యెహెజ్కేలు 18:30-32
యెహెజ్కేలు 18:30-32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ఇశ్రాయేలు ప్రజలారా! ఎవరి ప్రవర్తనను బట్టి వారిని నేను శిక్షిస్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. పశ్చాత్తాపపడి మీ అక్రమాల కారణంగా మీరు శిక్షించబడకుండా వాటిని విడిచిపెట్టండి. గతంలో మీరు చేసిన నేరాలన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయాన్ని నూతన ఆత్మను పొందండి. ఇశ్రాయేలీయులారా! మీరెందుకు మరణాన్ని పొందాలి? మరణించిన వానిని బట్టి నేను సంతోషించను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. పశ్చాత్తాపపడి జీవించండి!
యెహెజ్కేలు 18:30-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్లకు శిక్ష వేస్తాను. మనస్సు తిప్పుకుని మీ అతిక్రమాలు మీ శిక్షకు కారణం కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టండి. మీరు చేసిన అతిక్రమాలన్నీ మీ మీద నుంచి విసిరేసి మీరు మీ కోసం ఒక కొత్త హృదయం, ఒక కొత్త మనస్సు నిర్మించుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చావాలి? నశించేవాడి చావు కారణంగా నేను ఆనందించేవాణ్ణి కాదు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. “కాబట్టి మీరు మనస్సు మార్చుకుని బ్రతకండి.”
యెహెజ్కేలు 18:30-32 పవిత్ర బైబిల్ (TERV)
ఓ ఇశ్రాయేలు వంశమా, ఎందువల్లనంటే, నేను ప్రతి వ్యక్తికీ అతను చేసిన కార్యాలను అనుసరించి న్యాయనిర్ణయం చేస్తాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “కావున, మీరు నా వద్దకు తిరిగిరండి. చెడుకార్యాలు చేయటం మానండి! ఆ ఘోరమైన వస్తువులు మీరు పాపం చేయటానికి కారణం కానీయకండి! మీరు చేసిన భయంకర వస్తువులన్నీ పారవేయండి. అవన్నీ కేవలం మీరు పాపం చేయటానికే దోహదం చేస్తాయి! మీ హృదయాలను, ఆత్మలను మార్చుకోండి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని మీరెందుకు చనిపోయేలాగు చేసుకొంటున్నారు? నేను మిమ్మల్ని చంపకోరటం లేదు! దయచేసి నా వద్దకు తిరిగి రండి. జీవించండి!” ఆ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.
యెహెజ్కేలు 18:30-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.