ఆదికాండము 37:1-29
ఆదికాండము 37:1-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యాకోబు తన తండ్రి ప్రవాసమున్న కనాను దేశంలో నివసించాడు. యాకోబు వంశావళి వివరాలు ఇవి. యోసేపు పదిహేడు సంవత్సరాల యువకుడు, తన అన్నలతో, తన తండ్రి భార్యలైన బిల్హా జిల్పాల కుమారులతో కలిసి మందలను మేపుతూ ఉండేవాడు. వారు చేసే చెడు పనుల గురించి తండ్రికి చెప్పేవాడు. ఇశ్రాయేలు తన ఇతర కుమారుల కంటే యోసేపును ఎక్కువ ప్రేమించాడు, ఎందుకంటే అతడు తన వృద్ధాప్యంలో పుట్టినవాడు; అతని కోసం ఒక ప్రత్యేకమైన బాగా అలంకరించబడిన అంగీని కుట్టించాడు. తమ తండ్రి అతన్ని తమకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చూసి వారు యోసేపును ద్వేషించారు, అతని క్షేమసమాచారం కూడా అడగలేదు. ఒక రోజు యోసేపుకు ఒక కల వచ్చింది, అది తన అన్నలకు చెప్పినప్పుడు వారతన్ని మరీ ఎక్కువగా ద్వేషించారు. అతడు వారితో, “నాకు వచ్చిన కలను వినండి: మనం పొలంలో వరి పనలు కడుతున్నాము, అప్పుడు అకస్మాత్తుగా నా పన లేచి నిలబడింది, నా పన చుట్టూ మీ పనలు చేరి సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు. అతని అన్నలు అతనితో, “నీవు మమ్మల్ని ఏలాలి అనుకుంటున్నావా? నిజంగా మమ్మల్ని ఏలుతావా?” అని అన్నారు. అతని కలను బట్టి వారు అతన్ని ఇంకా ద్వేషించారు. అతనికి మరో కల వచ్చింది, “వినండి. నాకు ఇంకొక కల వచ్చింది, ఈసారి సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి” అని తన అన్నలకు చెప్పాడు. తన తండ్రికి తన అన్నలకు ఈ కలను గురించి చెప్పినప్పుడు, తన తండ్రి అతని గద్దిస్తూ, “నీకు వచ్చిన ఈ కల ఏంటి? నీ తల్లి, నేను, నీ అన్నలు నీ ఎదుట నిజంగా సాష్టాంగపడాలా?” అని అన్నాడు. యోసేపు అన్నలు అతనిపై అసూయపడ్డారు కానీ అతని తండ్రి ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నాడు. యోసేపు అన్నలు తమ తండ్రి మందలను మేపడానికి షెకెముకు వెళ్లారు. ఒక రోజు ఇశ్రాయేలు యోసేపుతో, “నీ అన్నలు షెకెము దగ్గర మందలను మేపుతున్నారని నీకు తెలుసు కదా. రా, నేను నిన్ను వారి దగ్గరకు పంపుతాను” అని అన్నాడు. “సరే, మంచిది” అని అతడు జవాబిచ్చాడు. కాబట్టి యాకోబు, “వెళ్లు, నీ అన్నలు, అలాగే మందల యోగక్షేమాలు తెలుసుకుని, వచ్చి నాకు చెప్పు” అని యోసేపుతో అన్నాడు. తర్వాత అతడు హెబ్రోను లోయ నుండి అతన్ని పంపించాడు. యోసేపు షెకెముకు చేరుకున్నప్పుడు, అతడు పొలాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండడం ఒక మనుష్యుడు చూసి, “నీవు ఏం వెదకుతున్నావు?” అని అడిగాడు. యోసేపు జవాబిస్తూ, “నేను మా అన్నల కోసం వెదకుతున్నాను. వారు తమ మందలను ఎక్కడ మేపుతున్నారో మీరు చెప్పగలరా?” అని అడిగాడు. “వారు ఇక్కడినుండి వెళ్లిపోయారు. ‘మనం దోతానుకు వెళ్దాం’ అని వారు అనుకోవడం నేను విన్నాను” అని ఆ వ్యక్తి అన్నాడు. కాబట్టి యోసేపు తన అన్నలను వెదుకుతూ వెళ్లి దోతానులో వారిని కనుగొన్నాడు. అయితే వారు అతన్ని దూరం నుండి చూడగానే, అతడు వారిని చేరకముందే, వారు అతన్ని చంపడానికి కుట్రపన్నారు. “కలలు కనేవాడు వస్తున్నాడు!” అని వారు ఒకరితో ఒకరు అనుకున్నారు. “రండి, వాన్ని చంపి ఈ బావులలో ఒక దాంట్లో పడవేద్దాం, క్రూరమృగం చంపేసిందని చెప్పుదాము. అప్పుడు వీని కలలు ఏమైపోతాయో చూద్దాం” అని అనుకున్నారు. రూబేను ఇది విని, అతన్ని వారి నుండి రక్షించాలని ప్రయత్నించాడు. “మనం అతన్ని చంపొద్దు. రక్తం చిందించవద్దు. అరణ్యంలో ఈ బావిలో వాన్ని పడద్రోయండి కానీ వానికి హానిచెయ్యవద్దు” అని అన్నాడు. యోసేపును వారి నుండి కాపాడి తన తండ్రి దగ్గరకు తిరిగి తీసుకెళ్లడానికి రూబేను ఇలా అన్నాడు. కాబట్టి యోసేపు తన అన్నల దగ్గరకు రాగానే, అతడు వేసుకున్న రంగుల అంగీని చింపేశారు. అతన్ని తీసుకెళ్లి బావిలో పడద్రోసారు. ఆ బావి ఖాళీగా ఉంది; అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, కళ్ళెత్తి చూశారు, గిలాదు నుండి ఇష్మాయేలీయుల వర్తక బాటసారుల గుంపు ఒకటి రావడం కనిపించింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం మోస్తూ ఉన్నాయి, వారు వాటిని ఈజిప్టుకు తీసుకెళ్తున్నారు. యూదా తన అన్నలతో, “మన తమ్మున్ని చంపి, అతని రక్తం దాచిపెట్టడం ద్వారా మనకు ఉపయోగం ఏంటి? రండి, వీడిని మనం ఏమి హాని చేయకుండా, ఇష్మాయేలీయులకు అమ్మివేద్దాం; ఎంతైనా మన తమ్ముడు మన సొంత శరీరం కదా” అని అన్నాడు. అతని అన్నలు అందుకు ఒప్పుకున్నారు. కాబట్టి మిద్యాను వర్తకులు అటు వచ్చినప్పుడు, యోసేపును తన అన్నలు బావిలో నుండి బయటకు లాగి ఇరవై షెకెళ్ళ వెండికి ఆ ఇష్మాయేలీయులకు అమ్మివేశారు, వారు అతన్ని ఈజిప్టుకు తీసుకెళ్లారు. రూబేను ఆ బావి దగ్గరకు తిరిగివచ్చి, అక్కడ యోసేపు లేడని చూసి, తన బట్టలు చింపుకున్నాడు.
ఆదికాండము 37:1-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యాకోబు తన తండ్రి పరదేశీయుడుగా ఉండిన కనాను దేశంలో నివసించాడు. యాకోబు జీవిత వృత్తాంతం ఇది. యోసేపు పదిహేనేళ్ళ వాడుగా ఉన్నప్పుడు తన సోదరులతో కూడ మందను మేపుతూ ఉన్నాడు. అతడు చిన్నవాడుగా తన తండ్రి భార్యలైన బిల్హా కొడుకుల దగ్గరా జిల్పా కొడుకుల దగ్గరా ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడ్డ పనులను గూర్చిన సమాచారం వారి తండ్రికి చేరవేసేవాడు. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతణ్ణి ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగీ కుట్టించాడు. అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు. యోసేపు ఒక కల కని తన సోదరులతో దాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగపట్టారు. అతడు వారితో ఇలా చెప్పాడు. “నేను కన్న ఈ కల మీరూ వినండి. అదేమిటంటే మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి.” అందుకు అతని సోదరులు “నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మామీద నువ్వు అధికారివి అవుతావా” అని అతనితో చెప్పి, అతని కలలను బట్టీ అతని మాటలను బట్టీ అతని మీద మరింత పగ పెంచుకున్నారు. అతడింకొక కల కని తన సోదరులతో “ఇదిగో నేను మరొక కల గన్నాను. అందులో సూర్య చంద్రులూ, పదకొండు నక్షత్రాలూ నాకు సాష్టాంగ పడ్డాయి” అని చెప్పాడు. అతడు తన తండ్రితో, తన అన్నలతో అది చెప్పాడు. అతని తండ్రి అతనితో “నువ్వు కన్న ఈ కల ఏమిటి? నేనూ నీ తల్లీ నీ అన్నలూ నిజంగా నీకు సాష్టాంగపడాలా?” అని అతణ్ణి గద్దించాడు. అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు. అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు. యోసేపు సోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్ళారు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీ సోదరులు షెకెములో మందను మేపుతున్నారు. నిన్ను వారి దగ్గరికి పంపుతాను, రా” అన్నప్పుడు అతడు “అలాగే” అని చెప్పాడు. అప్పుడు యాకోబు “నువ్వు వెళ్ళి నీ సోదరుల క్షేమాన్ని, మంద క్షేమాన్ని తెలుసుకుని నాకు కబురు తీసుకురా” అని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతణ్ణి పంపించాడు. అతడు షెకెముకు వచ్చాడు. యోసేపు పొలంలో ఇటు అటు తిరుగుతూ ఉండగా ఒక మనిషి అతణ్ణి చూసి “దేని గురించి వెదుకుతున్నావు?” అని అడిగాడు. అందుకతడు “నేను నా సోదరులను వెదుకుతున్నాను. వారు మందను ఎక్కడ మేపుతున్నారో దయచేసి నాకు చెప్పు” అని అడిగాడు. అందుకు ఆ మనిషి “వారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు ‘దోతానుకు వెళ్దాం పదండి’ అని చెప్పుకోవడం నేను విన్నాను” అని చెప్పాడు. అప్పుడు యోసేపు తన సోదరుల కోసం వెదుకుతూ వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నాడు. అతడు దగ్గరికి రాక ముందే వారు అతణ్ణి దూరం నుండి చూసి అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు. వారు “అడుగో, కలలు కనేవాడు వస్తున్నాడు. వీణ్ణి చంపి ఒక గుంటలో పారేసి, ‘ఏదో క్రూర జంతువు వీణ్ణి చంపి తినేసింది’ అని చెబుదాం. అప్పుడు వీడి కలలేమౌతాయో చూద్దాం” అని ఒకరి కొకరు చెప్పుకున్నారు. రూబేను ఆ మాట విని “మనం వాణ్ణి చంపకూడదు” అని చెప్పి వారి చేతుల్లో చావకుండా యోసేపును తప్పించాడు. ఎలాగంటే రూబేను అతణ్ణి తమ తండ్రికి అప్పగించాలని, వారు అతణ్ణి చంపకుండా విడిపించాలని ఉద్దేశించి “రక్తం చిందించ వద్దు. అతణ్ణి చంపకుండా అడవిలో ఉన్న ఈ గుంటలో తోసేయండి” అని వారితో చెప్పాడు. యోసేపు తన సోదరుల దగ్గరికి వచ్చినప్పుడు వారు యోసేపు తొడుక్కొన్న ఆ అందమైన నిలువుటంగీని తీసేసి, అతణ్ణి పట్టుకుని ఆ గుంటలో పడదోశారు. అది నీళ్ళు లేని వట్టి గుంట. వారు భోజనానికి కూర్చున్నపుడు, ఐగుప్తుకు సుగంధ ద్రవ్యాలు, మస్తకి, బోళం మోసుకుపోతున్న ఒంటెలతో ఇష్మాయేలీ యాత్రికులు గిలాదు నుండి రావడం చూశారు. అప్పుడు యూదా “మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం? ఈ ఇష్మాయేలీయులకు వాణ్ణి అమ్మేద్దాం రండి. ఎలాగైనా వాడు మన తమ్ముడు, మన రక్త సంబంధి గదా? వాడిని చంపకూడదు” అని తన సోదరులతో చెప్పాడు. అందుకు అతని సోదరులు అంగీకరించారు. ఆ మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినపుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరవై షెకెల్ ల వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు. రూబేను ఆ గుంట దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు యోసేపు అందులో లేకపోవడంతో అతడు తన బట్టలు చింపుకున్నాడు.
ఆదికాండము 37:1-29 పవిత్ర బైబిల్ (TERV)
యాకోబు కనాను దేశంలో ఉంటూ, అక్కడే నివసించాడు. ఇదీ, అతని తండ్రి నివసించినదీ ఒకటే దేశం. ఇది యాకోబు కుటుంబ గాధ. యోసేపు 17 సంవత్సరాల యువకుడు. గొర్రెల్ని, మేకల్ని కాయటం అతని పని. బిల్హా, జిల్ఫా కుమారులైన తన సోదరులతో కలిసి యోసేపు ఈ పని చేశాడు. (బిల్హా, జిల్ఫా అతని తండ్రి భార్యలు.) అతని సోదరులు చేసే చెడ్డ పనులను గూర్చి యోసేపు తన తండ్రితో చెప్పేవాడు. అతని తండ్రి ఇశ్రాయేలు (యాకోబు) చాలా వృద్ధుడుగా ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. కనుక ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యాకోబు తన కుమారునికి ఒక ప్రత్యేకతగల అంగీ ఇచ్చాడు. ఈ అంగీ చాలా పొడుగ్గా, అందంగా ఉంది. యోసేపు సోదరులు వారి తండ్రి వారందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించటం గమనించారు. అందుచేత వారు వారి సోదరుణ్ణి ద్వేషించారు. వాళ్లు యోసేపుతో స్నేహభావంతో మాట్లాడలేదు. ఒకసారి యోసేపుకు ఒక ప్రత్యేకమైన కల వచ్చింది. తర్వాత ఈ కల విషయం యోసేపు తన అన్నలతో చెప్పాడు. దీని తర్వాత అతని అన్నలు అతణ్ణి మరింతగా ద్వేషించారు. “నాకో కల వచ్చింది, మనమంతా పొలంలో పని చేస్తున్నాం. మనం గోధుమ పనలు కడ్తున్నాం. నా పన నిలబడింది, దాని చుట్టూ మీ పనలు లేచి నిలబడ్డాయి. అప్పుడు మీ పనలన్నీ నా పనకు సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు యోసేపు. అతని సోదరులు, “అంటే మా మీద నీవు రాజువై అధికారం చేస్తావా?” అని అడిగారు. వారిని గూర్చి యోసేపుకు వస్తోన్న కలల మూలంగా ఇప్పుడు వారు అతణ్ణి ఇంకా ఎక్కువగా ద్వేషించారు. అప్పుడు యోసేపుకు మళ్లీ ఒక కల వచ్చింది. ఈ కలను గూర్చి యోసేపు తన సోదరులకు చెప్పాడు. “నాకు ఇంకో కల వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, మరియు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడటం నేను చూశాను” అంటూ చెప్పాడు యోసేపు. ఈ కల విషయమై యోసేపు తన తండ్రితో కూడ చెప్పాడు. కాని అతని తండ్రి అతణ్ణి విమర్శించాడు. “ఇదేం కల? నేనూ, మీ అమ్మ, నీ సోదరులు అందరం నీకు సాష్టాంగపడతామని నీవు నమ్ముతున్నావా?” అన్నాడు అతని తండ్రి. యోసేపు సోదరులు మాత్రం అతని మీద అసూయ పడుతూనే ఉన్నారు. అయితే యోసేపు తండ్రి వీటన్నింటిని గూర్చి చాలా ఆలోచన చేసి వీటి భావం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ వున్నాడు. ఒకరోజు, యోసేపు సోదరులు తమ తండ్రి గొర్రెల్ని మేపుకొనేందుకు షెకెం వెళ్లారు. యాకోబు, “నీ సోదరులు షెకెంలో నా గొర్రెల్ని కాస్తున్నారు. నీవు అక్కడికి వెళ్లాలి” అని యోసేపుతో చెప్పాడు. “అలాగే, నేను వెళ్తా,” అన్నాడు యోసేపు. యోసేపు తండ్రి, “నీవు వెళ్లి నీ సోదరులు క్షేమంగా ఉన్నారో లేదో చూచి, మళ్లీ వచ్చి నా గొర్రెల క్షేమ సమాచారం నాకు చెప్పాలి” అన్నాడు. అందుచేత యోసేపు తండ్రి హెబ్రోను లోయనుండి షెకెముకు అతడ్ని పంపించాడు. షెకెములో యోసేపు తప్పిపోయాడు. అతడు పొలాల్లో తిరుగుతోంటే ఒక మనిషి చూశాడు. “ఏమిటి వెదుకుతున్నావు” అన్నాడు ఆ మనిషి. “నేను నా అన్నల కోసం వెదుకుతున్నాను. వాళ్లు గొర్రెల్ని మేపుకొంటూ ఎక్కడ ఉన్నారో నీవు చెప్పగలవా?” అన్నాడు యోసేపు. ఆ మనిషి “అప్పుడే వాళ్లు వెళ్లిపోయారు గదా. వాళ్లు దోతాను వెళ్తాం అని చెప్పుకోవటం నేను విన్నాను” అన్నాడు. కనుక యోసేపు తన సోదరులను వెంబడించి, దోతానులో వారిని చూడగలిగాడు. యోసేపు రావటం అతని అన్నలు అంత దూరం నుంచే చూశారు. అతణ్ణి చంపేందుకు ఒక పథకం వేయాలని వారు తీర్మానించుకొన్నారు. ఆ సోదరులు వాళ్లలో వారు ఇలా చెప్పుకొన్నారు, “కలలుకనే యోసేపు ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు మనకు వీలైనప్పుడే మనం వాణ్ణి చంపివేయాలి. వాని శవాన్ని ఇక్కడే ఏదో ఖాళీ బావిలో పడవేస్తే సరిపోతుంది. అడవి మృగం ఏదో వాణ్ణి చంపేసిందని మన తండ్రితో మనం చెప్పొచ్చు. అప్పుడు అతని కలలన్నీ అర్థము లేనివని వానికి మనం చూపెట్టవచ్చు.” కానీ రూబేను యోసేపును కాపాడాలి అనుకొన్నాడు, “వాణ్ణి మనం చంపొద్దు. వానికి హాని చేయకుండానే ఒక బావిలో పడవేస్తే సరిపోతుంది” అని చెప్పాడు రూబేను. యోసేపును రక్షించి, అతని తండ్రి దగ్గరకు పంపించాలని రూబేను వేసిన పథకం ఇది. యోసేపు తన సోదరుల దగ్గరకు వచ్చాడు. వారు అతని మీద పడి, అందమైన అతని పొడవాటి అంగీని చింపేసారు. తర్వాత, ఎండిపోయి ఖాళీగా ఉన్న ఒక బావిలో అతణ్ణి పడవేశారు. యోసేపు బావిలో పడి ఉంటే, అతని సోదరులు భోజనం చేసేందుకు కూర్చున్నారు. అప్పుడు వారు చూడగా, గిలాదునుండి ఈజిప్టుకు ప్రయాణం చేస్తోన్న వ్యాపారస్తుల బృందం ఒకటి కనబడింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం, ఐశ్వర్యాలు మోస్తున్నాయి. కనుక యూదా తన సోదరులతో “మనం మన సోదరున్ని చంపి, వాని మరణాన్ని దాచిపెడితే మనకేం లాభం? ఈ వ్యాపారస్తులకు గనుక మనం వాణ్ణి అమ్మివేస్తే మనకు లాభం వస్తుంది. పైగా మన సొంత సోదరున్ని చంపిన అపరాధం మనమీద ఉండదు” అన్నాడు. మిగిలిన సోదరులు సమ్మతించారు. మిద్యానీ వ్యాపారవేత్తలు అటు రాగానే, ఆ సోదరులు యోసేపును బావిలో నుండి బయటకు తీశారు. 20 వెండి నాణాలకు వారతణ్ణి ఆ వ్యాపారవేత్తలకు అమ్మివేశారు. వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకువెళ్లారు. ఇంతసేపూ రూబేను అక్కడ తన సోదరులతో లేడు. యోసేపును వారు అమ్మివేసినట్లు అతనికి తెలియదు. రూబేను బావి దగ్గరకు వచ్చినప్పుడు, యోసేపు బావిలో లేడు. రూబేనుకు ఎక్కడ లేని విచారం కలిగింది. తన విషాదాన్ని తెలియజేయడానికి తన గుడ్డలను చింపివేసుకొన్నాడు.
ఆదికాండము 37:1-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబువంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతోకూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమునుగూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కు వగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతనిమీద పగపెట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపెట్టిరి. అతడు వారినిచూచి–నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను. అందుకతని సహోదరులు– నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మామీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగపెట్టిరి. అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి– ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను. అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడు దుమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి–నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారియొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు–మంచిదని అతనితో చెప్పెను. అప్పుడతడు నీవు వెళ్లి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి–నీవేమి వెదకుచున్నావని అతని నడిగెను. అందుకతడు–నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపు మని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు–ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు–దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కను గొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచనచేసిరి. వారు–ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు; వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రూబేను ఆ మాట విని– మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింప దలచి–రక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని యుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి, అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు. వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి;వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేక పోగా అతడు తన బట్టలు చింపుకొని