యెహెజ్కేలు 37:3-6
యెహెజ్కేలు 37:3-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“మనుష్యకుమారుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా?” అని ఆయన నన్ను అడిగారు. అందుకు నేను, “ప్రభువైన యెహోవా, అది మీకు మాత్రమే తెలుసు” అని చెప్పాను. ఆయన నాతో ఇలా అన్నారు, “ఈ ఎముకలకు ప్రవచించి వాటితో ఇలా చెప్పు: ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు బ్రతికేలా మీలోనికి ఊపిరి పంపిస్తాను. మీకు కండరాలను అతికించి మాంసాన్ని పొదిగి మీమీద చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పెడతాను, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
యెహెజ్కేలు 37:3-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను. అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. “ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి. ఈ ఎముకలకు యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీరు బతికేలా నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను. మీకు నరాలిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తే మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
యెహెజ్కేలు 37:3-6 పవిత్ర బైబిల్ (TERV)
నా ప్రభువైన యెహోవా నన్ను, “నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని అడిగాడు. “నా ప్రభువైన యెహోవా, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను. అందుకు నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి! నా ప్రభువైన యెహోవా మీకు ఈ విషయాలు చెపుతున్నాడు: మీలోకి ఊపిరి వచ్చేలా చెస్తాను. మీరు ప్రాణం పోసుకుంటారు! మీమీద మళ్లీ నరాలు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని చర్మంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. మీరు బతుకుతారు! అప్పుడు ప్రభువును, యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’”
యెహెజ్కేలు 37:3-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన–నర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా–ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని. అందుకాయన–ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము–ఎండిపోయిన యెముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను; చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.