యెహెజ్కేలు 47:1-23
యెహెజ్కేలు 47:1-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ మనుష్యుడు నన్ను ఆలయ ద్వారం దగ్గరకు తిరిగి తీసుకువచ్చాడు, అక్కడ ఆలయ గుమ్మం క్రిందనుండి తూర్పు వైపుకు నీరు రావడం నేను చూశాను (మందిరం తూర్పు ముఖంగా ఉంది). ఆ నీరు ఆలయానికి దక్షిణం వైపున క్రింది నుండి, బలిపీఠానికి దక్షిణం నుండి వస్తుంది. తర్వాత అతడు నన్ను ఉత్తర ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి, తూర్పు వైపున ఉన్న బయటి ద్వారం దగ్గరకు నన్ను నడిపించాడు, అక్కడ ఆ నీరు దక్షిణం వైపు నుండి పారుతుంది. ఆ వ్యక్తి తన చేతిలో కొలమానం పట్టుకుని తూర్పు వైపు వెళ్తుండగా, అతడు వెయ్యి మూరలు కొలిచాడు, ఆపై చీలమండల లోతు ఉన్న నీటి గుండా నన్ను నడిపించాడు. అతడు మరో వెయ్యి మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించాడు. నీళ్లు మోకాళ్ల వరకు వచ్చాయి. మరో వెయ్యి మూరలు కొలిచి నీటి గుండా నన్ను నడిపించాడు. అక్కడ నీళ్లు నడుము వరకు వచ్చాయి. అతడు మరో వెయ్యి కొలిచాడు, కానీ ఇప్పుడు అది నేను దాటలేని నదిగా ఉంది, ఎందుకంటే నీళ్లు ఎక్కువై ఈదగలిగినంత లోతుగా ఉంది. “మనుష్యకుమారుడా! ఇది చూస్తున్నావా?” ఆయన నన్ను మరల నది ఒడ్డుకు చేర్చాడు. నేను అక్కడికి చేరుకున్నప్పుడు, నదికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో చెట్లు కనిపించాయి. అతడు నాతో ఇలా అన్నాడు, “ఈ నీరు తూర్పు ప్రాంతం వైపు ప్రవహిస్తూ అరాబా లోకి వెళ్తుంది, అక్కడ అది మృత సముద్రంలోకి ప్రవేశిస్తుంది. అది సముద్రంలోకి వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న ఉప్పునీరు మంచి నీటిగా మారుతుంది. ఈ నది నీరు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ జీవరాశుల గుంపులు ఉంటాయి. మృత సముద్రంలో చేపలు పుష్కలంగా ఉంటాయి, ఎందుకంటే దాని నీళ్లు మంచి నీటిగా ఉంటాయి. ఈ నీరు ఎక్కడ ప్రవహిస్తే అక్కడ జీవం వర్ధిల్లుతుంది. ఎన్-గేదీ నుండి ఎన్-ఎగ్లయీము వరకు చేపలు పట్టేవారు ఒడ్డున నిలబడి వలలు వేస్తారు. మధ్యధరా సముద్రంలో ఉన్నట్లు అన్ని రకాల చేపలు మృత సముద్రంలో ఉంటాయి. కానీ బురద మడుగులు, చిత్తడి నేలలు శుద్ధి చేయబడవు; అవి ఇంకా ఉప్పుగానే ఉంటాయి. నదికి ఇరువైపులా అన్ని రకాల పండ్లచెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల ఆకులు గోధుమ రంగులోకి మారవు, వాడిపోతాయి వాటి కొమ్మలపై ఎల్లప్పుడూ పండ్లు ఉంటాయి. దేవాలయం నుండి ప్రవహించే నది ద్వారా వాటికి నీరు అందుతుంది కాబట్టి ప్రతి నెల క్రొత్త పంట ఉంటుంది. పండ్లు ఆహారంగా ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి.” ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: “ఇవి ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి స్వాస్థ్యంగా మీరు పంచుకునే దేశ సరిహద్దులు, యోసేపుకు రెండు వంతులు. నీవు దానిని వారి మధ్య సమానంగా పంచాలి. మీ పూర్వికులకు ఇస్తానని చేయెత్తి ప్రమాణం చేశాను కాబట్టి, ఈ భూమి మీకు వారసత్వంగా మారుతుంది. “ఇది దేశానికి సరిహద్దుగా ఉంటుంది: “ఉత్తరం వైపున ఇది మధ్యధరా సముద్రం నుండి హెత్లోను రహదారి ద్వారా లెబో హమాతు దాటి సెదాదు వరకు ఉంటుంది, తర్వాత అది దమస్కు హమాతు మధ్య సరిహద్దులో ఉన్న బెరోతా సిబ్రాయిము వరకు, చివరకు హౌరాను సరిహద్దులో ఉన్న హజెర్-హత్తికోను వరకు వెళ్తుంది. సముద్రం నుండి వచ్చిన ఈ సరిహద్దు దమస్కు సరిహద్దు వున్న హజర్-ఎనానుకు వెళ్తుంది. దానికి ఉత్తరంగా హమాతు సరిహద్దు ఉంటుంది. ఇది ఉత్తర సరిహద్దు. తూర్పు వైపున సరిహద్దు హౌరాను దమస్కు మధ్య, గిలాదు ఇశ్రాయేలు దేశాల మధ్య యొర్దాను వెంట, మృత సముద్రం, తామారు వరకు ఉంటుంది. ఇది తూర్పు సరిహద్దు అవుతుంది. దక్షిణం వైపున అది తామారు నుండి మెరీబా కాదేషు నీళ్ల వరకు, తర్వాత ఈజిప్టు వాగు వెంట మధ్యధరా సముద్రం వరకు వెళుతుంది. ఇది దక్షిణ సరిహద్దు అవుతుంది. పడమటి వైపున, మధ్యధరా సముద్రం లెబో హమాతుకు ఎదురుగా ఉన్న చోటుకు సరిహద్దుగా ఉంటుంది. ఇది పశ్చిమ సరిహద్దు అవుతుంది. “ఇశ్రాయేలు ప్రజ గోత్రాల ప్రకారం దేశాన్ని నీవు పంచాలి. మీరు దానిని మీకు మీ మధ్య నివసిస్తూ పిల్లలను కన్న విదేశీయులకు వారసత్వంగా పంచుకోవాలి. మీరు వారిని స్థానిక ఇశ్రాయేలీయులుగా పరిగణించాలి; మీతో పాటు వారికి ఇశ్రాయేలు గోత్రాల మధ్య వారసత్వం ఇవ్వబడుతుంది. ఏ గోత్రికుల మధ్య పరదేశులు నివసిస్తున్నారో ఆ గోత్రాల భూభాగంలో వారికి వారసత్వం ఇవ్వాలి” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
యెహెజ్కేలు 47:1-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన నన్ను మందిరపు గుమ్మానికి తోడుకుని వచ్చాడు. మందిరం తూర్పు వైపుకు తిరిగి ఉంది. నేను చూసినపుడు మందిరం గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పు వైపుకు పారుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠానికి దక్షిణ దిశగా మందిరం కుడిపక్కన కింద నుండి పారుతున్నాయి. తరవాత ఆయన ఉత్తరపు గుమ్మం మార్గంలో నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పుకు పోయే దారిలో బయటి గుమ్మానికి తోడుకుని వచ్చాడు. నేను చూసినప్పుడు అక్కడ గుమ్మపు కుడిపక్కన నీళ్లు ఉబికి పారుతున్నాయి. ఆ వ్యక్తి కొలనూలు చేత పట్టుకుని తూర్పు వైపుకు వెళ్లి 540 మీటర్లు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు ఆ నీళ్లు చీలమండ లోతు వచ్చాయి. ఆయన ఇంకో 540 మీటర్లు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మోకాళ్ల లోతు వచ్చాయి. ఇంకా ఆయన 540 మీటర్లు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మొల లోతుకు వచ్చాయి. ఆయన ఇంకా 540 మీటర్లు కొలిచాడు. అప్పుడు ఆ నీళ్లు చాల లోతుగా మారి నేను దాటలేనంత నది కనబడింది. దాటడానికి వీలులేకుండ ఈదాల్సినంత నీటితో ఉన్న నదిగా మారింది. అప్పుడాయన నాతో “నరపుత్రుడా, నీవు చూశావు గదా” అని చెప్పి నన్ను మళ్ళీ నది ఇవతలికి తీసుకుని వచ్చాడు. నేను వెనక్కి వస్తుండగా నదీతీరాన రెండు వైపులా చెట్లు విస్తారంగా కనబడ్డాయి. అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశానికి ప్రవహించి అరబాలోకి దిగి సముద్రంలో పడుతుంది. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా మారిపోతాయి. ఈ నది ప్రవహించే చోటల్లా జలచరాలన్నీ బతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి రావడం వలన ఆ నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయి కాబట్టి చేపలు విస్తారంగా పెరుగుతాయి. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తం బతుకుతాయి. ఏన్గెదీ పట్టణం మొదలుకుని ఏనెగ్లాయీము పట్టణం వరకూ చేపలు పట్టేవారు దాని ఒడ్డున నిలిచి వలలు వేస్తారు. మహా సముద్రంలో ఉన్నట్టు అన్ని రకాల జాతుల చేపలు దానిలో బహు విస్తారంగా ఉంటాయి. అయితే ఆ సముద్రంలోని బురద స్థలాలు, ఊబి తావులు బాగవ్వక ఉప్పును అందిస్తూ ఉంటాయి. నదీతీరాన రెండు వైపులా ఆహారమిచ్చే సకల జాతుల వృక్షాలు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి ప్రవహిస్తున్నది కాబట్టి ఆ చెట్లు ప్రతి నెలా కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారానికీ వాటి ఆకులు ఔషధాలకు పని చేస్తాయి.” ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రకారం మీరు స్వాస్థ్యంగా పంచుకోవాల్సిన భూమి ఇది. యోసేపు సంతానానికి రెండు భాగాలియ్యాలి. నేను ఈ దేశాన్ని ప్రమాణ పూర్వకంగా మీ పూర్వీకులకు ఈ దేశం ఇచ్చాను కాబట్టి భేదం ఏమీ లేకుండ మీలో ప్రతి ఒక్కరు దానిలో స్వాస్థ్యం పొందుతారు. ఆ విధంగా అది మీకు స్వాస్థ్యమవుతుంది. ఉత్తరాన సెదాదుకు పోయే మార్గంలో మహా సముద్రం మొదలుకుని హెత్లోను వరకూ దేశానికి సరిహద్దు. అది హమాతుకు, బేరోతాయుకు, దమస్కు సరిహద్దుకు, హమాతు సరిహద్దుకు మధ్య ఉన్న సిబ్రయీముకు, హవ్రాను సరిహద్దును ఆనుకుని ఉన్న మధ్యస్థలమైన హాజేరుకు వ్యాపిస్తుంది. పడమటి సరిహద్దు హసరేనాను అనే దమస్కు సరిహద్దు పట్టణం, ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పుదిక్కున హవ్రాను, దమస్కు, గిలాదులకు ఇశ్రాయేలీయుల దేశానికి మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉంటుంది. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకూ దాన్ని కొలవాలి. ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణ దిక్కున తామారు మొదలుకుని కాదేషు దగ్గర ఉన్న మెరీబా ఊటల వరకూ నది దారిలో మహాసముద్రానికి మీ సరిహద్దు ఉంటుంది. ఇది మీకు దక్షిణపు సరిహద్దు. పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకూ మహాసముద్రం సరిహద్దుగా ఉంటుంది. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీయుల గోత్రాల ప్రకారం ఈ దేశాన్ని మీరు పంచుకోవాలి. మీరు చీట్లువేసి మీకూ మీలో నివసించి పిల్లలు కన్న పరదేశులకూ ఆస్తులను విభజించేటప్పుడు ఇశ్రాయేలీయుల దేశంలో పుట్టిన వారిగానే ఆ పరదేశులను మీరు ఎంచాలి. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తాము కూడా స్వాస్థ్యం పొందేలా మీలాగా వారు కూడా చీట్లు వేయాలి. ఏ గోత్రంలో పరదేశులు కాపురముంటారో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్థ్యం ఇవ్వాలి.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
యెహెజ్కేలు 47:1-23 పవిత్ర బైబిల్ (TERV)
ఆ మనుష్యుడు నన్ను మళ్లీ ఆలయ ద్వారంవద్దకు నడిపించాడు. ఆలయ తూర్పు గుమ్మం క్రిందనుంచి నీరు బయటకు రావటం చూశాను. (ఆలయ ముఖద్వారం తూర్పునకే ఉంది) బలిపీఠానికి దక్షిణంగా ఉన్న ఆలయ దక్షిణపు భాగం చివరి నుండి నీరు ప్రవహిస్తూ ఉంది. ఆ మనుష్యుడు నన్ను ఉత్తర ద్వారం గుండా బయటికి తీసుకొని వచ్చి ఆ తరువాత తూర్పున ఉన్న వెలుపలి ద్వారం బయట చుట్టూ తిప్పాడు. ఆలయ దక్షిణ భాగాంలో నీరు బయటికి వస్తూఉంది. ఆ మనుష్యుడు ఒక కొలత బద్ద పట్టుకొని నూరు మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లను దాటమని అతడు నాకు చెప్పాడు. నీళ్లు చీలమండలవరకు వచ్చాయి. అతడు మరో ఐదు వందల ఎనభై ఆరు గజాల రెండడుగుల దూరం కొలిచాడు. మళ్లీ ఆ ప్రదేశంలో నీళ్లలో నడవమని అతడు నాకు చెప్పాడు. అక్కడ నీరు నా మోకాళ్ల వరకు వచ్చింది. మరో వెయ్యి మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లలోనుండి నడవమని అతడు నాకు చెప్పాడు. అక్కడ నీరు నా మొలలోతు వచ్చింది. ఆ మనిషి మరో వెయ్యి మూరలు కొలిచాడు. కాని అక్కడ నీరు దాటలేనంత లోతుగా ఉంది. అది ఒక నది అయింది. నీరు ఈదటానికి అనువైన లోతున ఉంది. అది దాట శక్యముగానంత లోతైన నది అయ్యింది. “నరపుత్రుడా, నీవు చూచిన విషయాలను శ్రద్ధగా పరిశీలించావా?” అని ఆ మనుష్యుడు నన్నడిగాడు. పిమ్మట నది ప్రక్కగా ఆ మనుష్యుడు నన్ను తిరిగి వెనుకకు తీసుకొని వచ్చాడు. నేను నది ప్రక్కగా తిరిగి వస్తూ వుండగా నీటికి రెండు ప్రక్కలా రకరకాల చెట్లు చూశాను. ఆ మనుష్యుడు నాతో ఇలా అన్నాడు: “ఈ నీరు తూర్పుగా అరబా లోయలోకి ప్రవహిస్తూ ఉంది. ఈ నీరు మృత సముద్రంలోకి ప్రవహించటంతో, దానిలోని నీరు మంచినీరై శుభ్ర పడుతూ ఉంది. ఈ నీటిలో చేపలు విస్తారంగా వుంటాయి. ఈ నది ప్రవహించే ప్రాంతంలో అన్ని రకాల జంతువులు నివసిస్తాయి. ఏన్గెదీ పట్టణం నుండి ఏనెగ్లాయీము పట్టణం వరకు బెస్తవాళ్లు నది ఒడ్డున నిలబడి ఉండటం నీవు చూడగలవు. వారు తమ వలలు విసరి రకరకాల చేపలు పట్టటం నీవు చూడవచ్చు. మధ్యధరా సముద్రంలో ఎన్ని రకాల చేపలు వుంటాయో మృత సముద్రంలో అన్ని రకాల చేపలు ఉంటాయి. కాని అక్కడి పర్రలు, మరియు కొద్దిగానున్న తడి ప్రదేశాలు మంచి భూమిగా మారవు. అవి ఉప్పు తయారు చేయటానికి వదిలివేయబడతాయి. అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు నదికి ఇరు ప్రక్కల పెరుగుతాయి. వాటి ఆకులు ఎన్నడూ ఎండవు. ఆ చెట్లు పండ్లు ఇవ్వకుండా ఎప్పుడూ ఉండవు. ప్రతినెలా అవి పండ్లు ఇస్తూనే ఉంటాయి. చెట్లకు కావలసిన నీరు ఆలయం నుండి వస్తూ ఉంటుంది గనుక ఇలా జరుగుతుంది. చెట్ల నుండి లభించే పండ్లు ఆహారం నిమిత్తమూ, ఆకులు ఔషధాలకూ వినియోగపడతాయి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇశ్రాయేలులోని పన్నెండు వంశ తెగలకు దేశాన్ని పంచే సరిహద్దులు ఇవి: యోసేపుకు రెండు భాగాలు. మీరు దేశాన్ని సమానంగా పంచుకోవాలి. ఈ దేశాన్ని ఇస్తానని మీ పూర్వీకులకు నేను ప్రమాణం చేశాను. కావున ఇది మీకు నేను ఇస్తున్నాను. “దేశ సరిహద్దులు ఇవి: ఉత్తరాన మధ్యధరా సముద్రం నుండి మొదలై హెత్లోను మార్గం ద్వారా హమాతు మార్గం వద్ద మలుపు తిరిగి తరువాత జెదాదుకు బేరోతాయునకు, హాజేరు హమాతుకు పొలి మేరన గల సిబ్రయీము మరియు హవ్రానుకు పొలి మేరనగల దమస్కు హత్తికోను వరకు. అలా సముద్రం నుండి హసరేనాను వెళ్లి ఉత్తర పొలిమేరలోని దమస్కు మరియు హమాతు వరకూ వ్యాపించింది. ఇది ఉత్తర సరిహద్దు. “తూర్పు సరిహద్దు హసరేనాను నుండి మొదలై హవ్రాను, దమస్కుల మధ్యగా యొర్దాను నది ప్రక్కగా గిలాదు, ఇశ్రాయేలు భూభాగాల మధ్యగా తూర్పు సముద్ర తీరం వెంబడి తామారు వరకు వ్యాపించింది. ఇది తూర్పు సరిహద్దు. “దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబా కాదేషు ఊటల వరకు ఉంది. అది అక్కడ నుండి ఈజిప్టు వాగు ప్రక్కగా మధ్యధరా సముద్రం వరకు వ్యాపించింది. ఇది దక్షిణ సరిహద్దు. “పశ్చిమాన లేబో-హమాతు వరకు మధ్యధరా సముద్ర తీరమంతా సరిహద్దుగా ఉంటుంది. ఇది మీ పడమటి సరిహద్దు. “మీరీ దేశాన్ని ఇశ్రాయేలు తెగలకు విభజించాలి. దీనిని మీరు ఆస్తిలా మీ మధ్య, మీ మధ్య నివసించే పరదేశీయులకు, మీలో ఉంటూ పిల్లలు కన్న వారికి మధ్య పంచియివ్వాలి. ఈ పరదేశీయులు దేశపౌరులే. వారు సహజంగా ఇక్కడ పుట్టి పెరిగిన ఇశ్రాయేలీయుల మాదిరే ఉంటారు. ఇశ్రాయేలు తెగలకు చెందిన భూమినుండి మీరు వారకి కొంత భూమిని విభజిస్తారు. ఆ పౌరుడు ఏ తెగలో నివసిస్తూవుంటాడో అది అతనికి కొంత భూమిని ఇవ్వాలి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
యెహెజ్కేలు 47:1-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని . వచ్చెను; మందిరము తూర్పుముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడపక్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను క్రిందనుండి పారు చుండెను, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపుమార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటిగుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేతపట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడెను, దాట వీలులేకుండ ఈదవలసినంత నీరుగల నదియాయెను. అప్పుడాయన నాతో ఇట్లనెను–నరపుత్రుడా, నీవు చూచితివిగదా అని చెప్పి నన్ను మరల నది యిద్దరికి తోడుకొనివచ్చెను. నేను తిరిగిరాగా నదీతీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడాయన నాతో ఇట్లనెను–ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపునీళ్లు మంచినీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును. మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లా యీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములును ఊబిస్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును. నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–సరిహద్దులనుబట్టి ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి యిది; యోసేపు సంతతికి రెండు భాగములియ్యవలెను. నేను ప్రమాణముచేసి మీపితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును. ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు. అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును. పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువవలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణదిక్కున తామారు మొదలుకొని కాదేషునొద్దనున్న మెరీబా ఊటలవరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును; ఇది మీకు దక్షిణపు సరిహద్దు. పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లువేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించు నప్పుడు ఇశ్రాయేలీయులలో దేశమందు పుట్టినవారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను, ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీవలె వారును చీట్లు వేయవలెను. ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యము ఇయ్యవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.