యెహెజ్కేలు 21:1-31 - Compare All Versions
యెహెజ్కేలు 21:1-31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు యెహోవా వాక్కు నాకు వచ్చి: “మనుష్యకుమారుడా, యెరూషలేము వైపు నీ ముఖం త్రిప్పుకుని పరిశుద్ధాలయం గురించి ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రవచించి ఇలా చెప్పు: యెహోవా ఇలా చెప్తున్నారు: ‘ఓ ఇశ్రాయేలూ, నేను నీకు విరోధంగా ఉన్నాను. ఒర నుండి నా ఖడ్గాన్ని దూసి నీలో ఉన్న నీతిమంతులను, దుర్మార్గులను హతమారుస్తాను. నీతిమంతులను, దుర్మార్గులను చంపబోతున్నాను కాబట్టి, దక్షిణం నుండి ఉత్తరం వరకు వారందరినీ చంపే వరకు నా ఖడ్గం ఒరలో పెట్టబడదు. అప్పుడు యెహోవానైన నేనే నా ఖడ్గాన్ని మళ్ళీ ఒరలో పెట్టకుండా దూసానని ప్రజలందరూ తెలుసుకుంటారు.’ “కాబట్టి మనుష్యకుమారుడా, మూల్గు! నీ విరిగిన మనస్సుతో తీవ్రమైన దుఃఖంతో వారి ముందు మూలుగు. ‘నీవెందుకు మూల్గుతున్నావు?’ అని వారు అడిగినప్పుడు, నీవు వారితో, ‘శ్రమ దినం వస్తుందనే భయంకరమైన వార్త నాకు వినబడింది! ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది, ప్రతి చేయి బలహీనం అవుతుంది. ప్రతి ఆత్మ సొమ్మసిల్లుతుంది, ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది’ అని చెప్తావు. అది వస్తోంది! అది తప్పక జరుగుతుందని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: “మనుష్యకుమారుడా, నీవు ప్రవచించి ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం పదును పెట్టబడి మెరుగు పెట్టబడింది. వధించడానికి పదును పెట్టబడింది, మెరుపులా మెరిసేలా మెరుగు పెట్టబడింది! “ ‘నా కుమారుని రాజదండాన్ని బట్టి మనం సంతోషిద్దామా? అలాంటి ప్రతి దండాన్ని ఆ ఖడ్గం తృణీకరిస్తుంది. “ ‘ఆ ఖడ్గం మెరుగుపరచడానికి, చేతితో పట్టుకోడానికి నియమించబడింది; హతం చేసేవాడు పట్టుకోడానికి, అది పదును పెట్టబడి, మెరుగు పెట్టబడి సిద్ధంగా ఉంది. మనుష్యకుమారుడా, మొరపెట్టు, రోదించు ఆ ఖడ్గం నా ప్రజలమీదికి ఇశ్రాయేలు అధిపతులందరి మీదికి వస్తున్నది. నా ప్రజలతో పాటు వారు కూడా ఖడ్గంతో చంపబడతారు. కాబట్టి నీ రొమ్ము కొట్టుకో. “ ‘పరీక్ష తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఖడ్గం తృణీకరించిన రాజదండం కూడా కొనసాగకపోతే ఎలా? అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ “కాబట్టి మనుష్యకుమారుడా, ప్రవచించు, నీ రెండు చేతులతో చప్పట్లు కొట్టు. ఖడ్గం రెండు సార్లు దాడి చేయును గాక మూడుసార్లు అయినా దాడి చేయును గాక. అది వధ కొరకైన ఖడ్గం, మహా వధ కొరకైన ఖడ్గం, అన్ని వైపుల నుండి వారి మీద దాడి చేస్తుంది. తద్వార వారి హృదయాలు భయంతో కరిగిపోవును గాక, చాలామంది హతమవుదురు గాక, వారి గుమ్మాలన్నిటి దగ్గర నేను ఖడ్గాన్ని నిలబెట్టాను. చూడండి! అది తళతళ మెరుస్తూ ఉంది, అది వధ కోసం దూయబడింది. ఖడ్గమా! కుడివైపు వేటు వేయి, తర్వాత ఎడమవైపు వేటు వేయి. ఎటువైపు త్రిప్పబడితే అటు వేటు వేయి. నేను కూడా నా చేతులతో చప్పట్లు కొట్టి, నా ఉగ్రత తీర్చుకుంటాను. యెహోవానైన నేనే ఈ మాట అన్నాను.” యెహోవా వాక్కు నాకు వచ్చి: “మనుష్యకుమారుడా, బబులోను రాజు ఖడ్గం పట్టడానికి రెండు దారులను ఏర్పరచు, రెండూ ఒకే దేశం నుండి మొదలవుతాయి. ఒక సూచికను తయారుచేసి, పట్టణానికి వెళ్లే రహదారి ఆరంభంలో ఉంచు. అమ్మోనీయుల పట్టణమైన రబ్బా మీదికి ఒక మార్గాన్ని, అలాగే యూదా దేశంలో ఉన్న ప్రాకార పట్టణమైన యెరూషలేము మీదికి ఒక ఖడ్గం వచ్చేలా మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలి. దారులు విడిపోయే చోట రెండు మార్గాలు చీలే స్థలంలో శకునం తెలుసుకోవడానికి బబులోను రాజు ఆగుతాడు. అతడు బాణాలను అటూ ఇటూ ఆడిస్తూ విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు. అతడు కాలేయం శకునాన్ని పరీక్షించి చూస్తున్నాడు. యెరూషలేము గురించి తన కుడి వైపున శకునం కనిపించింది ఏర్పాటు చేయమని, చంపమని, యుద్ధధ్వని చేయమని, గుమ్మాలకు ఎదురుగా పడగొట్టే యంత్రాలు ఏర్పాటు చేయమని, ముట్టడి దిబ్బలు వేయమని చెప్పాడు. అతనితో ఒప్పందం చేసుకున్న వారికి ఇది తప్పుడు శకునంగా కనిపిస్తుంది, కాని అతడు వారి అపరాధాన్ని వారికి గుర్తు చేసి వారిని బందీగా తీసుకెళ్తాడు. “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరు బహిరంగంగా తిరుగుబాటు చేసి మీ అపరాధాన్ని గుర్తుకు తెచ్చారు, మీరు చేసేవాటన్నిటిలో మీ పాపాలను బయట పెట్టుకున్నారు. మీరు ఇలా చేశారు కాబట్టి, మీరు బందీలుగా కొనిపోబడతారు. “ ‘అపవిత్రుడా ఇశ్రాయేలీయుల దుష్ట అధిపతీ, నిన్ను శిక్షించే రోజు సమీపించింది; నీ శిక్షాకాలం ముగింపుకు చేరుకుంది, ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: తలపాగా తీసివేయి, కిరీటాన్ని తీసివేయి. ఇది వరకు ఉన్నట్లుగా ఇక ఉండదు: అల్పులు హెచ్చింపబడతారు, గొప్పవారు తగ్గించబడతారు. శిథిలం! ఒక శిథిలం! నేను దానిని శిథిలం చేస్తాను! కిరీటం న్యాయంగా ఎవరికి చెందినదో ఆయన వచ్చేవరకు అది ఉండదు; దానిని నేను ఆయనకు ఇస్తాను.’ “మనుష్యకుమారుడా! నీవు ప్రవచించి ఇలా చెప్పు, ‘అమ్మోనీయుల గురించి వారి అవమానాల గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం, వధ కోసం దూయబడింది, నాశనం చేయడానికి మెరుగు పెట్టబడి, మెరుపులా తళతళలాడుతూ ఉంది! నీ గురించి శకునగాండ్రు తప్పుడు దర్శనాలు చూస్తుండగా, నీ గురించి అబద్ధపు శకునాలు చెప్తున్నప్పుడు, ఎవరి దినమైతే వచ్చేసిందో, ఎవరి శిక్షా సమయం ముగింపుకు చేరుకుందో, ఆ దుర్మార్గుల మెడ మీద ఆ ఖడ్గం పెట్టబడుతుంది. వారి మెడ ప్రక్కనే అది నిన్ను పడవేస్తుంది. “ ‘ఖడ్గాన్ని తిరిగి ఒరలో పెట్టు. నీవు సృజించబడిన స్థలంలోనే, నీ పూర్వికుల దేశంలోనే నేను నీకు తీర్పు తీరుస్తాను. నేను నా ఉగ్రతను నీపై కుమ్మరించి నా కోపాగ్నిని నీ మీదికి ఊదుతాను; నాశనం చేయడంలో నేర్పరులైన క్రూరుల చేతికి నిన్ను అప్పగిస్తాను.
యెహెజ్కేలు 21:1-31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు నాకు యెహోవా వాక్కు వచ్చి ఇలా అన్నాడు, “నరపుత్రుడా, యెరూషలేము వైపు నీ ముఖం తిప్పుకుని, వాళ్ళ పవిత్రస్థలాలకూ, ఇశ్రాయేలీయుల దేశానికీ వ్యతిరేకంగా ప్రవచించు. యెహోవా చెప్పేదేమంటే, నేను నీకు విరోధిని. నీతిమంతుడుగాని, దుష్టుడుగాని నీలో ఎవరూ ఉండకుండాా అందరినీ నీనుంచి తెంచివేయడానికి నా కత్తి దూసి ఉన్నాను. నీతిమంతుడుగాని, దుష్టుడుగాని ఎవరూ నీలో ఉండకుండాా దక్షిణం మొదలుకుని ఉత్తరం వరకూ అందరినీ నేను తెంచివేయడానికి నా కత్తి శరీరులందరికీ విరోధంగా బయలుదేరింది. యెహోవానైన నేను నా కత్తి మళ్ళీ ఒరలో పెట్టకుండా దాన్ని దూసి ఉన్నానని ప్రజలందరూ తెలుసుకుంటారు. కాబట్టి నరపుత్రుడా, మూలుగు. వాళ్ళు చూస్తూ ఉండగా నీ నడుము విరిగేలా దుఃఖంతో మూలుగు. అప్పుడు ‘నువ్వు ఎందుకు మూలుగుతున్నావు?’ అని వారు అడుగుతారు. అప్పుడు నువ్వు వాళ్ళతో, ‘కష్టదినం వచ్చేస్తోందనే దుర్వార్త నాకు వినిపించింది. అందరి గుండెలూ కరిగిపోతాయి. అందరి చేతులూ బలహీనం అవుతాయి. అందరి మనస్సులూ సొమ్మసిల్లిపోతాయి, అందరి మోకాళ్లు నీరుగారిపోతాయి. ఇంతగా కీడు వస్తూ ఉంది. అది వచ్చేసింది’ అని చెప్పు. ఇదే యెహోవా వాక్కు.” యెహోవా నాకు ఈ సంగతి మళ్ళీ తెలియజేశాడు. “నరపుత్రుడా, ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువు చెప్పేదేమంటే, ఒక కత్తి, ఒక కత్తి! అది పదునుపెట్టి ఉంది. అది మెరుగుపెట్టి ఉంది. అది భారీ ఎత్తున వధ చెయ్యడానికి పదును పెట్టి ఉంది! తళతళలాడేలా అది మెరుగుపెట్టి ఉంది! నా కుమారుడి రాజదండం విషయంలో మనం ఆనందించాలా? రాబోతున్న రాబోయే కత్తి అలాంటి ప్రతి దండాన్నీ ద్వేషిస్తుంది! కాబట్టి ఆ కత్తిని మెరుగు పెట్టడానికి అప్పగించడం జరుగుతుంది. ఆ తరువాత అది చేతికి వస్తుంది. ఆ కత్తి పదునుపెట్టి ఉంది! హతం చేసేవాడి చేతికి ఇవ్వడానికి ఆ కత్తి మెరుగు పెట్టి ఉంది. నరపుత్రుడా, శోకించు, సాయం కోసం కేకలుపెట్టు! ఆ కత్తి నా ప్రజల మీదకీ, ఇశ్రాయేలీయుల నాయకుల మీదకీ వచ్చింది. కత్తి భయం నా ప్రజలకు కలిగింది గనుక శోకంతో నీ తొడ చరుచుకో! పరీక్ష వచ్చింది. కాని రాజదండం నిలిచి ఉండకపోతే ఎలా?’ ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నరపుత్రుడా, ప్రవచించి నీ రెండు చేతులు చరుచుకో. కత్తి మూడోసారి కూడా దాడి చేస్తుంది! అది భారీ ఎత్తున వధ కొరకైన కత్తి! అది అనేకమందిని హతం చెయ్యడానికీ, వాళ్ళను అన్నిచోట్లా పొడవడానికీ సిద్ధంగా ఉంది! వాళ్ళ గుండెలు కరిగిపోయేలా, అడ్డంకులు అధికం అయ్యేలా వాళ్ళ గుమ్మాలకు విరోధంగా నేను కత్తి దూసి భారీ ఎత్తున వధ సిద్ధం చేశాను! బాధ! అది మెరుపులా ఉంది. వధ చెయ్యడానికి సిద్ధంగా ఉంది. ఓ కత్తీ! కుడివైపు దెబ్బ కొట్టు! ఎడమవైపు దెబ్బ కొట్టు! నీ పదునైన అంచు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లనివ్వు. నేను కూడా నా రెండు చేతులు చరుచుకుని, నా ఉగ్రత తీర్చుకుంటాను! యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను.” యెహోవా నాకీ విషయం మళ్ళీ చెప్పాడు, “నరపుత్రుడా, బబులోను రాజు కత్తి రావడానికి రెండు రహదారులు కేటాయించు. ఆ రెండూ, ఒకే దేశంలోనుంచి బయలుదేరుతాయి. ఆ రెండు రహదారుల్లో ఒకటి, ఒక పట్టణానికి వెళ్తుందన్న సూచన రాసి ఉంటుంది. ఒక రహదారి, అమోనీయుల పట్టణమైన రబ్బాకు బబులోను సైన్యం వెళ్ళే మార్గంగా సూచన రాసి పెట్టు. ఇంకొక రహదారి యూదా దేశంలోని ప్రాకారాలుగల పట్టణమైన యెరూషలేముకు ఆ సైన్యాన్ని నడిపించేదిగా సూచన రాసి పెట్టు. రహదారులు చీలే చోట రెండు దారులు చీలే కూడలిలో శకునం చూడడానికి బబులోను రాజు ఆగాడు. అతడు బాణాలు ఇటు అటు ఆడిస్తూ, విగ్రహాలను అడుగుతున్నాడు. అతడు కాలేయం శకునం పరీక్షించి చూస్తున్నాడు! యెరూషలేము ఎదుట ద్వారాలను పడగొట్టే పరికరాలు సిద్ధం చెయ్యమనీ, ఊచ కోత ఆరంభించమనీ, యుద్ధధ్వని చెయ్యమనీ, ముట్టడి దిబ్బలు కట్టమనీ అడుగుతున్నాడు. యెరూషలేముగూర్చి తన కుడివైపు శకునం కనిపించింది! బబులోనీయులతో ఒప్పందం చేసుకున్న వాళ్ల కళ్ళకు ఈ శకునం వ్యర్ధంగా కనిపిస్తుంది! కాని ఆ రాజు వాళ్ళను పట్టుకోవడం కోసం, వాళ్ళు ఆ ఒప్పందం మీరారు అన్న నెపం వాళ్ళ మీద మోపుతాడు.” కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “మీ దోషం మీరు నా జ్ఞాపకానికి తెచ్చిన కారణంగా మీ అతిక్రమం వెల్లడి ఔతుంది. మీ క్రియలన్నిట్లో మీ పాపం కనిపిస్తుంది. ఈ కారణంగా, మీ శత్రువు చేతికి మీరు దొరుకుతారని మీరు అందరికీ గుర్తు చేస్తారు! అపవిత్రుడా నీ శిక్షా దినం దగ్గర పడింది. ఇశ్రాయేలీయుల పాలకుడా, అపవిత్రం చేసే కాలం ముగింపుకు వచ్చిన వాడా, ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నీ తలపాగా, నీ కిరీటం తీసివేయి. సంగతులు ఇదివరకులాగా ఇకపై ఉండవు. ఇక తక్కువ వాళ్ళను గొప్ప వాళ్ళనుగానూ, గొప్ప వాళ్ళను తక్కువ వాళ్ళనుగానూ చెయ్యి. నేను అంతటినీ శిథిలం చేస్తాను! శిథిలం చేస్తాను! ఆ కిరీటం ఇంక ఉనికిలో ఉండదు. దానికి రాజుగా ఉండే అసలైన హక్కు ఉన్నవాడు వచ్చే వరకూ అది కనిపించదు. అప్పుడు నేను దాన్ని అతనికి ఇస్తాను.” నరపుత్రుడా నువ్వు ప్రవచించి ఇలా చెప్పు. “అమ్మోనీయులను గూర్చీ, వాళ్ళ అపకీర్తిని గూర్చీ ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఒక కత్తి! ఒక కత్తి దూసి ఉంది! పదును పెట్టిన కత్తి భారీగా వధ చెయ్యడానికి దూసి ఉంది, అది ఒక మెరుపులా ఉంది! శకునం చూసేవాళ్ళు నీ కోసం దొంగ దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు వ్యర్థమైన వాటిని నీకు చెప్తూ ఉన్నప్పుడు, ఈ కత్తి చావడానికి సిద్ధంగా ఉన్న ఆ దుష్టుల మెడల మీద ఉంటుంది. ఆ దుష్టుల శిక్షా దినం వచ్చింది. వాళ్ళు అతిక్రమం చేసే సమయం ముగిసింది. మళ్ళీ కత్తి ఒరలో పెట్టు. నువ్వు సృష్టి అయిన స్థలంలోనే, నువ్వు పుట్టిన దేశంలోనే నేను నీకు తీర్పు తీరుస్తాను! నా కోపం నీ మీద కుమ్మరిస్తాను. నా ఉగ్రతాగ్నిని నీ మీద రాజేస్తాను. నాశనం చెయ్యడంలో ప్రవీణులైన క్రూరులకు నిన్ను అప్పగిస్తాను.
యెహెజ్కేలు 21:1-31 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: “నరపుత్రుడా, యెరూషలేము వైపు చూసి, వారి పవిత్ర స్థలాలకు వ్యతిరేకంగా మాట్లాడు. నా తరపున ఇశ్రాయేలు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడు. ఇశ్రాయేలు రాజ్యానికిలా తెలియజేయి, ‘యెహోవా ఈ విషయాలు చెప్పాడు, నేను నీకు వ్యతిరేకంగా వున్నాను! ఒరలోనుండి నా కత్తిని దూస్తాను. నీనుండి ప్రజలందరినీ తొలగిస్తాను. వారిలో మంచివారు, చెడ్డవారు అంతా ఉంటారు! నీ మంచి మనుష్యులనూ, చెడ్డవారినీ నేను నాశనం చేస్తాను. ఒరనుండి నా కత్తిని దూస్తాను. దక్షిణాన్నుండి ఉత్తరం వరకు గల ప్రజలందరిపై దానిని ప్రయోగిస్తాను. అప్పుడు ప్రజలంతా నేనే యెహోవానని తెలుసుకొంటారు. పైగా నా కత్తిని ఒరనుండి దూశానని కూడా వారు తెలుసుకొంటారు. తన పని పూర్తి చేసే వరకు నా కత్తి మళ్లీ ఒరలోకి తిరిగి వెళ్లదు.’” దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, గుండె పగిలే దుఃఖంలో వున్న వ్యక్తిలా నీవు ప్రజల ముందే నిట్టూర్పులు విడువు. వారప్పుడు నిన్ను, ‘నీ వెందుకు నిట్టూరుస్తున్నావు?’ అని అడుగుతారు. దానికి నీవు ఇలా సమాదానం చెప్పాలి, ‘రాబోయే విషాద వార్తను తలచుకొని భయంతో ప్రతి హృదయం వికలమైపోతుంది. చేతులు బలహీనమవుతాయి. ప్రతి ప్రాణం నీరసించి పోతుంది. మోకాళ్ళు నీళ్లవలె మారిపోతాయి.’ చూడండి; ఆ చెడ్డవార్త రాబోతూ ఉంది. ఈ విషయాలన్నీ జరుగుతాయి!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో మాట్లాడు. ఈ విషయాలు తెలియజెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు: “‘చూడండి, ఒక కత్తి, పదునుగల కత్తి మెరుగుదిద్దిన కత్తి. చంపటానికి పదును పెట్టబడిన కత్తి. మెరుపులా మెరవటానికి అది మెరుగుదిద్దబడింది. నా కుమారా, నిన్ను శిక్షించటానికి నేను వాడే కర్రకు నీవు దూరంగా పారిపోయావు. ఆ కట్టెపుల్లతో శిక్షింపబడటానికి నీవు నిరాకరించావు. అందువల్ల కత్తి మెరుగు పెట్టబడింది. ఇప్పుడది వాడబడుతుంది. కత్తి పదును పెట్టబడి, మెరుగుదిద్దబడింది. అదిప్పుడు చంపేవాని చేతికి ఇవ్వబడుతుంది. “‘నరపుత్రుడా, కేకలు పెట్టి రోదించు! ఎందుకంటే ఆ కత్తి నా ప్రజల మీదికి, ఇశ్రాయేలు పాలకుల మీదికి తేబడింది! ఆ పాలకులు యుద్ధాన్ని కోరారు. అందువల్ల కత్తి ఎదురైనప్పుడు వారు నా ప్రజలతో పాటు వుంటారు! కావున నీ తొడ చరుచుకొని, నీ దుఃఖాన్ని వెలిబుచ్చే పెద్ద శబ్దాలు చేయుము! ఎందు వల్లనంటే, ఇది కేవలం పరీక్ష కాగాదు! నీవు కట్టెతో శిక్షింపబడటానికి నిరాకరించావు. కనుక నిన్ను శిక్షించటానికి మరి నేనేమి ఉపయోగించాలి? అవును. కత్తినే!’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నీవు చప్పట్లు చరిచి, నా తరపున ప్రజలతో మాట్లాడు. “కత్తిని రెండుసార్లు క్రిందికి రానీ, అవును, మూడుసార్లు! ఈ కత్తి ప్రజలను హతమార్చటానికే. మహా మారణానికి వినియోగించబడేది ఈ ఖడ్గమే! ఈ కత్తి వాళ్లను ఖండిస్తుంది. భయంతో వారి హృదయాలు కరుగుతాయి. చాలామంది పడిపోతారు. వారి నగర ద్వారం వద్దనే చంపబడతారు. అవును. ప్రజలను చంపటానికి ఆ ఖడ్గాన్ని నేనే ఎంపిక చేశాను! ఆ ఖడ్గం మెరుపుతీగలా ప్రకాశిస్తుంది. ఓ ఖడ్గమా, పదునుగా నుండుము, కుడి ప్రక్క నరుకు. ఎడమ ప్రక్క నరుకు. నీ అంచు ఎటు వెళ్లగోరితే అటు వెళ్లు! “అప్పుడు నేను కూడా చప్పట్లు చరుస్తాను. పిమ్మట నా కోపాన్ని చూపడం ఆపుతాను. యెహోవానైన నేను మాట్లాడాను!” యెహోవా మాట నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గం ఇశ్రాయేలుపై రావటానికి వినియోగపడే రెండు మార్గాలను గీయుము. రెండు మార్గాలూ ఒకే ప్రదేశం బబులోను నుండి మొదలవ్వాలి. నగరానికి వచ్చే ఒక మార్గం మొదట్లో ఒక గుర్తు పెట్టు. ఖడ్గం ఏ దారిని వినియోగిస్తుందో తెలుపటానికి ఆ గుర్తు పెట్టాలి. ఒక మార్గం అమ్మెనీయుల నగరమైన రబ్బాకు వెళ్తుంది. మరొక మార్గం యూదాలోని రక్షిత నగరమైన యెరూషలేముకు వెళ్తుంది! ఇది బబులోను రాజు ఆ ప్రాంతాన్ని తాను ఎలా ఎదుర్కోవాలన్నదానిని తెలుపుతుంది. బబులోను రాజు ఆ మార్గం రెండుగా విడిపోయే చోటికి వచ్చాడు. బబులోను రాజు తన భవిష్యత్తు కార్యక్రమం తెలుసుకొనటానికి మంత్ర, తంత్ర సంకేతాలను ఉపయోగించాడు. అతడు కొన్ని బాణాలు తీసుకొన్నాడు. తన కులదేవతలను కొన్ని ప్రశ్నలడిగాడు. పిమ్మట అతడు చంపిన ఒక జంతువు కార్జంవెపు చూశాడు. “అక్కడ అతను కొన్ని సంకేతాలు చూశాడు. అవి అతనిని తన కుడిప్రక్కనున్న యెరూషలేముకు పోయే మార్గంలో వెళ్లమని సూచించాయి! అతడు నగర ద్వారాలు పగులగొట్టే దూలాల యంత్రాలను తేవటానికి సిద్ధం కమ్మనే సంకేతం ఇవ్వాలనుకున్నాడు. అతడు ఆజ్ఞ ఇవ్వగానే అతని సైనికులు మారణకాండకు పూనుకుంటారు. యుద్ధ నినాదాలు చేయమని, నగరపు గోడకు మురికి వీధిని నిర్మించమని, మరియు కొయ్య బురుజులు నగరాన్ని ఎదుర్కోవడానికి నిర్మించమని సంకేతాలు యిస్తాడు. ఆ తంత్ర సంకేతాలు ఇశ్రాయేలు ప్రజలకు అర్థంకావు. వారు చేసిన వాగ్దానాలు వారికున్నాయి. అవి వారికి ముఖ్యం. కాని యెహోవా వారి పాపాలను జ్ఞాపకం పెట్టుకుంటాడు. దానితో ఇశ్రాయేలీయులు పట్టుబడతారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయం చెప్పాడు: “మీరు అనేక చెడు కార్యాలు చేశారు. మీ పాపాలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయి. మీరు నేరస్థులని గుర్తుపెట్టుకొనేలా మీరు నన్ను ఒత్తిడి చేశారు. కావున శత్రువు మిమ్మల్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఓ ఇశ్రాయేలు దుష్ట నాయకుడా, నీవు చంపబడతావు. నీకు శిక్ష కాలం సమీపించింది! నీ అంతం ఇక్కడే!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “నీ తలపాగా తీసివేయి! నీ కిరీటం తీసివేయి! మార్పుకు సమయం ఆసన్నమయ్యింది. ముఖ్య నాయకులు తగ్గింపబడతారు. సామాన్య మానవులు ప్రముఖ వ్యక్తులౌతారు. ఆ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను! కాని యోగ్యుడైన వ్యక్తి క్రొత్త రాజు అయ్యేవరకు ఇది సంభవించదు. అప్పుడు ఈ నగరాన్ని అతడు (బబులోను రాజు) కైవసం చేసుకొనేలా చేస్తాను.” దేవుడు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో మాట్లాడు. ఈ విషయాలు చెప్పు: ‘అమ్మోను ప్రజలకు, వారి సిగ్గుచేటు దేవతకు నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘చూడండి, ఒక ఖడ్గం! ఆ ఖడ్గం దాని ఒరనుండి బయటకు వచ్చింది. కత్తి మెరుగు దిద్దబడింది! కత్తి సంహారానికి సిద్ధంగా ఉంది. అది మెరుపు తీగలా ప్రకాశించటానికి మెరుగు దిద్దబడింది! “‘మీ దర్శనాలు పనికిరావు. మీ మంత్ర తంత్రాలు సహాయపడవు. అదంతా ఒక అబద్ధాల మూట. దుష్టుల మెడల మీద ఇప్పుడు కత్తి ఉంది. వారు త్వరలో శవాలై పోతారు. వారికి సమయం దాపురించింది. వారి చెడుతనం ముగిసే సమయం వచ్చింది. “‘ఇప్పుడు కత్తిని దాని ఒరలో పెట్టవచ్చు. నీవు సృష్టింపబడిన ప్రదేశంలో, నీవు జన్మమెత్తిన రాజ్యంలో నీకు నేను న్యాయనిర్ణయం చేస్తాను. నీ మీద నా కోపాన్ని క్రుమ్మరిస్తాను. వేడి గాడ్పువలె నా కోపం నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను దుష్టులయిన మగవారికి అప్పగిస్తాను. వారు ప్రజల్ని హత మార్చటంలో ఆరితేరిన వారు.
యెహెజ్కేలు 21:1-31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై . యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, యెరూషలేముతట్టు నీ ముఖము త్రిప్పుకొని, పరిశుద్ధస్థలములనుబట్టి ఇశ్రాయేలీయులదేశమునుగూర్చి ప్రవచించి ఇట్లనుము –యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను నీకు విరోధినై తిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము ఒరదూసి యున్నాను. నీతిపరులేమి దుష్టులేమి యెవరును మీలో ఉండకుండ దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలోనుండి బయలుదేరియున్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరల ఒరలోపడకుండ దాని దూసియున్నానని జనులందరు తెలిసికొందురు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. –నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా నీవు –శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడి నది, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్లు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది; అది వచ్చేయున్నది అని చెప్పుము; ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటనచేసి ఇట్లనుము–యెహోవా సెలవిచ్చున దేమనగా–అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది, అది పదునుగలదై మెరుగుపెట్టియున్నది. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్ద నుంచబడియుండెను, హతము చేయువాడు పట్టుకొనునట్లుగా అది పదునుగలదై మెరుగు పెట్టబడియున్నది. –నరపుత్రుడా అంగలార్చుము, కేకలువేయుము, అది నా జనులమీదికిని ఇశ్రాయేలీయుల ప్రధానులమీదికిని వచ్చుచున్నది, ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము. శోధనకలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతముచేయునదై యున్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది. వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును, వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను; అయ్యయ్యో అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడియున్నది. ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికి తిరుగుము నేను కూడ నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును; యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గమువచ్చుటకు రెండు మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశములోనుండి వచ్చునట్లు సూచించుటకై యొక హస్తరూపము గీయుము, పట్టణపు వీధి కొనను దాని గీయుము. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమం దున్న ప్రాకారములుగల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము. బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలిసికొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు; అతడు బాణములను ఇటు అటు ఆడించుచు, విగ్రహములచేత విచారణచేయుచు, కార్యమునుబట్టి శకునము చూచుచున్నాడు. –యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టుయంత్రములు పెట్టుమనియు, హతముచేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టుయంత్రములు ఉంచుమనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టు మనియు యెరూషలేమునుగూర్చి తన కుడితట్టున శకునము కనబడెను. ప్రమాణములు చేసికొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును; అయితే వారు పట్టబడునట్లువారు చేసికొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును. కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీ అతిక్రమములు బయలుపడుటవలన మీ సమస్త క్రియలలోనుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకొనినందునను, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినందునను మీరు చేత చిక్కియున్నారు. గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతీ, దోషసమాప్తికాలమున నీకు తీర్పువచ్చియున్నది. ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము. నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడ ద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము –అమ్మోనీయులనుగూర్చియు, వారుచేయు నిందనుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా– హతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దూయబడియున్నది, తళతళలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధచేయుటకు దూయబడియున్నది. శకునగాండ్రు నీకొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోషసమాప్తి కాలమున శిక్షనొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడ వేయును. ఖడ్గమును ఒరలోవేయుము; నీవు సృష్టింప బడిన స్థలములోనే నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును. అచ్చటనే నా రౌద్రమును నీమీద కుమ్మరించెదను, నా ఉగ్రతాగ్నిని నీమీద రగుల బెట్టెదను, నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను.