యెహెజ్కేలు 31:4-9
యెహెజ్కేలు 31:4-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సమృద్ధియైన జలాలు దానిని పోషించాయి, లోతైన నీటి ఊటలు దానిని ఎత్తుగా పెరిగేలా చేశాయి; వాటి ప్రవాహాలు దాని మొదలు చుట్టూ ప్రవహించాయి, పొలంలో ఉన్న చెట్లన్నిటికి దాని కాలువలు నీరు అందించాయి. కాబట్టి పొలం లోని చెట్లన్నిటి కన్నా ఆ చెట్టు ఎత్తుగా ఎదిగింది; నీరు సమృద్ధిగా ఉన్నందున, దాని కొమ్మలు విస్తరించి, పెద్ద శాఖలుగా ఎదిగాయి. ఆకాశ పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి, అడవి జంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టాయి; గొప్ప జనాంగాలన్నీ దాని నీడలో నివసించాయి. నీరు సమృద్ధిగా ఉన్న చోటికి దాని వేర్లు వ్యాపించాయి, కాబట్టి అది విస్తరించిన కొమ్మలతో ఎంతో అందంగా ఉంది. దేవుని తోటలో దేవదారు వృక్షాలు కూడా దానితో పోటీపడలేకపోయాయి, సరళ వృక్షాలు దాని కొమ్మలతో సమానం కాలేవు, అక్షోట వృక్షాల కొమ్మలు దాని కొమ్మలతో పోల్చబడలేవు, దానికి ఉన్నంత అందం దేవుని తోటలో ఉన్న ఏ చెట్టుకు లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని అందంగా తయారుచేశాను, దేవుని తోటయైన ఏదెను లోని చెట్లన్నీ దానిని చూసి అసూయపడేలా చేశాను.
యెహెజ్కేలు 31:4-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీళ్లు సమృద్ధిగా ఉండడం వలన అది ఎత్తుగా ఎదిగింది. లోతైన నదిని బట్టి మహావృక్షం అయింది. దాని చుట్టూ కాలువలు పారుతున్నాయి. వాటి పిల్ల కాలువలు ఆ ప్రాంతంలోని చెట్లన్నిటికీ నీళ్ళు అందించాయి. ఆ ప్రాంతంలోని చెట్లన్నిటి కంటే అది ఎంతో ఎత్తుగా ఎదిగింది. దానికి చాలా ఎక్కువ కొమ్మలు ఉన్నాయి. నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి దాని కొమ్మలు పొడుగ్గా పెరిగాయి. పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి. భూజంతువులన్నీ దాని గుబురులో పిల్లలు పెట్టాయి. దాని నీడలో అన్ని రకాల జాతులు నివసించాయి. నీళ్ళు సమృద్ధిగా ఉన్న దగ్గర దాని వేళ్ళు పాకాయి. కాబట్టి అది పొడవాటి కొమ్మలతో అది అందంగా, గొప్పగా ఉంది. దేవుని తోటలోని దేవదారు వృక్షాలు దానికి సాటి కావు. సరళ వృక్షాలకు అలాంటి కొమ్మలు లేవు. మేడి చెట్ల కొమ్మలు దీని కొమ్మలకు సాటిరావు. దానికున్నంత అందం దేవుని తోటలోని వృక్షాల్లో దేనికీ లేదు! అనేక కొమ్మలతో నేను దాన్ని అందంగా చేశాను. అందుకు దేవుని తోట, ఏదెనులోని వృక్షాలన్నీ దాని మీద అసూయపడ్డాయి.”
యెహెజ్కేలు 31:4-9 పవిత్ర బైబిల్ (TERV)
మంచి నీటివనరు చెట్టును బాగా పెరిగేలా చేసింది. లోతైన నది అది ఎత్తుగా పెరగటానికి దోహదమిచ్చింది. చెట్టు నాటబడిన ప్రాంతంలో నదులు ప్రవహించాయి. దాని కాలువలే అక్కడి పొలాల్లో ఉన్న చెట్లకు నీటిని అందజేశాయి ఆ వృక్షం అలా మిగిలిన చెట్లన్నిటిలో పొడవుగా పెరిగింది. దానికి ఎన్నో కొమ్మలు పెరిగాయి. నీరు పుష్కలంగా ఉంది. అందువల్ల దాని కొమ్మలు విస్తరించాయి. కావున పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి. ఆ ప్రాంతంలో జంతువులన్నీ దాని చల్లని నీడలో తమ పిల్లల్ని పెట్టాయి. గొప్ప రాజ్యాలన్నీ ఆ చెట్టు నీడలో నివసించాయి! ఆ విధంగా ఆ చెట్టు తన గొప్పతనంలోను, తన పొడవైన కొమ్మలతోను, ఎంతో ఆందంగా కన్పించింది. ఎందువల్ల ననగా దానివేళ్ళు నీరు బాగా అందేవరకు నాటుకున్నాయి! దేవుని ఉద్యానవనంలో ఉన్న కేదారు వృక్షాలు కూడా ఈ చెట్టంత పెద్దగా లేవు. దీనికి ఉన్నన్ని కొమ్మలు సరళ వృక్షాలకు కూడా లేవు. అక్షోట (మేడి) చెట్లకు అసలిటువంటి కొమ్మలే లేవు. దేవుని ఉద్యానవనంలో ఇంత అందమైన చెట్టేలేదు. అనేకమైన కొమ్మలతో ఈ చెట్టును నేను అందమైనదిగా చేశాను. ఏదెనులో దేవుని ఉద్యానవనంలో ఉన్న చెట్లన్నీ దీనిపట్ల అసూయ చెందాయి!’”
యెహెజ్కేలు 31:4-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీళ్లుండుటవలన అది మిక్కిలి గొప్పదాయెను, లోతైన నది ఆధారమై నందున అది మిక్కిలి యెత్తుగా పెరిగెను, అది యుండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోని చెట్లన్నిటికిని ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలము లోని చెట్లన్నిటికంటె ఎత్తుగలదాయెను, దాని శాఖలు బహు విస్తారములాయెను, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్లు పెద్దకొమ్మలాయెను. ఆకాశపక్షులన్నియు దాని శాఖలలో గూళ్లుకట్టుకొనెను, భూజంతువులన్నియు దాని కొమ్మలక్రింద పిల్లలు పెట్టెను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడుగైన కొమ్మలుకలిగి దానివేరు విస్తార జలమున్న చోట పారుటవలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయెను. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను, సరళవృక్షములు దాని శాఖలంత గొప్పవికావు, అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవికావు, దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను.