ఆదికాండము 25:19-24
ఆదికాండము 25:19-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు వంశావళి. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు పద్దనరాములోని సిరియావాడైన బెతూయేలు కుమార్తె, లాబాను సోదరియైన రిబ్కాను పెళ్ళి చేసుకున్నప్పుడు అతని వయస్సు నలభై సంవత్సరాలు. రిబ్కాకు సంతానం కలుగలేదు కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాకు ప్రార్థన చేశాడు, యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చారు, అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యింది. ఆమె గర్భంలో పిల్లలు ఒకరితో ఒకరు పెనుగులాడారు, అందుకు ఆమె, “నాకెందుకు ఇలా జరుగుతుంది?” అని అంటూ యెహోవాను అడగడానికి వెళ్లింది. యెహోవా ఆమెతో ఇలా చెప్పారు, “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి, ఈ రెండు జనాంగాలు నీ గర్భం నుండే వేరుగా ఉంటాయి; ఒక జనం మరొక జనం కంటే బలంగా ఉంటారు. పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు.” ఆమె ప్రసవ కాలం సమీపించినప్పుడు, ఆమె గర్భంలో కవలపిల్లలు ఉన్నారు.
ఆదికాండము 25:19-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అబ్రాహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి. ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియా వాడైన బెతూయేలు కూతురూ సిరియావాడైన లాబాను సోదరీ అయిన రిబ్కాను పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు నలభై సంవత్సరాలు. ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భంలో ఇద్దరు పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె “నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?” అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది. అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు. “రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి. రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి. ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.” ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
ఆదికాండము 25:19-24 పవిత్ర బైబిల్ (TERV)
ఇస్సాకు కుటుంబం చరిత్ర ఇది. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు. ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను అతడు వివాహం చేసుకొన్నాడు. రిబ్కా పద్దనరాముకు చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె, అరామీయుడగు లాబానుకు సోదరి. ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను గర్భవతిని కానిచ్చాడు. రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భంలో కవల పిల్లలు పెనుగులాడారు. రిబ్కా యెహోవాను ప్రార్థించి, “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని అడిగింది. ఆమెతో యెహోవా చెప్పాడు: “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి. రెండు వంశాల పాలకులు నీలోనుండి పుడతారు. కాని వారు విభజించబడతారు. ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుని సేవిస్తాడు.” తగిన సమయం రాగానే రిబ్కా కవల పిల్లల్ని కన్నది.
ఆదికాండము 25:19-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళియిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లిచేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగు లాడిరి గనుక ఆమె–ఈలాగైతే నేను బ్రదుకుట యెందు కని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను– రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిప్ఠమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.