ఆదికాండము 36:1-8

ఆదికాండము 36:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇది ఏశావు అనగా ఎదోము కుటుంబ వంశావళి: కనాను స్త్రీలలో నుండి ఏశావు తన భార్యలుగా చేసుకున్న వారు: హిత్తీయుడైన ఎలోను కుమార్తెయైన ఆదా, హివ్వీయుడైన సిబ్యోను మనవరాలు, అనా కుమార్తెయైన ఒహోలీబామా, అలాగే నెబాయోతు సోదరి, ఇష్మాయేలు కుమార్తెయైన బాశెమతు. ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది. ఒహోలీబామా యూషు, యాలాము, కోరహులను కన్నది. వీరంత కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కుమారులు. ఏశావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారందరిని, పశువులను, అన్ని జంతువులను, కనానులో సంపాదించుకున్న వస్తువులన్నిటిని తీసుకుని తన తమ్ముడికి దూరంగా ఉన్న దేశానికి వెళ్లాడు. వారి ఆస్తులు వారు కలిసి ఉండలేనంత గొప్పగా ఉన్నాయి; వారికున్న పశువులను బట్టి వారున్న స్థలం వారికి సరిపోలేదు. కాబట్టి ఏశావు అనగా ఎదోము శేయీరు కొండ సీమలో స్థిరపడ్డాడు.

ఆదికాండము 36:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎదోము అనే మారు పేరు గల ఏశావు వంశావళి ఇది. ఏశావు హిత్తీయుడైన ఏలోను కూతురు ఆదా, హివ్వీయుడైన సిబ్యోను కూతురైన అనా కూతురు అహోలీబామా, ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన బాశెమతు అనే కనాను యువతులను పెళ్ళి చేసుకున్నాడు. ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు. అహోలీబామా యూషును, యాలామును, కోరహును కన్నది. వీరు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కొడుకులు. ఏశావు తన భార్యలనూ కుమారులనూ కూతుళ్ళనూ తన ఇంటివారందరినీ తన మందలనూ పశువులనూ తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి అంతటినీ తీసుకుని తన తమ్ముడైన యాకోబు నుండి దూరంగా మరొక దేశానికి వెళ్ళిపోయాడు. వారు విస్తారమైన సంపద గలవారు కాబట్టి వారు కలిసి నివసించలేక పోయారు. వారి పశువులు అధికంగా ఉండడం వలన వారు నివసించే స్థలం వారిద్దరికీ సరిపోలేదు. కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో నివసించాడు. ఏశావుకు మరొక పేరు ఎదోము.

ఆదికాండము 36:1-8 పవిత్ర బైబిల్ (TERV)

ఏశావు (ఎదోము అని కూడ అతనికి పేరు) కుటుంబ జాబితా ఇది: ఏశావు కనాను దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. ఏశావు భార్యలు ఎవరంటే: హిత్తీవాడైన ఏలోను కుమార్తె ఆదా, హివ్వీవాడైన సిబ్యోను కుమారుడు అనా కుమార్తె అహోలీబామా, ఇశ్మాయేలు కుమార్తెయు నెబాయోతు సోదరియైన బాశెమతు. ఎలీఫజు అనే కుమారుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమారుని బాశెమతు ఏశావుకు కన్నది. అహోలీబామా ఏశావుకు ముగ్గురు కుమారులను కన్నది: యూషు, యాలాము, కోరహు. వీరు ఏశావు కుమారులు. వీరు కనాను దేశంలో పుట్టారు. ఏశావు కుటుంబం, యాకోబు కుటుంబం కలిసి ఒకే చోట నివసించటం వల్ల ఆ ప్రాంతం వాళ్ల పోషణకు చాలలేదు. కనుక ఏశావు కనాను విడిచిపెట్టి తన సోదరుడు యాకోబుకు దూరంగా మరో దేశం వెళ్లిపోయాడు. ఏశావు తనకు కలిగినదంతా తనతోబాటు తీసుకొని పోయాడు. ఇవన్నీ అతడు కనానులో నివసించినప్పుడు సంపాదించుకొన్నాడు. కనుక తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన బానిసలందరిని, పశువులను, ఇతర జంతువులను ఏశావు తనతో కూడ తెచ్చుకొన్నాడు. కనుక ఏశావు శేయీరు కొండ ప్రాంతానికి తరలి పోయాడు. (ఏశావుకు ఎదోము అని కూడ పేరు. మరియు ఎదోము, శేయీరు దేశానికి మరో పేరు.)

ఆదికాండము 36:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఎదోమను ఏశావు వంశావళి ఇదే, ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాశెమతును పెండ్లియాడెను. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను. అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను; వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందునవారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము.