ఆదికాండము 12:1-8
ఆదికాండము 12:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా అబ్రాముతో ఇలా అన్నారు, “నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు. “నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను; నీ పేరును గొప్పగా చేస్తాను, నీవు దీవెనగా ఉంటావు. నిన్ను దీవించే వారిని దీవిస్తాను, శపించే వారిని శపిస్తాను; నిన్ను బట్టి భూమి మీద ఉన్న సర్వ జనాంగాలు దీవించబడతారు.” యెహోవా చెప్పినట్టే అబ్రాము బయలుదేరాడు; లోతు అతనితో వెళ్లాడు. హారాను నుండి ప్రయాణమైనప్పుడు అబ్రాము వయస్సు డెబ్బై అయిదు సంవత్సరాలు. అబ్రాము తన భార్య శారాయిని, తమ్ముని కుమారుడైన లోతును, హారానులో వారు కూడబెట్టుకున్న మొత్తం ఆస్తిని, సంపాదించుకున్న ప్రజలను తీసుకుని కనాను దేశం చేరుకున్నాడు. అబ్రాము ఆ దేశం గుండా ప్రయాణమై షెకెములో మోరె యొక్క సింధూర వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఆ దేశంలో కనానీయులు నివసిస్తున్నారు. యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, “నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను” అని అన్నారు. కాబట్టి తనకు ప్రత్యక్షమైన చోట యెహోవాకు బలిపీఠం కట్టాడు. అక్కడినుండి బేతేలుకు తూర్పున ఉన్న కొండల వైపు వెళ్లి అక్కడ గుడారం వేసుకున్నాడు. దానికి పడమర బేతేలు, తూర్పున హాయి ఉన్నాయి. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం నిర్మించి యెహోవాను ఆరాధించాడు.
ఆదికాండము 12:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు. నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.” యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు. అబ్రాము తన భార్య శారయిని, తన సోదరుడి కొడుకు లోతును, హారానులో తాను, తనవాళ్ళు, సేకరించిన ఆస్తి అంతటినీ, వాళ్ళ సంపాదన మొత్తాన్నీ తీసుకుని కనాను అనే ప్రదేశానికి వచ్చాడు. అబ్రాము ఆ ప్రదేశంలో షెకెములో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి మోరే ప్రాంతంలో సింధూర వృక్షం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి ఆ ప్రదేశంలో కనానీయులు నివాసం ఉన్నారు. యెహోవా అబ్రాముతో “నీ వారసులకు ఈ దేశాన్ని ఇస్తాను” అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమ బలి అర్పించాడు. అతడు అక్కడనుంచి బయలుదేరి బేతేలుకు తూర్పువైపు ఉన్న కొండ దగ్గరికి వచ్చాడు. పడమర వైపు ఉన్న బేతేలుకు, తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు హోమబలి అర్పించి, యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
ఆదికాండము 12:1-8 పవిత్ర బైబిల్ (TERV)
అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు, “నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు. నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి, నేను నీకు చూపించు దేశానికి వెళ్లు. నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఒక గొప్ప జనముగా నేను చేస్తాను. నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను. ఇతరులను ఆశీర్వదించటానికి ప్రజలు నీ పేరు ఉపయోగిస్తారు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను శపించే వాళ్లను నేను శపిస్తాను. భూమి మీదనున్న మనుష్యులందరిని ఆశీర్వదించడానికి నేను నిన్ను ఉపయోగిస్తాను.” కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను వెళ్లాడు. అతడు హారానును విడిచిపెట్టాడు, లోతు అతనితో కూడ వెళ్లాడు. ఈ సమయంలో అబ్రాము వయస్సు 75 సంవత్సరాలు. అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరివాడు కాడు. తన భార్య శారయిని, తమ్ముని కుమారుడు లోతును, హారానులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకు వెళ్లాడు. హారానులో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము, అతని వర్గంవారు హారాను విడిచి, కనాను దేశానికి ప్రయాణం చేశారు. అబ్రాము కనాను దేశంగుండా సంచారం చేశాడు. అబ్రాము షెకెము పట్టణానికి పయనించి మోరేలో ఉన్న మహా వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కనానీ ప్రజలు ఈ దేశంలో నివసించారు. అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయి, “ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను” అన్నాడు. ఆ స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరాధించటానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు. తర్వాత అబ్రాము ఆ స్థలం విడిచిపెట్టి బేతేలుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ అబ్రాము తన గుడారం వేసుకొన్నాడు. పడమటికి బేతేలు పట్టణం ఉంది. తూర్పున హాయి పట్టణం ఉంది. ఆ స్థలంలో యెహోవా కోసం మరో బలిపీఠాన్ని అబ్రాము నిర్మించాడు. అక్కడ అబ్రాము యెహోవాను ఆరాధించాడు.
ఆదికాండము 12:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా–నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితోకూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు. అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానునువారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపా దించిన సమస్తమైనవారిని తీసికొని కనానను దేశమునకు వెళ్లుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరేదగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి– నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికినిమధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.