచ్చింది. ఆమె “యెహోవా సహాయంతో నేనొక మగ బిడ్డకు జన్మనిచ్చాను” అంది. తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి. కయీను వ్యవసాయం చేసేవాడు. కొంతకాలం తరువాత కయీను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత యెహోవాకు అర్పణ ఇవ్వడానికి తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు. కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించ లేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు. యెహోవా కయీనుతో “ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు? నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి” అన్నాడు. కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేశాడు. అప్పుడు యెహోవా కయీనుతో “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అన్నాడు. అతడు “నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపలా వాడినా?” అన్నాడు. దేవుడు “నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతూ ఉంది. ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండాా నువ్వు శాపానికి గురయ్యావు. నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు” అన్నాడు. కయీను “నా శిక్ష నేను భరించలేనిది. ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ భూమి మీద పలాయనం అవుతూ, దేశదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు” అన్నాడు. యెహోవా అతనితో “అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను శిక్షించిన దానికి ఏడు రెట్లు అలాటి వాణ్ణి శిక్షిస్తాను” అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు. కాబట్టి కయీను యెహోవా సన్నిధిలోనుంచి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పువైపు ఉన్న నోదు ప్రాంతంలో నివాసం ఉన్నాడు.
ఆదికాండము 4:1-16 పవిత్ర బైబిల్ (TERV)
ఆదాముకు అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు కయీను అని నామకరణం జరిగింది. హవ్వ “యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని పొందాను” అంది. ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. ఈ శిశువు కయీనుకు తమ్ముడు. అతనికి హేబెలు అని నామకరణం చేశారు. హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. కయీను వ్యవసాయదారుడయ్యాడు. కోతకాలంలో కయీను యెహోవాకు ఒక అర్పణను తెచ్చాడు. నేలనుండి తాను పండించిన ఆహార పదార్థాన్ని కయీను తెచ్చాడు. హేబెలు తన మందలో నుండి కొన్ని మంచి బలిసిన తొలిచూలు గొర్రెల్ని తెచ్చాడు. హేబెలును, అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. అయితే కయీనును, అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందువల్ల కయీను దుఃఖించాడు. అతనికి చాలా కోపం వచ్చేసింది. యెహోవా కయీనును అడిగాడు: “నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం అలా విచారంగా ఉందేమిటి? నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు. అప్పుడు నిన్ను నేను అంగీకరిస్తాను. కాని నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకొంటుంది. కానీ నీవే ఆ పాపమును అదుపులో పెట్టాలి.” “మనం పొలంలోకి వెళ్దాం రా” అన్నాడు కయీను తన తమ్ముడైన హేబెలుతో. కనుక కయీను, హేబెలు పొలంలోకి వెళ్లారు. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేశాడు. తర్వాత, “నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు?” అంటూ కయీనును యెహోవా అడిగాడు. “నాకు తెలియదు. నా తమ్ముణ్ణి కాపలా కాయడం, వాణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకోవడమేనా నా పని?” అని కయీను జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా యిలా అన్నాడు, “నీవు చేసింది ఏమిటి? నీవే నీ తమ్ముణ్ణి చంపేసావు. నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొర పెట్టుతూ వుంది. (నీవు నీ తమ్ముణ్ణి చంపావు) నీ చేతులనుండి అతని రక్తాన్ని తీసుకోవటానికి భూమి నోరు తెరచుకుంది. భూమిమీద నుండి నీవు శపించబడ్డావు. ఇది వరకు నీవు మొక్కలు నాటుకొన్నావు. అవి చక్కగా పెరిగాయి. కాని ఇప్పుడు నీవు మొక్కలు నాటినా, నీ మొక్కలు ఏపుగా ఎదగటానికి నేల తోడ్పడదు. భూమి మీద నీకు ఇల్లు కూడా ఉండదు. ఒక చోటు నుండి మరొక చోటుకు నీవు తిరుగుతూ ఉంటావు.” అప్పుడు కయీను అన్నాడు: “ఇది నేను భరించలేని శిక్ష! చూడు! నన్ను ఈ భూమిని విడిచిపెట్టేటట్లు నీవు బలవంతం చేశావు. నేను నీనుండి వెళ్లిపోయి దాగుకొంటాను. (నీ రక్షణనుండి దూరంగా వెళ్తాను). నేనిక్కడ, అక్కడ తిరుగుతుంటాను. నన్ను ఎవరు చూస్తారో వాళ్లు నన్ను చంపేస్తారు.” అప్పుడు కయీనుతో యెహోవా ఇలా అన్నాడు: “నేను అలా జరుగనివ్వను! కయీనూ, నిన్ను ఎవరైనా చంపితే, నేను వారిని మరింతగా శిక్షిస్తా.” తరువాత కయీనుకు యెహోవా ఒక గుర్తు వేశాడు. ఎవ్వరూ అతణ్ణి చంపకూడదు అని ఈ గుర్తు సూచిస్తుంది. అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు. ఏదెనుకు తూర్పునవున్న నోదు దేశములో కయీను నివసించాడు.
ఆదికాండము 4:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని–యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను; కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తనముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో–నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలుమీదపడి అతనిని చంపెను. యెహోవా–నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు –నే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయన–నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తముయొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు; నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అందుకు కయీను –నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడోవాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో–కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతి దండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను.