యెహెజ్కేలు 33:1-16
యెహెజ్కేలు 33:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: “మనుష్యకుమారుడా, నీ ప్రజలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘నేను ఒక దేశం మీదికి ఖడ్గాన్ని రప్పించగా ఆ ప్రజలు తమలో ఒకరిని ఎంచుకుని అతన్ని తమ కావలివానిగా పెట్టుకుంటారు. అతడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదుతాడు, అప్పుడు ఒకవేళ ఎవరైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్త పడకపోతే ఆ ఖడ్గం వచ్చి వారి ప్రాణాన్ని తీస్తుంది, వారి చావుకు వారే బాధ్యులు. వారు బూర శబ్దం విని కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు, కాబట్టి వారి చావుకు వారే బాధ్యులు. ఒకవేళ వారు ఆ హెచ్చరికకు జాగ్రత్తపడి ఉంటే, వారు తమ ప్రాణాలను కాపాడుకునేవారు. అయితే ఒకవేళ కావలివాడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి కూడా ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదకపోతే, ఖడ్గం వచ్చి ఎవరినైనా చంపితే, చనిపోయినవారు తమ పాపాల కారణంగా చనిపోయినప్పటికి, నేను ఆ కావలివాన్ని బాధ్యున్ని చేస్తాను.’ “మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు. నేను దుర్మార్గునితో, ‘దుర్మార్గుడా, నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, వారి మార్గాలను విడిచిపెట్టమని నీవు వాన్ని హెచ్చరించకపోతే, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే వాని చావుకు నిన్ను బాధ్యున్ని చేస్తాను. అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా ఆ దుర్మార్గులు తమ దుష్టత్వాన్ని వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు, అయితే నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు, “మా పాపాలు దోషాలు మాకు భారంగా ఉన్నాయి, వాటివలన మేము క్షీణించి పోతున్నాము; మేమెలా బ్రతకాలి?” అని అంటున్నారు.’ నీవు వారితో ఇలా చెప్పు, ‘నా జీవం తోడు, దుర్మార్గులు చనిపోతే నాకు సంతోషం ఉండదు గాని వారు తమ చెడు మార్గాలు విడిచి బ్రతికితే నాకు సంతోషము. తిరగండి! మీ చెడు మార్గాల నుండి తిరగండి! ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చస్తారు?’ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. “కాబట్టి మనుష్యకుమారుడా, నీ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఒకవేళ నీతిమంతులు పాపం చేస్తే, వారి గతంలోని నీతికి విలువ ఉండదు. అలాగే దుష్టులు పశ్చాత్తాపపడితే, వారి యొక్క గతంలోని దుష్టత్వం శిక్షను తీసుకురాదు. పాపం చేసే నీతిమంతులు గతంలో నీతిమంతులుగా ఉన్నప్పటికీ, వారు జీవించడానికి అనుమతించబడరు.’ నీతిమంతులు తప్పక జీవిస్తారని నేను చెప్పినా సరే, వారు తమ నీతిని నమ్ముకొని పాపం చేస్తే, వారు చేసిన ఏ నీతికార్యాలు జ్ఞాపకం చేసుకోబడవు; వారు చేసిన పాపానికి వారు చస్తారు. అలాగే ఒకవేళ నేను దుర్మార్గులతో, ‘మీరు తప్పక చస్తారు’ అని చెప్తే, వారు తమ పాపాన్ని విడిచిపెట్టి, న్యాయమైనవి, సరియైనవి చేస్తూ, వారు అప్పు ఇచ్చినప్పుడు తాకట్టుగా పెట్టుకున్న వాటిని తిరిగి ఇస్తే, వారు దొంగిలించింది తిరిగి ఇస్తే, జీవితాన్ని ఇచ్చే శాసనాలను అనుసరిస్తూ కీడు చేయనట్లైతే; ఆ వారు ఖచ్చితంగా బ్రతుకుతారు; వారు చనిపోరు. వారు చేసిన పాపాల్లో ఏదీ జ్ఞాపకం చేసుకోబడదు. వారు న్యాయమైనవి, సరియైనవి చేశారు; కాబట్టి వారు ఖచ్చితంగా బ్రతుకుతారు.
యెహెజ్కేలు 33:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. “నరపుత్రుడా, నువ్వు నీ ప్రజలకు ఈ విషయం చెప్పు, నేను ఒకానొక దేశం మీదికి కత్తి రప్పిస్తే ఆ ప్రజలు తమలో ఒకణ్ణి ఎన్నుకుని కావలివానిగా ఏర్పరచుకున్నారనుకో. అతడు దేశం మీదికి కత్తి రావడం చూసి, బూర ఊది ప్రజలను హెచ్చరిక చేస్తాడనుకో. అప్పుడు ఎవడైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్తపడక పోతే, కత్తి వచ్చి వాడి ప్రాణం తీసేస్తే వాడు తన చావుకు తానే బాధ్యుడు. బూర శబ్దం విని కూడా వాడు జాగ్రత్త పడలేదు కాబట్టి తన చావుకు తానే బాధ్యుడు. వాడు జాగ్రత్త పడితే తన ప్రాణాన్ని రక్షించుకునేవాడే. అయితే కావలివాడు కత్తి రావడం చూసినా కూడా, బూర ఊదకుండా ప్రజలను హెచ్చరించకుండా ఉన్నాడనుకో. కత్తి వచ్చి వాళ్ళలో ఒకడి ప్రాణం తీస్తే, వాడు తన దోషాన్ని బట్టి చస్తాడు. కానీ, అతని చావుకు నేను కావలి వాడినే బాధ్యుని చేస్తాను. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివాడిగా నియమించాను. కాబట్టి నువ్వు నా నోటి మాట విని నా పక్షంగా వారిని హెచ్చరించాలి. ‘దుర్మార్గుడా, నువ్వు తప్పకుండా చస్తావు’ అని దుర్మార్గుడికి నేను చెబితే, నువ్వు అతణ్ణి హెచ్చరించకపోతే ఆ దుర్మార్గుడు తన దోషాన్ని బట్టి చస్తాడు. అయితే అతని చావుకు నిన్నే బాధ్యుని చేస్తాను. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టాలని నువ్వు అతన్ని హెచ్చరించావనుకో. అతడు తన దుర్మార్గం విడిచి పెట్టకపోతే అతడు తన దోషాన్ని బట్టి చస్తాడు గానీ నువ్వు అతని చావుకు బాధ్యుడివి కాదు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ విషయం తెలియచెయ్యి. ‘మా అపరాధాలూ పాపాలూ మా మీద భారంగా ఉన్నాయి. వాటి వలన మేము నీరసించిపోతున్నాము. మేమెలా బతుకుతాం?’ అని మీరంటున్నారు. వారితో ఇలా చెప్పు, నా జీవం మీద ఆనబెట్టి చెబుతున్నాను, దుర్మార్గుడు చస్తే నాకేమీ సంతోషం లేదు. దుర్మార్గుడు తన పద్ధతిని బట్టి పశ్చాత్తాపపడి బతకాలి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు మార్చుకోండి. మీ దుర్మార్గతనుంచి పశ్చాత్తాప పడండి. మీరెందుకు చావాలి? ఇదే యెహోవా ప్రభువు సందేశం. నరపుత్రుడా, నువ్వు నీ ప్రజలకు ఈ మాట చెప్పు. నీతిమంతుడు పాపం చేస్తే అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు! దుష్టుడు చెడుతనం విడిచి మనస్సు మార్చుకుంటే తాను చేసిన దుర్మార్గాన్ని బట్టి వాడు నాశనం కాడు. అలాగే నీతిమంతుడు పాపం చేస్తే తన నీతిని బట్టి అతడు బతకడు. నీతిమంతుడు తప్పక బతుకుతాడు, అని నేను చెప్పినందువలన అతడు తన నీతిని నమ్ముకుని పాపం చేస్తే మునుపు అతడు చేసిన నీతి పనులన్నిటిలో ఏదీ జ్ఞాపకానికి రాదు. తాను చేసిన పాపాన్ని బట్టి అతడు చస్తాడు. ‘తప్పకుండా చస్తావు’ అని దుర్మార్గునికి నేను చెప్పిన తరువాత అతడు తన పాపం విడిచి, నీతి న్యాయాలను అనుసరిస్తూ తన దగ్గర అప్పు తీసుకున్నవాడికి తాకట్టు మళ్ళీ అప్పగించి, తాను దొంగిలించినదాన్ని మళ్ళీ ఇచ్చి వేసి పాపం చేయకుండా, జీవాధారమైన చట్టాలను అనుసరిస్తే అతడు చావడు. తప్పకుండా బతుకుతాడు. అతడు చేసిన పాపాల్లో ఏదీ అతని విషయం జ్ఞాపకానికి రాదు. అతడు నీతిన్యాయాలను అనుసరిస్తున్నాడు కాబట్టి తప్పకుండా అతడు బతుకుతాడు.
యెహెజ్కేలు 33:1-16 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నీ ప్రజలతో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పు, ‘ఈ దేశం మీదికి నేను శత్రు సైన్యాలను రప్పించవచ్చు. అది జరిగినప్పుడు ప్రజలు ఒకనిని కావలివానిగా ఎంపిక చేస్తారు. ఈ కావలివాడు శత్రుసైన్యాలు రావటం చూచి బూర ఊది ప్రజలను హెచ్చరిస్తాడు. ప్రజలు ఆ హెచ్చరికను విని కూడా జాగ్రత్త పడకపోతే శత్రువు వచ్చి వారిని బందీలుగా పట్టుకుపోతాడు. అటువంటి వ్యక్తి తన మరణానికి తనే బాధ్యుడవుతాడు. అతడు బాకా విన్నాడు. అయినా అతడు హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల అతని చావుకు అతనినే నిందించాలి. ఆ హెచ్చరికను గనుక అతడు లక్ష్యపెట్టి ఉంటే అతడు తన ప్రాణాన్ని కాపాడుకొనగలిగేవాడు. “‘ఒకవేళ కావలివాడు శత్రుసైనికులు రావటం గమనించి కూడా బూర ఊదకపోవచ్చు. అనగా కావలివాడు ప్రజలను హెచ్చరించలేదన్నమాట. అప్పుడు శత్రువు వారిని పట్టుకొని బందీలుగా తీసుకుపోతాడు. తన పాపం కారణంగా ఒక వ్యక్తి పట్టుబడతాడు. అయినా కావలివాడు ఆ మనిషి చావుకు బాధ్యుడైవున్నాడు.’ “నరపుత్రుడా, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వంశానికి నిన్ను కావలివానిగా నియమిస్తున్నాను. నీవు నా నోటి నుండి ఒక వర్తమానం వింటే, నా తరఫున ప్రజలను హెచ్చరించాలి. ‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు’ అని నేను నీకు చెప్పవచ్చు. అప్పుడు నా తరపున నీవు వెళ్లి అతనిని హెచ్చరించాలి. నీవు వెళ్లి ఆ దుష్ట వ్యక్తిని హెచ్చరించక, తన జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్పకపోతే తన పాప ఫలంగా అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నేను నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను. ఒక వేళ నీవా దుష్టవ్యక్తిని తన దుర్మార్గపు జీవితాన్ని మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పినావనుకో, అయినా ఆ వ్యక్తి పాపం చేయటం మానక పోతే తన పాపాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. కానీ నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. “కావున నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడు. అప్పుడు వారు, ‘మేము పాపం చేశాము. ధర్మాన్ని అతిక్రమించాము. మా పాపాలు భరింపరానివి. ఆ పాపాల కారణంగా మేము కుళ్లిపోతున్నాము. మేము జీవించాలంటే ఏమి చేయాలి?’ అని అడుగవచ్చు. “నీవు వారితో ఇలా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నా జీవం తోడుగా ప్రజలు చనిపోతూ ఉంటే చూడటం నాకు ఇష్టముండదని మీకు మాట ఇస్తున్నాను. దుష్టులు చనిపోవటం కూడా నాకు ఇష్టంలేనిపని. వారు చనిపోవాలని నేను కోరను. ఆ దుష్ట జనులంతా నా వద్దకు తిరిగి రావాలనే నేను కోరుకుంటాను. వారు తమ జీవితాలను మార్చుకొని నిజంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను! అందువల్ల నా వద్దకు తిరిగి రండి! చెడు కార్యాలు చేయటం మానండి! ఓ ఇశ్రాయేలు వంశీయులారా, మీరెందుకు మరణించాలి?’ “నరపుత్రుడా, నీ ప్రజలకు ఇలా చెప్పు, ‘ఒక మంచి వ్యక్తి దుష్టుడై పాపం చేయటం మొదలు పెడితే, అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు. ఆ చెడ్డ వ్యక్తి చెడునుండి పరివర్తన చెంది మంచివాడై సత్కార్యాలు చేస్తే, గతంలో అతడు చేసిన పాపపు పనులు అతనిని నాశనం చేయలేవు. కావున ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఒక మంచి వ్యక్తి దుర్మార్గుడై పాపం చేయడం మొదలుపెడితే అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు.’ “ఒక మంచి మనిషికి అతడు జీవిస్తాడని నేను చెప్పవచ్చు. తద్వారా ఆ మంచి మనిషి తను పూర్వం చేసిన సత్కార్యాలు అతనిని రక్షించగలవని అనుకోవటం మొదలు పెట్టవచ్చు. ఆ రకమైన భావనతో అతడు చెడు కార్యాలు చేయటానికి పాల్పడవచ్చు. కాని గతంలో అతడు చేసిన మంచి పనులను నేను గుర్తు పెట్టుకోను! తాను చేయ మొదలు పెట్టిన పాప కార్యాల కారణంగా అతడు చనిపోతాడు. “లేదా, ఒక దుర్మార్గునితో అతడు చచ్చిపోతాడని నేను చెప్పవచ్చు. అయితే అతడు తన జీవితాన్ని మార్చుకోవచ్చు. అతడు పాపం చేయటం మాని, సన్మార్గాన్ని అవలంబించవచ్చు. అతడు మంచివాడై న్యాయశీలి కావచ్చు. అతడు అప్పులిచ్చినప్పుడు తాను కుదువపెట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చి వేయవచ్చు. అతడు దొంగిలించిన వస్తువులకు తగిన పరిహారం చెల్లించవచ్చు. జీవాన్ని ఇచ్చే కట్టడలను అతడు అనుసరించటం మొదలు పెట్టవచ్చు. అతడు చెడు పనులు చేయటం మానవచ్చు. అప్పుడా వ్యక్తి ఖచ్చితంగా జీనిస్తాడు. అతడు మరణించడు. అతడు గతంలో చేసిన చెడ్డ పనులను నేను గుర్తు పెట్టుకోను. ఎందుకంటే అతడిప్పుడు న్యాయవర్తనుడై మంచి మనిషి అయ్యాడు గనుక. అందుచే అతడు జీవిస్తాడు!
యెహెజ్కేలు 33:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము–నేను ఒకానొక దేశముమీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించినయెడల అతడు దేశముమీదికి ఖడ్గము వచ్చుట చూచి, బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్తపడనందున ఖడ్గమువచ్చి వాని ప్రాణము తీసినయెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాదము వినియును వాడు జాగ్రత్తపడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది; ఏలయనగా వాడు జాగ్రత్తపడినయెడల తనప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు, బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించినయెడల వాడు తన దోషమునుబట్టి పట్టబడినను, నేను కావలివానియొద్ద వాని ప్రాణమునుగూర్చి విచారణచేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. –దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణచేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము–మా పాపదోషములు మామీద పడియున్నవి, వాటివలన మేము క్షీణించుచున్నాము, మనమెట్లు బ్రదుకుదుమని మీరు చెప్పుకొనుమాట నిజమే. కాగా వారితో ఇట్లనుము–నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతో షము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పు కొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము–నీతిమంతుడు పాపము చేసిన దినమున అదివరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడు తనమునుబట్టివాడు పడిపోడు, ఆలాగుననే నీతిమంతుడు పాపముచేసిన దినమున తన నీతినిబట్టి అతడు బ్రదుక జాలడు. నీతిమంతుడు నిజముగా బ్రదుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారముచేసికొని పాపము చేసినయెడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు, తాను చేసిన పాపమునుబట్టి యతడు మరణము నొందును. మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన పాపము విడిచి, నీతి న్యాయములను అనుసరించుచు కుదువసొమ్మును మరల అప్పగించుచు, తాను దొంగిలినదానిని మరల ఇచ్చివేసి పాపము జరిగింపక యుండి, జీవాధారములగు కట్టడలను అనుసరించినయెడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రదుకును. అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు, అతడు నీతిన్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రదుకును.