నిర్గమకాండము 9:1-9
నిర్గమకాండము 9:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు ఫరో దగ్గరకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నా ప్రజలు నన్ను సేవించేలా, వారిని వెళ్లనివ్వు.” నీవు వారిని వెళ్లనివ్వకుండా వారిని ఇంకా నిర్బంధించి ఉంచితే, యెహోవా హస్తం పొలంలో ఉన్న నీ పశువుల మీదికి అంటే గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు మేకల మీదకు భయానకమైన వ్యాధిని తెస్తుంది. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులకు ఈజిప్టువారి పశువులకు మధ్య భేదాన్ని చూపిస్తారు. ఇశ్రాయేలీయుల పశువుల్లో ఏ ఒక్కటి చనిపోదు’ అని చెప్పు” అన్నారు. యెహోవా సమయాన్ని నిర్ణయించి, “రేపు యెహోవా దీనిని ఈ దేశంలో జరిగిస్తారు” అన్నారు. మరునాడు యెహోవా దానిని జరిగించారు: ఈజిప్టువారి పశువులన్నీ చనిపోయాయి కాని, ఇశ్రాయేలీయులకు చెందిన పశువుల్లో ఒకటి కూడా చావలేదు. ఫరో దాని గురించి విచారణకు పంపగా ఇశ్రాయేలీయులకు చెందిన పశువుల్లో ఒకటి కూడా చావలేదని తెలిసింది. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా ఉంది కాబట్టి అతడు ప్రజలను వెళ్లనివ్వలేదు. అయితే యెహోవా మోషే అహరోనులతో, “కొలిమి నుండి చేతి పిడికిలి నిండ బూడిద తీసుకుని, ఫరో ఎదుట మోషే దానిని గాలిలో చల్లాలి. అది సన్నని ధూళిగా మారి ఈజిప్టు దేశమంతా వ్యాపించి, దేశంలోని మనుష్యుల మీద జంతువుల మీద చీముపట్టిన కురుపులు పుడతాయి” అన్నారు.
నిర్గమకాండము 9:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు, దేవుడు యెహోవా ఇలా చెప్పమన్నాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.’ నువ్వు గనక వాళ్ళను వెళ్ళనివ్వకుండా ఇంకా నిర్బంధంలో ఉంచినట్టయితే, యెహోవా చెయ్యి చాపి ఎంతో బాధ కలిగించే తెగులు పంపిస్తాడు. ఆ తెగులు నీ పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు పాకుతుంది. అయితే యెహోవా ఇశ్రాయేలు ప్రజల పశువులను ఐగుప్తు పశువులను వేరు చేస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన వాటిలో ఒక్కటి కూడా చనిపోదని హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నాడు. దేశంలో రేపు నిర్ణీత సమయానికి యెహోవా ఈ కార్యం జరిగిస్తాడు” అని చెప్పాడు. తరువాతి రోజున యెహోవా తెగులు పంపించినప్పుడు ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చావలేదు. ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదనే విషయం ఫరో నిర్ధారణ చేసుకున్నాడు. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవడం వల్ల ప్రజలను పంపడానికి అంగీకరించలేదు. అప్పుడు యెహోవా “మీరు మీ పిడికిళ్ల నిండా బూడిద తీసుకోండి. మోషే ఫరో చూస్తూ ఉండగా దాన్ని ఆకాశం వైపు చల్లండి. అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నని దుమ్ములాగా మారి దేశంలోని మనుష్యుల మీదా, జంతువుల మీదా చీము పట్టే కురుపులు కలగజేస్తుంది” అని మోషే అహరోనులతో చెప్పాడు.
నిర్గమకాండము 9:1-9 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “నన్ను ఆరాధించేందుకు నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల ‘దేవుడైన యెహోవా అంటున్నాడని ఫరో దగ్గరికి వెళ్లి అతనితో చెప్పు.’ ఇంకా నీవు వారిని పోనివ్వక ఆపి ఉంచితే పొలాల్లోని నీ జంతువులు అన్నింటి మీద యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడు. నీ గుర్రాలు, నీ గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు అన్నింటికీ భయంకర రోగం వచ్చేటట్టు యెహోవా చేస్తాడు. ఈజిప్టు జంతుజాలంకంటె ఇశ్రాయేలీయుల జంతువుల్ని యెహోవా ప్రత్యేకంగా చూస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన జంతువుల్లో ఏదీ చావదు ఇదంతా జరగటానికి యెహోవా సమయాన్ని నిర్ణయించాడు. రేపు ఈ దేశంలో ఇది జరిగేటట్టు యెహోవా చేస్తాడు.” మర్నాడు ఉదయాన్నే ఈజిప్టు పొలాల్లోని జంతువులన్నీ చచ్చాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు చెందిన జంతువుల్లో ఒక్కటికూడా చావలేదు. ఇశ్రాయేలీయుల జంతువులు ఏవైనా చచ్చాయేమో చూడమని ఫరో మనుష్యుల్ని పంపాడు. ఇశ్రాయేలీయుల జంతువుల్లో ఒక్కటి కూడ చావలేదు. ఫరో మాత్రం మొండిగానే ఉండిపోయాడు. అతడు ప్రజల్ని వెళ్లనివ్వలేదు. మోషే, అహరోనులకు యెహోవా ఇలా చెప్పాడు, “మీ చేతుల నిండా కొలిమిలోని బూడిదను తీసుకోండి. మోషే, ఫరో ముందర గాలిలో ఈ బూడిదను వెదజల్లాలి. ఇది దుమ్ముగా మారి ఈజిప్టు దేశం అంతటా వ్యాపిస్తుంది. ఈజిప్టులో ఎప్పుడెప్పుడు ఏ వ్యక్తిని లేక జంతువును ఈ దుమ్ము తాకుతుందో ఆ చర్మంమీద దద్దుర్లు పుడతాయి.”
నిర్గమకాండము 9:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఫరోయొద్దకు వెళ్లి–నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనియ్యనొల్లక ఇంకను వారిని నిర్బంధించినయెడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దులమీదికిని గొఱ్ఱెలమీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పు మనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి–రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యముచేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెనుగాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు. ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావ లేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను. కాగా యెహోవా–మీరు మీ పిడికిళ్లనిండ ఆవపు బుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నులయెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశ మంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యులమీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురు లగునని మోషే అహరోనులతో చెప్పెను.