నిర్గమకాండము 3:7-10
నిర్గమకాండము 3:7-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు. కాబట్టి ఈజిప్టువారి చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్లడానికి నేను దిగి వచ్చాను. ఇశ్రాయేలీయుల మొర నాకు చేరింది, ఈజిప్టువారు వారినెలా అణచివేస్తున్నారో నేను చూశాను. కాబట్టి ఇప్పుడు, వెళ్లు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు బయటకు తీసుకురావడానికి నేను నిన్ను ఫరో దగ్గరకు పంపుతున్నాను” అని అన్నారు.
నిర్గమకాండము 3:7-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు. కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను. నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.”
నిర్గమకాండము 3:7-10 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా “ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్లు నా ప్రజల్ని బాధపెట్టినప్పుడు వారు మొర పెట్టడం నేను విన్నాను. వారి బాధ నాకు తెలుసు ఈజిప్టు వాళ్ల బారినుండి నా ప్రజల్ని రక్షించేందుకు ఇక నేను దిగి వస్తాను. ఆ దేశం నుండి వాళ్లను బయటకు తెచ్చి, మరో మంచి దేశానికి నడిపిస్తాను. అక్కడ వాళ్లు ఏ కష్టాలూ లేకుండా స్వేచ్ఛగా ఉంటారు. అది మంచి మంచి వాటితో నిండిన చాలా మంచి దేశం. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, రకరకాల మనుష్యులు అక్కడ నివసిస్తున్నారు. ఇశ్రాయేలీయుల మొరలు నేను విన్నాను. వాళ్ల జీవితాన్ని ఈజిప్టు వాళ్లు ఎంత కష్టతరం చేసారో నేను చూశాను. అందుచేత నేను ఇప్పుడు ఫరో దగ్గరకు నిన్ను పంపిస్తున్నాను. వెళ్లు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుంచి బయటకు తీసుకువెళ్లు” అని చెప్పాడు.
నిర్గమకాండము 3:7-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా యిట్లనెను–నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.