ఆదికాండము 22:1-19
ఆదికాండము 22:1-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కొంతకాలం తర్వాత దేవుడు అబ్రాహామును పరీక్షించారు. ఆయన, “అబ్రాహామూ!” అని పిలిచారు. “చిత్తం! ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నారు, “నీ ఏకైక కుమారున్ని, అంటే నీవు ప్రేమించే ఇస్సాకును మోరీయా ప్రదేశానికి తీసుకెళ్లు. నేను నీకు చూపబోయే పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించు.” మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి గాడిదకు గంతలు కట్టి ఇద్దరు పనివారిని, తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని బయలుదేరాడు. దహనబలి కోసం కట్టెలు కొట్టుకుని దేవుడు చూపిన స్థలం వైపు వెళ్లాడు. మూడవ రోజు అబ్రాహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ స్థలాన్ని చూశాడు. అబ్రాహాము తన పనివారితో, “మీరు గాడిదతో ఇక్కడ ఉండండి, నేను, ఈ చిన్నవాడు అక్కడికి వెళ్లి, ఆరాధించి తిరిగి వస్తాం” అని అన్నాడు. అబ్రాహాము దహనబలి కోసం కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టాడు, అతడు నిప్పును కత్తిని పట్టుకుని వెళ్లాడు. వారిద్దరు కలసి నడిచి వెళ్తున్నప్పుడు, ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో, “తండ్రీ” అని పిలిచాడు. “నా కుమారుడా, ఏంటి?” అని అబ్రాహాము జవాబిచ్చాడు. ఇస్సాకు, “నిప్పు కట్టెలు ఉన్నాయి. కాని దహనబలి కోసం కావలసిన గొర్రెపిల్ల ఎక్కడ?” అని అడిగాడు. “నా కుమారుడా, దేవుడే స్వయంగా దహనబలి కోసం గొర్రెపిల్లను ఇస్తారు” అని అబ్రాహాము జవాబిచ్చాడు. వారిద్దరు కలిసి వెళ్లారు. దేవుడు నిర్దేశించిన స్థలం వారు చేరుకున్నాక, అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠం కట్టాడు, దాని మీద కట్టెలు పేర్చాడు. తన కుమారుడైన ఇస్సాకును బంధించి, కట్టెల మీద పడుకోబెట్టాడు. తర్వాత అబ్రాహాము తన కుమారున్ని బలి ఇవ్వడానికి చేయి చాపి కత్తి పట్టుకున్నాడు. అయితే యెహోవా దూత ఆకాశం నుండి, “అబ్రాహామూ! అబ్రాహామూ!” అని పిలిచాడు. “చిత్తం ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు. “ఆ బాలుని మీద చేయివేయకు అతన్ని ఏమీ చేయకు. నీవు దేవునికి భయపడతావని ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే నీ ఏకైక కుమారున్ని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు!” అని దేవుని దూత మాట్లాడాడు. అబ్రాహాము కళ్ళెత్తి చూశాడు, ఆ పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న పొట్టేలు కనిపించింది. అక్కడికి వెళ్లి ఆ పొట్టేలును తెచ్చి తన కుమారునికి బదులు దహనబలి అర్పించాడు. అబ్రాహాము ఆ స్థలానికి, యెహోవా యీరే అని పేరు పెట్టాడు. ఇప్పటికీ, “యెహోవా పర్వతం మీద సమకూర్చబడుతుంది” అని చెప్పబడుతుంది. యెహోవా దూత రెండవసారి అబ్రాహాముతో ఇలా అన్నాడు, “యెహోవా ప్రకటిస్తున్నారు, నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నీవిలా నీ ఏకైక కుమారున్ని ఇవ్వడానికి వెనుకాడలేదు కాబట్టి, నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని లెక్కించలేని ఆకాశ నక్షత్రాల్లా సముద్ర ఒడ్డు మీద ఇసుక రేణువుల్లా విస్తరింపజేస్తాను. నీ సంతతివారు వారి శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు, నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి, ఎందుకంటే నీవు నాకు లోబడ్డావు.” తర్వాత అబ్రాహాము తన పనివారి దగ్గరకు తిరిగి వెళ్లాడు, వారు కలిసి బెయేర్షేబకు వెళ్లారు. అబ్రాహాము బెయేర్షేబలో నివసించాడు.
ఆదికాండము 22:1-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన “అబ్రాహామూ” అని పిలిచినప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. అప్పుడు ఆయన అబ్రాహాముతో “నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు” అన్నాడు. కనుక అబ్రాహాము తెల్లవారగానే లేచి తన గాడిదకు జీను కట్టి సిద్ధం చేసి, దహనబలి కోసం కట్టెలు కొట్టి, తన కొడుకు ఇస్సాకుతో పాటు ఇద్దరు పనివాళ్ళనూ వెంటబెట్టుకుని దేవుడు తనకు చెప్పిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. మూడవ రోజు అబ్రాహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూశాడు. తన పనివాళ్ళతో “మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. నేనూ అబ్బాయీ అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరికి వస్తాం” అని చెప్పాడు. అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకుని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు, కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలసి కొండపైకి ఎక్కుతున్నారు. ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును “నాన్నా” అని పిలిచాడు. దానికి అబ్రాహాము “ఏం నాయనా” అన్నాడు. అప్పుడతడు “చూడండి, మన దగ్గర నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది?” అని అడిగాడు. దానికి అబ్రాహాము “కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు” అన్నాడు. దేవుడు అబ్రాహాముకు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. ఇస్సాకును తాళ్ళతో బంధించాడు. ఆ బలిపీఠంపై పేర్చిన కట్టెలపై అతణ్ణి పడుకోబెట్టాడు. తరువాత అబ్రాహాము తన కుమారుణ్ణి వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత “అబ్రాహామూ, అబ్రాహామూ” అని పిలిచాడు. దానికతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. అప్పుడు ఆయన “ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది” అన్నాడు. అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు. అబ్రాహాము ఆ చోటును “యెహోవా యీరే” అని పిలిచాడు. కాబట్టి “యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు” అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది. యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు “నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు. నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.” తరువాత అబ్రాహాము తన పనివాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళంతా కలసి బెయేర్షెబాకు వెళ్ళారు. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించాడు.
ఆదికాండము 22:1-19 పవిత్ర బైబిల్ (TERV)
ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు అనుకొన్నాడు. “అబ్రాహామా” అని దేవుడు అతణ్ణి పిలిచాడు. దానికి అబ్రాహాము “చిత్తం” అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, “నీ కుమారుని మోరీయా దేశం తీసుకొని వెళ్లు. మోరీయాలో నీ కుమారుణ్ణి నాకు బలిగా చంపు. నీ ఒకే కుమారుడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును ఇలా చేయాలి. అక్కడ కొండల్లో ఒక దానిమీద అతణ్ణి దహనబలిగా ఉపయోగించు. ఏ కొండ అనేది నేను నీతో చెబుతాను.” ఉదయాన అబ్రాహాము లేచి, తన గాడిదను సిద్ధం చేశాడు. ఇస్సాకును తన ఇద్దరు సేవకులను అబ్రాహాము తన వెంట తీసుకు వెళ్లాడు. బలి అర్పణ కోసం కట్టెలను అబ్రాహాము నరికాడు. తర్వాత వారు వెళ్లాలని దేవుడు అతనితో చెప్పిన చోటికి వారు వెళ్లారు. వారు మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత, అబ్రాహాము కన్నులెత్తి దూరంలో వారు వెళ్లవలసిన చోటును చూశాడు. అప్పుడు అబ్రాహాము, “మీరు ఈ గాడిదతో ఇక్కడ ఉండండి. నేను, నా కుమారుడు అక్కడికి వెళ్లి, ఆరాధన చేస్తాం. ఆ తర్వాత మేము మీ దగ్గరకు తిరిగి వస్తాం” అని తన సేవకులతో చెప్పాడు. అబ్రాహాము బలికోసం కట్టెలు తీసుకొని, తన కుమారుని భుజంమీద పెట్టాడు. ఒక ప్రత్యేక ఖడ్గం, నిప్పు అబ్రాహాము పట్టుకొన్నాడు. అప్పుడు అబ్రాహాము, అతని కుమారుడు యిద్దరు కలిసి ఆరాధనా స్థలానికి వెళ్లారు. ఇస్సాకు “తండ్రీ!” అని తన తండ్రి అబ్రాహామును పిలిచాడు. “ఏమిటి కొడుకా?” అని అడిగాడు అబ్రాహాము. “కట్టెలు, నిప్పు నాకు కనబడుతున్నాయి. కాని మనం బలిగా దహించే గొర్రెపిల్ల ఏది?” అని ఇస్సాకు అడిగాడు. “నా కుమారుడా, బలికోసం గొర్రెపిల్లను సరైన సమయంలో దేవుడు మనకు ఇస్తాడు” అని అబ్రాహాము జవాబిచ్చాడు. కనుక అబ్రాహాము, అతని కుమారుడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్లారు. దేవుడు వారికి వెళ్లమని చెప్పిన చోటికి వారు వెళ్లారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును అబ్రాహాము కట్టివేశాడు. బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు. అప్పుడు అబ్రాహాము తన ఖడ్గం తీసుకొని, తన కుమారుని చంపడానికి సిద్ధమయ్యాడు. కాని అప్పుడు యెహోవా దూత అబ్రాహామును ఆపు చేశాడు. దేవుని దూత ఆకాశం నుండి “అబ్రాహామా, అబ్రాహామా” అని పిలిచాడు. “చిత్తం” అని అబ్రాహాము జవాబిచ్చాడు. “నీ కుమారుని చంపవద్దు, అతనికి ఏ హానీ చేయవద్దు. నీకు దేవుని పట్ల భయం, ఆరాధనా భావం ఉన్నాయని నాకిప్పుడు తెలుసు. నా కోసం, నీ కుమారుణ్ణి, అదీ, నీ ఒకే ఒక్క కుమారుణ్ణి చంపడానికి కూడా నీవు సిద్ధమేనని నేను చూశాను” అన్నాడు దేవదూత. అబ్రాహాము అటు ప్రక్క చూడగా ఒక పొట్టేలు కనబడింది. ఆ పొట్టేలు కొమ్ములు ఒక పొదలో చిక్కుకొన్నాయి. కనుక అబ్రాహాము వెళ్లి, పొట్టేలును పట్టుకొని దానిని చంపాడు. ఆ పొట్టేలును దేవునికి బలిగా అబ్రాహాము ఉపయోగించాడు. అబ్రాహాము కుమారుడు రక్షించబడ్డాడు. అందుచేత ఆ స్థలానికి “ యెహోవా ఈరె ” అని అబ్రాహాము పేరు పెట్టాడు. “పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు” అని ఇప్పటికి ప్రజలు చెబుతారు. ఆకాశంనుండి యెహోవా దూత అబ్రాహామును రెండవసారి పిల్చాడు. యెహోవా దూత చెప్పాడు: “నా కోసం నీ కుమారుణ్ణి చంపడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకు ఒక్కడే కుమారుడు. నా కోసం నీవు ఇలా చేశావు గనుక నేను నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను. యెహోవానైన నేను వాగ్దానం చేసేది ఏమిటంటే, నిజంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఆకాశంలో అసంఖ్యాక నక్షత్రాలలాగా సముద్ర తీరంలో ఇసుకలాగా నీ సంతానమును చేస్తాను. నీ ప్రజలు వారి శత్రువులనందరినీ ఓడిస్తారు. నీ సంతానం ద్వారా భూమిమీద ప్రతిజనం ఆశీర్వదించబడతారు. నీవు నాకు విధేయుడవయ్యావు కనుక నేను దీన్ని చేస్తాను.” అప్పుడు అబ్రాహాము మళ్లీ తన సేవకుల దగ్గరకు వెళ్లిపోయాడు. వాళ్లంతా బెయేర్షెబాకు ప్రయాణమై వెళ్లిపోయారు. అబ్రాహాము అక్కడ నివసించాడు.
ఆదికాండము 22:1-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన–అబ్రా హామా, అనిపిలువగా అతడు–చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన–నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలికొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను. మూడవనాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి తన పనివారితో–మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తనచేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో–నా తండ్రీ అనిపిలిచెను; అందుకతడు–ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు–నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా అబ్రాహాము–నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను. ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవాదూత పరలోకమునుండి–అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు–చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన–ఆ చిన్నవానిమీద చెయ్యివేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్న దనెను. అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత–యెహోవా పర్వతముమీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడును. యెహోవాదూత రెండవమారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను –నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను. తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయేర్షెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను.