ఆదికాండము 17:2-7
ఆదికాండము 17:2-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు నేను నీకు నాకు మధ్య నిబంధన చేస్తాను, నీ సంతతిని అత్యధికంగా వర్ధిల్లజేస్తాను” అన్నారు. అబ్రాము సాష్టాంగపడ్డాడు, అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నారు, “నేను నీతో చేస్తున్న నిబంధన ఇదే: నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు. ఇకమీదట నీ పేరు అబ్రాము కాదు; నీకు అబ్రాహాము అని పేరు పెడుతున్నాను ఎందుకంటే నేను నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను. నిన్ను ఎంతో ఫలభరితంగా చేస్తాను; నిన్ను అనేక జనాంగాలుగా చేస్తాను, రాజులు నీ నుండి వస్తారు. నా నిబంధనను నాకు నీకు మరి నీ తర్వాత వచ్చు నీ వారసులకు మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, నీకు దేవునిగా, నీ తర్వాత నీ వారసులకు దేవునిగా ఉంటాను.
ఆదికాండము 17:2-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనను నేను స్థిరం చేస్తాను. నీ సంతానాన్ని అత్యధికంగా విస్తరింపజేస్తాను” అని చెప్పాడు. అబ్రాము సాష్టాంగపడి తన ముఖాన్ని నేలకు వంచుకుని ఉన్నాడు. దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడు, నేను నీతో నిబంధన చేశాను. నువ్వు అనేక జాతులకు మూల పురుషుడివి అవుతావు. ఇకపైన నీ పేరు అబ్రాము కాదు. నిన్ను అనేక జాతులకు తండ్రిగా నియమిస్తున్నాను కనుక ఇకనుండి నీ పేరు అబ్రాహాము అవుతుంది. నిన్ను అత్యధికంగా ఫలింపజేస్తాను. నీ సంతానం అనేక జాతులుఅయ్యేలా చేస్తాను. నీ సంతానంలో రాజులు జన్మిస్తారు. నేను నీకూ నీ తరువాత నీ సంతానానికీ దేవుడిగా ఉండే విధంగా నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నాకూ నీ సంతానానికీ మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.
ఆదికాండము 17:2-7 పవిత్ర బైబిల్ (TERV)
ఇలా గనుక నీవు చేస్తే, మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడికను నేను తయారు చేస్తాను. నిన్ను బాగా అభివృద్ధి చేస్తాను.” అప్పుడు దేవునియెదుట అబ్రాము సాష్టాంగ పడ్డాడు. అతనితో దేవుడు అన్నాడు. “మన ఒడంబడికలో నా భాగం ఇది. అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను చేస్తాను. నీ పేరు నేను మార్చేస్తాను. నీ పేరు అబ్రాము కాదు, నీ పేరు అబ్రాహాము. అనేక జనాంగములకు నీవు తండ్రివి అవుతావు గనుక, నీకు నేను ఈ పేరు పెడుతున్నాను. నీకు నేను పెద్ద సంతానాన్ని ఇస్తాను. నీనుండి క్రొత్త జనాంగాలు ఉద్భవిస్తాయి. నీనుండి క్రొత్త రాజులు వస్తారు. నీకు, నాకు మధ్య ఒక ఒడంబడికను నేను ఏర్పాటు చేస్తాను. నీ సంతానానికి ఈ ఒడంబడిక వర్తిస్తుంది. నేను నీకు దేవునిగా ఉంటాను. నీ సంతానానికి దేవునిగా ఉంటాను.
ఆదికాండము 17:2-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి–ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు. మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రి నిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.