గలతీయులకు 5:22-26
గలతీయులకు 5:22-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే ఆత్మ వలన కలిగే ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, మృదుత్వం, మనస్సును అదుపు చేసుకోవడం. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ నియమం లేదు. యేసు క్రీస్తుకు సంబంధించినవారు శరీరాన్ని దాని వాంఛలతో దురాశలతో సిలువ వేశారు. మనం ఆత్మ వలన జీవిస్తున్నాం కాబట్టి మనం ఆత్మతో పాటు నడుద్దాము. ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ, ఒకరిపై ఒకరు అసూయపడుతూ, మనం అహంకారులుగా ఉండవద్దు.
గలతీయులకు 5:22-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు. మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.
గలతీయులకు 5:22-26 పవిత్ర బైబిల్ (TERV)
కాని పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, వినయం, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు. యేసుక్రీస్తుకు చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు. మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకారము నడుచుకొందాము. ఒకరికొకర్ని రేపకుండా, ద్వేషించకుండా, గర్వించకుండా ఉందాం.
గలతీయులకు 5:22-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు. మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మ ను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.