గలతీయులకు 1:1-9

గలతీయులకు 1:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

పౌలు అనే నేను మనుష్యుల ద్వారా గాని ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను. నేనూ, నాతో ఉన్న సహోదరీ సహోదరులందరం కలిసి, గలతీ ప్రాంతంలోని సంఘాలకు వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. క్రీస్తు మన తండ్రియైన దేవుని చిత్తానికి లోబడి, దుష్టత్వం ఏలుబడి చేసే ప్రస్తుత యుగం నుండి మనల్ని విడిపించడానికి మన పాపాల కోసం ప్రాయశ్చిత్తంగా తనను తాను అర్పించుకున్నారు. ఆయనకే నిరంతరం మహిమ కలుగును గాక ఆమేన్. మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను ఎందుకంటే, క్రీస్తు కృపలో బ్రతకడానికి మిమ్మల్ని పిలిచిన వానిని మీరు ఇంత త్వరగా వదిలేసి, వేరొక సువార్త వైపుకు తిరుగుతున్నారు. నిజానికి అది సువార్త కానే కాదు. అయితే కొందరు సువార్తను తారుమారు చేయాలని ప్రయత్నిస్తూ మిమ్మల్ని గందరగోళంలోనికి నెడుతున్నారు. అయితే మేమే గాని పరలోకం నుండి వచ్చిన దేవదూతే గాని, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ప్రకటిస్తే, వారి మీదికి దేవుని శాపం వచ్చును గాక! మేము ఇప్పటికే చెప్పినట్లుగా, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను: మీరు అంగీకరించిన సువార్త కాక ఎవరైనా వేరే సువార్త ప్రకటిస్తే వారి మీదికి దేవుని శాపం వచ్చును గాక!

గలతీయులకు 1:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మనుషుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపొస్తలుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ, నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు. తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు. నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక. మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.

గలతీయులకు 1:1-9 పవిత్ర బైబిల్ (TERV)

మనుష్యుని నుండియైనను, మనుష్యుని ద్వారానైనను కాక, యేసు క్రీస్తు ద్వారాను, ఆయనను మరణములో నుండి లేపిన తండ్రియైన దేవుని ద్వారాను అపొస్తలుడనైన పౌలు నుండియు, మరియు నాతో ఉన్న యితర సోదరుల నుండియు గలతీయలో ఉన్న సంఘాలకు: మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని కనికరించి మీకు శాంతి ప్రసాదించుగాక! ప్రస్తుతం మనము అనుభవిస్తున్న చెడుతనం నుండి రక్షించటానికి మన పాపాలకోసం క్రీస్తు బలి అయ్యాడు. తద్వారా మన తండ్రియైన దేవుని యిచ్ఛను పూర్తి చేసాడు. దేవునికి మహిమ చిరకాలం ఉండుగాక! ఆమేన్. తనలో దయ వుండటం వల్ల దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఆయన్ని యింత త్వరలో వదిలివేయటం, మరొక సువార్తవైపు మళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త లేనేలేదు. కొందరు మిమ్మల్ని కలవరపెట్టటానికి క్రీస్తు సువార్తను మార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను గాని, లేక పరలోకం నుండి వచ్చిన దేవదూత గాని మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను ప్రకటిస్తున్నట్లయితే అలాంటి వాడు నిత్యనాశనానికి గురియగుగాక. మేము యిదివరకు చెప్పినదాన్ని యిప్పుడు నేను మళ్ళీ చెపుతున్నాను. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొక సువార్తను ఎవడైనా మీకు భోధిస్తున్నట్లయితే వాడు నిరంతరము శాపగ్రస్తుడవును గాక!

గలతీయులకు 1:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును, నాతోకూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిదివరకు చెప్పినప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించినయెడల వాడు శాపగ్రస్తుడవును గాక.