నిర్గమకాండము 9:1-35

నిర్గమకాండము 9:1-35 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు ఫరో దగ్గరకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నా ప్రజలు నన్ను సేవించేలా, వారిని వెళ్లనివ్వు.” నీవు వారిని వెళ్లనివ్వకుండా వారిని ఇంకా నిర్బంధించి ఉంచితే, యెహోవా హస్తం పొలంలో ఉన్న నీ పశువుల మీదికి అంటే గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు మేకల మీదకు భయానకమైన వ్యాధిని తెస్తుంది. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులకు ఈజిప్టువారి పశువులకు మధ్య భేదాన్ని చూపిస్తారు. ఇశ్రాయేలీయుల పశువుల్లో ఏ ఒక్కటి చనిపోదు’ అని చెప్పు” అన్నారు. యెహోవా సమయాన్ని నిర్ణయించి, “రేపు యెహోవా దీనిని ఈ దేశంలో జరిగిస్తారు” అన్నారు. మరునాడు యెహోవా దానిని జరిగించారు: ఈజిప్టువారి పశువులన్నీ చనిపోయాయి కాని, ఇశ్రాయేలీయులకు చెందిన పశువుల్లో ఒకటి కూడా చావలేదు. ఫరో దాని గురించి విచారణకు పంపగా ఇశ్రాయేలీయులకు చెందిన పశువుల్లో ఒకటి కూడా చావలేదని తెలిసింది. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా ఉంది కాబట్టి అతడు ప్రజలను వెళ్లనివ్వలేదు. అయితే యెహోవా మోషే అహరోనులతో, “కొలిమి నుండి చేతి పిడికిలి నిండ బూడిద తీసుకుని, ఫరో ఎదుట మోషే దానిని గాలిలో చల్లాలి. అది సన్నని ధూళిగా మారి ఈజిప్టు దేశమంతా వ్యాపించి, దేశంలోని మనుష్యుల మీద జంతువుల మీద చీముపట్టిన కురుపులు పుడతాయి” అన్నారు. కాబట్టి వారు కొలిమిలోని బూడిద తీసుకుని ఫరో ఎదుట నిలబడ్డారు. మోషే దానిని గాలిలో చల్లినప్పుడు మనుష్యుల మీద జంతువుల మీద చీముపట్టిన కురుపులు పుట్టాయి. ఈజిప్టు వారందరి మీద, తమ మీద ఆ కురుపులు ఉండడం వల్ల మంత్రగాళ్ళు మోషే ఎదుట నిలబడలేకపోయారు. అయితే యెహోవా మోషేకు చెప్పినట్లే, మోషే అహరోనుల మాట వినకుండ యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచారు. అప్పుడు యెహోవా మోషేతో, “నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుటకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నన్ను సేవించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు. లేకపోతే భూమి అంతటి మీద నా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకునేలా ఈసారి నేను నీ అధికారుల పైకి నీ ప్రజలమీదికి నా తెగుళ్ళ యొక్క పూర్తి శక్తిని పంపుతాను. ఈపాటికి నేను నా చేయిని చాచి, నిన్ను నీ ప్రజలను తెగులుతో మొత్తగలిగేవాన్ని, అది మిమ్మల్ని భూమి నుండి తుడిచిపెట్టేది. కాని నేను నా బలాన్ని నీకు చూపించాలని భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను లేవనెత్తాను. నీవింకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటూ వారిని వెళ్లనివ్వడం లేదు. కాబట్టి రేపు ఈ సమయానికి నేను ఈజిప్టు ఏర్పడిన రోజు నుండి ఇప్పటివరకు ఎన్నడు పడని భయంకరమైన వడగండ్ల తుఫాను పంపుతాను. కాబట్టి ఇప్పుడే నీ పశువులను నీ పొలంలో ఉన్న సమస్తాన్ని సురక్షితమైన చోటుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించు, ఎందుకంటే ఇంటికి రప్పింపబడక పొలంలోనే ఉన్న ప్రతి మనిషి మీద జంతువుల మీద వడగండ్లు పడతాయి, అప్పుడు మనుష్యులు చనిపోతారు, జంతువులు చనిపోతాయి’ అని చెప్పు” అన్నారు. ఫరో సేవకులలో యెహోవా మాట విని భయపడినవారు తమ బానిసలను తమ పశువులను తమ ఇళ్ళకు త్వరపడి రప్పించారు. అయితే యెహోవా మాటను లక్ష్యపెట్టనివారు తమ బానిసలను తమ పశువులను పొలంలోనే విడిచిపెట్టారు. అప్పుడు యెహోవా మోషేతో, “నీ చేయి ఆకాశం వైపు చాపు అప్పుడు ఈజిప్టు అంతా మనుష్యుల మీద జంతువుల మీద ఈజిప్టు పొలాల్లో పెరిగే ప్రతి దాని మీద వడగండ్లు పడతాయి” అని చెప్పారు. మోషే తన కర్రను ఆకాశం వైపు చాచినప్పుడు, యెహోవా ఉరుములను వడగండ్లను పంపినప్పుడు మెరుపులు వేగంగా నేలను తాకాయి. ఈజిప్టు దేశమంతటా యెహోవా వడగండ్లు కురిపించారు. వడగండ్లు పడ్డాయి, మెరుపులు ఇటు అటు మెరిసాయి. ఈజిప్టు దేశమంతా ఒక దేశంగా ఏర్పడిన తర్వాత ఇది అత్యంత భయంకరమైన తుఫాను. ఆ వడగండ్లు ఈజిప్టు దేశమంతటా, పొలాల్లో ఉన్న మనుష్యులను జంతువులను నాశనం చేశాయి; పొలాల్లో పెరుగుతున్నవన్నీ పాడయ్యాయి, ప్రతి చెట్టు విరిగిపోయింది. అయితే ఇశ్రాయేలీయులు ఉన్న గోషేను దేశంలో మాత్రమే వడగండ్లు పడలేదు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, “ఈసారి నేను పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా ప్రజలు దోషులము. యెహోవాకు ప్రార్థించండి, ఎందుకంటే ఇంతవరకు పడిన ఉరుములు వడగండ్లు చాలు. నేను మిమ్మల్ని వెళ్లనిస్తాను; మీరు ఇక ఇక్కడ ఉండనవసరం లేదు” అని అన్నాడు. అందుకు మోషే, “నేను పట్టణంలో నుండి బయటకు వెళ్లగానే, నా చేతులు చాపి యెహోవాకు ప్రార్థిస్తాను. అప్పుడు ఉరుములు ఆగిపోతాయి, ఇక వడగండ్లు ఉండవు, కాబట్టి భూమి యెహోవాదే అని నీవు తెలుసుకుంటావు. అయినప్పటికీ నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు” అన్నాడు. అప్పుడు యవలు వెన్నులు వేశాయి అవిసె పూలు పూసాయి కాబట్టి అవి నాశనం చేయబడ్డాయి. గోధుమలు, మరో రకం గోధుమలు ఇంకా ఎదగలేదు, అవి తర్వాత ఎదుగుతాయి కాబట్టి అవి నాశనం చేయబడలేదు. అప్పుడు మోషే ఫరో దగ్గరనుండి బయలుదేరి పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు చేతులు చాపినప్పుడు ఉరుములు వడగండ్లు ఆగిపోయాయి. నేలపై వర్షం కురవడం ఆగిపోయింది. వర్షం వడగండ్లు ఉరుములు ఆగిపోవడం ఫరో చూసినప్పుడు, అతడు మరలా పాపం చేశాడు: అతడు అతని అధికారులు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. యెహోవా మోషే ద్వారా చెప్పినట్లే ఫరో హృదయం కఠినపరచబడింది; అతడు ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వలేదు.

నిర్గమకాండము 9:1-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు, దేవుడు యెహోవా ఇలా చెప్పమన్నాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.’ నువ్వు గనక వాళ్ళను వెళ్ళనివ్వకుండా ఇంకా నిర్బంధంలో ఉంచినట్టయితే, యెహోవా చెయ్యి చాపి ఎంతో బాధ కలిగించే తెగులు పంపిస్తాడు. ఆ తెగులు నీ పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు పాకుతుంది. అయితే యెహోవా ఇశ్రాయేలు ప్రజల పశువులను ఐగుప్తు పశువులను వేరు చేస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన వాటిలో ఒక్కటి కూడా చనిపోదని హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నాడు. దేశంలో రేపు నిర్ణీత సమయానికి యెహోవా ఈ కార్యం జరిగిస్తాడు” అని చెప్పాడు. తరువాతి రోజున యెహోవా తెగులు పంపించినప్పుడు ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చావలేదు. ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదనే విషయం ఫరో నిర్ధారణ చేసుకున్నాడు. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవడం వల్ల ప్రజలను పంపడానికి అంగీకరించలేదు. అప్పుడు యెహోవా “మీరు మీ పిడికిళ్ల నిండా బూడిద తీసుకోండి. మోషే ఫరో చూస్తూ ఉండగా దాన్ని ఆకాశం వైపు చల్లండి. అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నని దుమ్ములాగా మారి దేశంలోని మనుష్యుల మీదా, జంతువుల మీదా చీము పట్టే కురుపులు కలగజేస్తుంది” అని మోషే అహరోనులతో చెప్పాడు. మోషే అహరోనులు బూడిద తీసుకుని ఫరో దగ్గర నిలబడ్డారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లాడు. దానివల్ల మనుష్యులకు, జంతువులకు చీము కురుపులు పుట్టాయి. ఆ కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు. ఆ కురుపులు మాంత్రికులకు, ఐగుప్తీయులందరికీ పుట్టాయి. అయినప్పటికీ యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వాళ్ళ మాట వినలేదు. తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఉదయం కాగానే లేచి ఫరో ఎదుటికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, యెహోవా ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు. భూమి అంతటిలో నాలాంటివాడు ఎవరూ లేరని నీవు తెలుసుకోవాలని నీ హృదయం తీవ్రంగా కలత చెందేలా ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ సేవకుల పైకి, నీ దేశ ప్రజల పైకి పంపుతాను. ఇంతకు ముందే నేను నా చెయ్యి చాపి నిన్నూ నీ ప్రజలనూ విపత్తుతో కొట్టి భూమి మీద లేకుండా నాశనం చేసి ఉండేవాణ్ణి. నిన్ను బతికి ఉంచిన కారణం నా సామర్ధ్యం నీకు చూపడానికే. తద్వారా భూలోకమంతటా నా పేరు ప్రఖ్యాతి పొందాలి. నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్ళపై మిడిసిపడుతున్నావు. ఇదిగో విను, రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలు ఇప్పటి వరకూ అలాంటి వడగళ్ళు కురియలేదు. అందువల్ల నువ్వు నీ పశువులను, పొలాల్లో ఉన్న నీ పంటలనూ త్వరగా భద్రం చేయించుకో. ఇంటికి చేరకుండా పొలంలో ఉన్న ప్రతి వ్యక్తీ ప్రతి జంతువూ వడగళ్ళ బారిన పడి చనిపోతారు.” యెహోవా మోషే చేత పలికించిన మాటలు విన్న ఫరో సేవకుల్లో కొందరు తమ పశువులను ఇళ్లలోకి తెప్పించుకున్నారు. యెహోవా మాట లక్ష్యపెట్టనివారు తమ పనివాళ్ళను, పశువులను పొలంలోనే ఉండనిచ్చారు. యెహోవా “నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీదా, జంతువుల మీదా పంటలన్నిటి మీదా వడగళ్లు కురుస్తాయి” అని మోషేతో చెప్పాడు. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగళ్ళు కురిపించాడు. ఆ విధంగా వడగళ్ళు, వడగళ్ళతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించ లేదు. ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వడగళ్ళు మనుష్యులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్నీ నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంట అంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు. ఇది చూసిన ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “ఈసారి నేను తప్పు చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నా ప్రజలూ దుర్మార్గులం. ఇంతవరకూ జరిగింది చాలు. ఈ భయంకరమైన ఉరుములు, వడగళ్ళు ఇంకా రాకుండా యెహోవాను వేడుకోండి. ఇక నేను మిమ్మల్ని ఆపను, మీరు కోరిన చోటికి వెళ్ళనిస్తాను” అని వాళ్ళతో చెప్పాడు. మోషే అతనితో “నేను ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళి నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను. ఈ ఉరుములు ఆగిపోతాయి, వడగళ్ళు ఇకపై కురియవు. దీన్నిబట్టి ఈ లోకమంతా యెహోవాదేనని నువ్వు తెలుసుకొంటావు. అయినప్పటికీ నీకూ, నీ సేవకులకూ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు” అన్నాడు. ఆ రోజుల్లో జనపనార చెట్లు మొగ్గ తొడిగాయి. బార్లీ చేలు వెన్నులు వేశాయి కనుక అవన్నీ నాశనం అయ్యాయి. గోదుమలు, మిరప మొక్కలు మొలకలు వేయనందువల్ల అవి పాడవలేదు. మోషే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది. ఉరుములు, వడగళ్ళు నిలిచిపోయాయి. అయితే వర్షం, వడగళ్ళు, ఉరుములు ఆగిపోవడం చూసిన ఫరో, అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. యెహోవా మోషేకు చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారింది, అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.

నిర్గమకాండము 9:1-35 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “నన్ను ఆరాధించేందుకు నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల ‘దేవుడైన యెహోవా అంటున్నాడని ఫరో దగ్గరికి వెళ్లి అతనితో చెప్పు.’ ఇంకా నీవు వారిని పోనివ్వక ఆపి ఉంచితే పొలాల్లోని నీ జంతువులు అన్నింటి మీద యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడు. నీ గుర్రాలు, నీ గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు అన్నింటికీ భయంకర రోగం వచ్చేటట్టు యెహోవా చేస్తాడు. ఈజిప్టు జంతుజాలంకంటె ఇశ్రాయేలీయుల జంతువుల్ని యెహోవా ప్రత్యేకంగా చూస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన జంతువుల్లో ఏదీ చావదు ఇదంతా జరగటానికి యెహోవా సమయాన్ని నిర్ణయించాడు. రేపు ఈ దేశంలో ఇది జరిగేటట్టు యెహోవా చేస్తాడు.” మర్నాడు ఉదయాన్నే ఈజిప్టు పొలాల్లోని జంతువులన్నీ చచ్చాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు చెందిన జంతువుల్లో ఒక్కటికూడా చావలేదు. ఇశ్రాయేలీయుల జంతువులు ఏవైనా చచ్చాయేమో చూడమని ఫరో మనుష్యుల్ని పంపాడు. ఇశ్రాయేలీయుల జంతువుల్లో ఒక్కటి కూడ చావలేదు. ఫరో మాత్రం మొండిగానే ఉండిపోయాడు. అతడు ప్రజల్ని వెళ్లనివ్వలేదు. మోషే, అహరోనులకు యెహోవా ఇలా చెప్పాడు, “మీ చేతుల నిండా కొలిమిలోని బూడిదను తీసుకోండి. మోషే, ఫరో ముందర గాలిలో ఈ బూడిదను వెదజల్లాలి. ఇది దుమ్ముగా మారి ఈజిప్టు దేశం అంతటా వ్యాపిస్తుంది. ఈజిప్టులో ఎప్పుడెప్పుడు ఏ వ్యక్తిని లేక జంతువును ఈ దుమ్ము తాకుతుందో ఆ చర్మంమీద దద్దుర్లు పుడతాయి.” మోషే, అహరోనులు కొలిమి నుండి బూడిద తీసుకొన్నారు. తర్వాత వెళ్లి ఫరో ఎదుట నిలబడ్డారు. ఆ బూడిదను వారు గాలిలో వెదజల్లారు, మనుష్యుల మీద, జంతువుల మీద దద్దుర్లు పుట్టడం మొదలయింది. చివరికి మాంత్రికులకు కూడా ఆ దద్దుర్లు వచ్చినందువల్ల మోషే ఇలా చేయకుండా మాంత్రికులు కూడా ఆపలేక పోయారు. ఈజిప్టు అంతటా ఇది జరిగింది. అయితే యెహోవా ఫరోను మొండి వాడిగా చేసాడు. అందుచేత మోషే, అహరోనుల మాట వినేందుకు ఫరో ఒప్పుకోలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది. అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఉదయాన్నే లేచి, ఫరో దగ్గరికి వెళ్లు. ‘నన్ను ఆరాధించడానికి, నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల దేవుడైన, యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు. నీవు గనుక ఇలా చెయ్యకపోతే, అప్పుడు నీ మీద, నీ ప్రజలమీద, నీ అధికారుల మీద నా శక్తి అంతా ప్రయోగిస్తాను. అప్పుడు నాలాంటి దేవుడు ప్రపంచంలోనే లేడని నీకు తెలుస్తుంది. నేను నా శక్తిని ప్రయోగించి, ఒక్క రోగం రప్పించానంటే, అది నిన్ను, నీ ప్రజల్ని భూమి మీద లేకుండా తుడిచి పారేస్తుంది. అయితే ఒక కారణం వల్ల నేను నిన్ను ఇక్కడ ఉంచాను. నా శక్తిని నీవు చూడాలని నిన్ను ఇక్కడ ఉంచాను. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నా విషయం తెల్సుకొంటారు. నీవు ఇంకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నావు. నీవు వాళ్లను స్వతంత్రంగా వెళ్లనివ్వడంలేదు. కనుక రేపు ఈ వేళకు మహా బాధాకరమైన వడగళ్ల వానను నేను కురిపిస్తాను. ఇంతకు ముందు ఎన్నడూ ఈజిప్టు ఒక దేశంగా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకూ ఇలాంటి వడగళ్ల వాన పడలేదు. ఇక నీవు నీ జంతువుల్ని క్షేమంగా ఉండేచోట పెట్టుకోవాలి. ప్రస్తుతం పొలాల్లో ఉన్న నీ స్వంతదైన ప్రతిదాన్నీ భద్రమైన చోట నీవు ఉంచుకోవాలి. ఎందుచేతనంటే పొలాల్లో నిలబడి ఉండే మనిషిగాని జంతువుగాని చచ్చినట్లే. ఇంట్లో చేర్చబడకుండా ఉండే ప్రతి దానిపైనా వడగళ్లు కురుస్తాయి.’” ఫరో అధికారులలో కొందరు యెహోవా మాటను గమనించారు. వాళ్లు వెంటనే వారి పశువులన్నిటినీ, బానిసలందరినీ ఇండ్లలో చేర్చారు. కాని మిగతా వాళ్లు యెహోవా సందేశాన్ని లెక్క చేయలేదు. అలాంటి వారు పొలాల్లో ఉన్న తమ బానిసలందరిని, జంతువులన్నింటిని అక్కడే ఉండ నిచ్చారు. నీ చేతులు గాలిలో పైకి ఎత్తు, “ఈజిప్టు అంతటా వడగళ్ల వాన ప్రారంభం అవుతుంది. ఈజిప్టు పొలాల్లో ఉన్న మొక్కలన్నిటి మీద, జంతువుల మీద, మనుష్యులందరి మీద వడగళ్లు పడతాయి” అని మోషేతో యెహోవా చెప్పాడు. కనుక మోషే తన కర్రను పైకి ఎత్తాడు, ఉరుములు, మెరుపులు వచ్చేటట్టు, భూమి మీద వడగళ్లు కురిసేటట్టు యెహోవా చేసాడు. ఈజిప్టు అంతటా వడగళ్లు పడ్డాయి. వడగళ్లు పడుతోంటే, ఆ వడగళ్లతో పాటు మెరుపులు మెరిసాయి. ఈజిప్టు ఒక రాజ్యంగా ఏర్పడినప్పటి నుండి, ఈజిప్టును ఇంత దారుణంగా దెబ్బతీసిన వడగళ్ల వాన ఇదే. ఈజిప్టు పొలాల్లో ఉన్న సర్వాన్నీ ఈ వడగళ్ల వాన నాశనం చేసింది. మనుష్యుల్ని, జంతువుల్ని, మొక్కల్ని వడగళ్లు నాశనం చేసాయి. వడగళ్ల మూలంగా పొలాల్లోని చెట్లన్నీ విరిగి పోయాయి. ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషేను ఒక్కటే వడగళ్లు పడని ఒకే ఒక చోటు. మోషే అహరోనులను ఫరో పిలిపించాడు. ఫరో వారితో, “ఈ సారి నేను పాపం చేసాను. యెహోవా న్యాయమంతుడు. తప్పు నాది, నా ప్రజలది. వడగళ్లు, ఉరుములు మరీ భయంకరంగా ఉన్నాయి! వాటిని ఆపేయమని దేవుణ్ణి అడుగు. నేను మిమ్మల్ని వెళ్లిపోనిస్తాను. మీరు ఇక్కడ ఉండనక్కర్లేదు.” అని చెప్పాడు. మోషే ఫరోతో చెప్పాడు: “నేను ఈ పట్టణంనుండి యెహోవా ఎదుట నా చేతులు చాచి ప్రార్థిస్తాను. ఉరుములు, వడగళ్లు ఆగిపోతాయి. ఈ భూమిమీద యెహోవా ఉన్నాడని మీరు అప్పుడు తెలుసుకొంటారు. అయినా నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు.” అప్పుడే జనుము గింజ పట్టింది. యవలు అప్పుడే పూత పట్టాయి. అయిననూ ఈ మొక్కలు నాశనం అయ్యాయి. అయితే గోధుమలు, మిరప ఇతర ధాన్యాలకంటె ఆలస్యంగా పక్వానికి వస్తాయి. అందుచేత ఈ మొక్కలు నాశనం కాలేదు. మోషే ఫరోను విడిచి పట్టణం బయటికి వెళ్లాడు. యెహోవా యెదుట అతడు తన చేతులు చాచాడు. ఉరుములు, వడగళ్లు ఆగిపోయాయి. నేలమీద వర్షం కురవడం కూడ ఆగిపోయింది. ఎప్పుడయితే వర్షం, వడగళ్లు, ఉరుములు ఆగిపోవడం ఫరో చూశాడో, అప్పుడు అతను మళ్లీ తప్పు చేసాడు. అతను అతని అధికారులు మళ్లీ మొండికెత్తారు. ఇశ్రాయేలు ప్రజల్ని స్వేచ్ఛగా వెళ్లనిచ్చేందుకు నిరాకరించాడు ఫరో. యెహోవా మోషే ద్వారా చెప్పినట్లే ఇది జరిగింది.

నిర్గమకాండము 9:1-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఫరోయొద్దకు వెళ్లి–నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనియ్యనొల్లక ఇంకను వారిని నిర్బంధించినయెడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దులమీదికిని గొఱ్ఱెలమీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పు మనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి–రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యముచేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెనుగాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు. ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావ లేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను. కాగా యెహోవా–మీరు మీ పిడికిళ్లనిండ ఆవపు బుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నులయెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశ మంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యులమీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురు లగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను. ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువలేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికిని పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–హెబ్రీ యులదేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచి–నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నావంటివారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్లన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను; భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును. నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను; ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగి నది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములోఉండు ప్రతిమనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా–నీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తుదేశ మంతట పడునని మోషేతో చెప్పెను. మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను. ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి–నేను ఈసారి పాపముచేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము; ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా మోషే అతని చూచి–నేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను. అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెనుగాని గోధుమలు మిరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలు వెళ్లి యెహోవావైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ యురుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమిమీద కురియుట మానెను. అయితే ఫరో వర్షమును వడ గండ్లును ఉరుములును నిలిచిపోవుట చూచి, అతడును అతని సేవకులును ఇంక పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనిరి. యెహోవా మోషేద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యక పోయెను.