గలతీయులకు 1:11-24
గలతీయులకు 1:11-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సహోదరీ సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మానవుని నుండి వచ్చింది కాదని మీరు తెలుసుకోవాలి. నేను ఏ మానవుని నుండి దాన్ని పొందలేదు, నాకెవరూ బోధించలేదు; యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారానే నేను పొందాను. నేను యూదా మతంలో జీవించిన నా గత జీవిత విధానాన్ని గురించి, అలాగే దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి దాన్ని ఎంత క్రూరంగా నేను హింసించానో మీరు విన్నారు. నా స్వజనులలో నా వయస్సుగల అనేకుల కంటే యూదా మతవిషయంలో నేను ఎంతో ముందున్నాను, నా పూర్వికుల ఆచారాలను పాటించడంలో నాకు అత్యాసక్తి ఉండేది. కాని తన కృప ద్వారా నన్ను నా తల్లి గర్భం నుండే ప్రత్యేకపరచుకొని నన్ను పిలిచిన దేవుడు, తన కుమారుని గురించి యూదేతరుల మధ్య నేను సువార్తను ప్రకటించేలా ఆయన తన కుమారున్ని నాలో బయలుపరచడానికి ఇష్టపడ్డారు. దానికి నేను వెంటనే మనుష్యులను సంప్రదించలేదు. అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్నవారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్లలేదు, కాని నేను అరేబియాకు వెళ్లాను. తర్వాత దమస్కుకు తిరిగి వచ్చాను. మూడు సంవత్సరాల తర్వాత, కేఫాను పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్లి అక్కడ పదిహేను రోజులు అతనితో ఉన్నాను. ప్రభువు సోదరుడైన యాకోబును తప్ప ఇతర అపొస్తలుల్లో ఎవరిని నేను చూడలేదు. నేను మీకు వ్రాసేది అబద్ధం కాదని దేవుని ముందు రూఢిగా చెప్తున్నాను. ఆ తర్వాత నేను సిరియాకు, కిలికియకు వెళ్లాను. యూదయలోని క్రీస్తులో ఉన్న సంఘాలకు వ్యక్తిగతంగా నేను తెలియదు. వారు, “ఇంతకుముందు మనల్ని హింసించినవాడు, ఏ విశ్వాసాన్నైతే నాశనం చేయాలని ప్రయత్నించాడో దానినే ఇప్పుడు ప్రకటిస్తున్నాడు” అని మాత్రమే విన్నారు. కాబట్టి వారు నన్ను బట్టి దేవుని స్తుతించారు.
గలతీయులకు 1:11-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి. మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు. నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి. అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను. అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు. నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను. మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను. అతనిని తప్ప అపొస్తలుల్లో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను. నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను చెపుతున్నాను. ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వచ్చాను. క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ “మునుపు మనలను హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.
గలతీయులకు 1:11-24 పవిత్ర బైబిల్ (TERV)
సోదరులారా! నేను ప్రకటించిన సువార్త మానవుడు కల్పించింది కాదు. అది మీరు గమనించాలి. నేను ఆ సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరూ బోధించనూ లేదు. దాన్ని నాకు యేసు క్రీస్తు తెలియచేసాడు. నేను యూదునిగా ఎట్లా జీవించానో మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన విషయం మీకు తెలుసు. దాన్ని ఏ విధంగా నాశనం చెయ్యాలని చూసానో మీకు తెలుసు. నేను యూదునిగా నా వయస్సులో ఉన్న వాళ్ళందరికన్నా చురుకైనవాడను. నా పూర్వికుల సాంప్రదాయాల విషయంలో నాకు చాలా పట్టుదల ఉంది. కాని దేవుడు తన దయతో నేను పుట్టినప్పుడే నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. నన్ను పిలిచి తన కుమారుణ్ణి తెలియ చెయ్యటానికి నిశ్చయించుకొన్నాడు. నేను యూదులు కానివాళ్ళకు తన కుమారుని గూర్చిన సువార్తను బోధించాలని ఆయన ఉద్దేశ్యం. నేనీ విషయంలో మరొక వ్యక్తిని సంప్రదించ లేదు. నాకన్నా ముందునుండి అపొస్తలులుగా ఉన్నవాళ్ళను చూడటానికి నేను యెరూషలేము కూడా వెళ్ళలేదు. దానికి మారుగా నేను వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి ఆ తర్వాత డెమాస్కసుకు తిరిగి వచ్చాను. మూడు సంవత్సరాలు గడిచాక పేతురును పరిచయం చేసుకోవటానికి యెరూషలేము వెళ్ళాను. అతనితో పదిహేను రోజులు గడిపాను. ఆ సమయంలో ప్రభువు సోదరుడైన యాకోబు తప్ప మిగతా అపొస్తలులెవరూ నాకు కనిపించలేదు. నేను అబద్ధం వ్రాయటంలేదని దేవునిపై ప్రమాణం చేసి చెపుతున్నాను. ఆ తర్వాత నేను సిరియ, కిలికియ దేశాలకు వెళ్ళాను. యూదయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలు నన్ను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. “ఇదివరలో మనవాళ్ళను హింసించిన వ్యక్తి యిప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు సువార్తను నాశనం చెయ్యాలని చూసాడు” అని యితర్లు అనగా వాళ్ళు విన్నారు. మరియు నా గురించి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.
గలతీయులకు 1:11-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పు చున్నాను. మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల వాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి. అయినను తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు. నాకంటె ముందుగా అపొస్తలు లైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని. అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని. క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయములేకుండెను గాని –మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని, వారు నన్నుబట్టి దేవుని మహిమపరచిరి.