గలతీయులకు 4:8-31

గలతీయులకు 4:8-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

గతంలో, మీరు దేవుని ఎరుగక ముందు, మీరు స్వాభావికంగా దేవుళ్ళు కాని వారికి బానిసలై ఉన్నారు. కాని ఇప్పుడు మీరు దేవున్ని తెలుసుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ వెనుకకు ఆ బలహీనమైన దిక్కుమాలిన సిద్ధాంతాల వైపు ఎందుకు తిరుగుతున్నారు? మీరు మళ్ళీ వాటికి బానిసలవ్వాలని కోరుకుంటున్నారా? మీరు ప్రత్యేకమైన రోజులను, నెలలను, పండుగలను, సంవత్సరాలను ఆచరిస్తున్నారు గదా! నేను మీ కోసం పడిన కష్టమంతా వృధా అవుతుందేమో అని భయపడుతున్నాను. సహోదరీ సహోదరులారా, నేను మీలా మారినట్లే మీరూ నాలా మారాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను. మీరు నా పట్ల ఏ తప్పు చేయలేదు. నాకు అనారోగ్యంగా ఉన్నా నేను మొదటిగా మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు. నా అనారోగ్యం మీకు ఇబ్బందిని కలిగించినప్పటికీ, మీరు నన్ను తిరస్కరించలేదు అలక్ష్యం చేయలేదు. నిజానికి, మీరు నన్ను దేవుని దూతలా, నేనే యేసు క్రీస్తును అయినట్టు చేర్చుకున్నారు. అయితే నా వలన మీరు పొందిన దీవెన ఇప్పుడేమైపోయింది? మీరు మీ కళ్లను కూడా పెరికివేసి నాకు ఇచ్చేవారని, నేను మీ గురించి సాక్ష్యమివ్వగలను. అయితే ఇప్పుడు మీకు సత్యాన్ని చెప్పి నేను మీకు శత్రువునయ్యానా? ఆ ప్రజలు మిమ్మల్ని గెలవాలని ఆసక్తి కలిగి ఉన్నారు, కాని అది మీ మేలుకోసం కాదు. మీరు వారి పట్ల ఆసక్తిని చూపించాలని, వారు మా నుండి మిమ్మల్ని వేరు చేయాలనుకుంటున్నారు. నేను మీతో ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడూ మంచి ఉద్దేశాలలో ఆసక్తి కలిగి ఉండడం మంచిదే. నా ప్రియ పిల్లలారా, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను. నేను మీ గురించి కలవరపడుతున్నాను. ఇప్పుడు నేను మీతో ఉండి మరో విధంగా మాట్లాడగలిగితే ఎంత బాగుండేది! ఒక్క మాట చెప్పండి, ధర్మశాస్త్రానికే లోబడి ఉండాలనుకునే మీకు ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో తెలియదా? వ్రాయబడి ఉన్న ప్రకారం, అబ్రాహాముకు ఇద్దరు కుమారులు, ఒకడు దాసియైన స్త్రీ వలన, మరొకడు స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టారు. దాసియైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు శరీరానుసారంగా పుట్టాడు, స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు దైవిక వాగ్దాన ఫలితంగా పుట్టాడు. ఈ విషయాలను ఉపమానరీతిగా చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలను సూచిస్తున్నారు. ఒక నిబంధన సీనాయి పర్వతం దగ్గరిది, ఇది హాగరు: బానిసలుగా ఉండడానికి పిల్లలను కంటుంది. హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న యెరూషలేము పట్టణంలా ఆమె తన పిల్లలతో సహా బానిసత్వంలో ఉంది. కాని పైనుండి వచ్చే యెరూషలేము స్వతంత్రమైనది, ఆమె మనకు తల్లి. అయితే వ్రాయబడిన ప్రకారం, “గొడ్రాలా, పిల్లలు కననిదానా, ఆనందించు; ప్రసవవేదన పడనిదానా, ఆనందంతో కేకలు వేయి; ఎందుకంటే, భర్త ఉన్నదాని పిల్లలకంటే విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువమంది ఉన్నారు.” అయితే సహోదరీ సహోదరులారా, మీరు ఇస్సాకులా వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలు. ఆ సమయంలో శరీరానుసారమైన కుమారుడు ఆత్మానుసారమైన కుమారుని ఎలా హింసించాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అయితే లేఖనం ఏమి చెప్తుంది? “దాసిని ఆమె కుమారున్ని పంపివేయి, దాసి కుమారుడు ఎప్పటికీ స్వతంత్రురాలైన స్త్రీ కుమారునితో వారసత్వం పంచుకోలేడు” అని చెప్తుంది. కాబట్టి సహోదరీ సహోదరులారా, మనం దాసురాలైన స్త్రీ పిల్లలం కాదు, గాని స్వతంత్రురాలైన స్త్రీ పిల్లలము.

గలతీయులకు 4:8-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ కాలంలో మీరు దేవుని ఎరగనివారై, వాస్తవానికి దేవుళ్ళు కాని వారికి బానిసలుగా ఉన్నారు గాని ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్న వారు. మరి విశేషంగా దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నాడు. కాబట్టి బలహీనమైనవీ ప్రయోజనం లేనివీ అయిన మూల పాఠాల వైపు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ బానిసలుగా ఉండాలనుకుంటున్నారా? మీరు ప్రత్యేక దినాలూ అమావాస్య దినాలూ ఉత్సవ కాలాలూ సంవత్సరాలూ జాగ్రత్తగా ఆచరిస్తున్నారట. మీ విషయంలో నా కష్టం వ్యర్థమై పోతుందేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. సోదరులారా, నేను మీలాంటి వాడినయ్యాను కాబట్టి మీరు కూడా నాలాంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు. నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా నన్ను మీరు తృణీకరించ లేదు, నిరాకరించనూ లేదు గాని దేవుని దూతలాగా, క్రీస్తు యేసులాగా నన్ను అంగీకరించారు. మీ సంతోషం ఇప్పుడు ఏమయింది? వీలుంటే మీ కళ్ళు తీసి నాకిచ్చేసే వారని మీ గురించి సాక్ష్యం చెప్పగలను. నేను మీకు వాస్తవం చెప్పి విరోధినయ్యానా? వారు అత్యాసక్తితో మీ వెంట పడుతున్నారు, కానీ వారి ఉద్దేశం మంచిది కాదు. మీరు వారిని అనుసరించాలని నా నుంచి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు. నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ మంచి కారణాల విషయం అత్యాసక్తి కలిగి ఉండడం మంచిది. నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకూ మీ విషయం మళ్ళీ నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను. మిమ్మల్ని గురించి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక రకంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని కోరే వారంతా నాకో మాట చెప్పండి-మీరు ధర్మశాస్త్రం చెప్పేది వినడం లేదా? దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కొడుకులు అబ్రాహాముకు కలిగారని రాసి ఉంది గదా? అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టాడు. ఈ విషయాలను అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లలను కంటుంది. ఇది హాగరు. ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి. “గొడ్రాలా, పిల్లలను కననిదానా, ఆనందించు. ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు. ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటే భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు” అని రాసి ఉంది. సోదరులారా, మీరు కూడా ఇస్సాకు లాగా వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నారు. అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా ఆలాగే జరుగుతున్నది. అయితే లేఖనం ఏమి చెబుతున్నది? “దాసిని, ఆమె కొడుకుని వెళ్ళగొట్టు. దాసి కొడుకు స్వతంత్రురాలి కొడుకుతో పాటు వారసుడుగా ఉండడు.” అందుచేత, సోదరులారా, మనం స్వతంత్రురాలి కొడుకులమే గాని దాసి కొడుకులం కాదు.

గలతీయులకు 4:8-31 పవిత్ర బైబిల్ (TERV)

ఇదివరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలియదు. కనుక మీరు వట్టి దేవుళ్ళకు బానిసలై జీవించారు. కాని యిప్పుడు మీకు దేవుడెవరో తెలుసు. లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిస్సారమైన, నిరర్థకమైన ఆ శక్తుల వైపు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను యింకా పాటిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది. సోదరులారా! నేను మీలా అయ్యాను. కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధమూ చెయ్యలేదు. నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది. నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు. విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతనైనట్లు, నేను యేసు క్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు. మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. నిజం చెప్పటంవల్ల యిప్పుడు నేను మీ శత్రువునయ్యానా? వాళ్ళు మిమ్మల్ని లోబరచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. మానుండి మిమ్మల్ని వేరు చెయ్యాలని వాళ్ళ ప్రయత్నం. మీరు వాళ్ళను మాత్రమే అనుసరించాలని వాళ్ళ ఉద్దేశ్యం. ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి. నా ప్రియమైన బిడ్డలారా! క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకూ నేను మీకోసం మళ్ళీ ఈ ప్రసవవేదన పడ్తూ ఉండవలసిందే. మీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది. ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా? అబ్రాహాముకు ఇద్దరు పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు స్వంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి వుంది. బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు. ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ యిరువురు స్త్రీలు రెండు ఒడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక ఒడంబడిక వచ్చింది. దీని వల్ల జన్మించిన వాళ్ళు బానిసలు కావాలని ఉంది. “హాగరు” ను ఆ మొదటి ఒడంబడికతో పోల్చవచ్చును. అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో కూడా “హాగరు” ను పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు. కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి. దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఓ గొడ్రాలా! పిల్లల్ని కననిదానా! ఆనందించు, పురిటి నొప్పులు పడనిదానా! గట్టిగా కేకలు వేయి! ఎందుకనగా భర్త వున్న స్త్రీకన్నా భర్త లేని స్త్రీకి పిల్లలు ఎక్కువ.” కనుక సోదరులారా! మీరు ఇస్సాకువలే వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు. ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది. కాని ధర్మశాస్త్రం ఏమి చెపుతున్నది? “బానిస స్త్రీ కుమారుడు, స్వంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి” అని వ్రాయబడి ఉంది. సోదరులారా! మనము స్వంత స్త్రీకి జన్మించిన బిడ్డలం. బానిస స్త్రీకి జన్మించిన బిడ్డలం కాము.

గలతీయులకు 4:8-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల?మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసునువలెను నన్ను అంగీక రించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్య మైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు; మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసి వేయ గోరుచున్నారు. నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడువరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది. మిమ్మునుగూర్చి యెటుతోచక యున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడియుండగోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా? అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియాదేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతోకూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి. ఇందుకు– కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదనపడని దానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది. సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము. అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మ నుబట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది. ఇందునుగూర్చి లేఖన మేమి చెప్పుచున్నది?– దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమా రుడు స్వతంత్రురాలి కుమారునితోపాటు వార సుడై యుండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమా రులమే గాని దాసి కుమారులము కాము.