నిర్గమకాండము 27:1-8
నిర్గమకాండము 27:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“తుమ్మకర్రతో మూడు మూరల ఎత్తుగల బలిపీఠం కట్టాలి; అది అయిదు మూరల పొడవు అయిదు మూరల వెడల్పుతో చతురస్రంగా ఉండాలి. కొమ్ములు, బలిపీఠం ఒకే భాగంలా ఉండేలా దాని నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక కొమ్మును చేయాలి. బలిపీఠాన్ని ఇత్తడితో పొదిగించాలి. దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో చేయాలి. దానికి వలలాంటి ఇత్తడి జాలి తయారుచేసి, ఆ జాలి నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక ఇత్తడి ఉంగరాన్ని తయారుచేసి, ఆ జాలి బలిపీఠం మధ్యకు చేరేలా బలిపీఠం గట్టు క్రింది భాగంలో దానిని ఉంచాలి. బలిపీఠం కోసం తుమ్మకర్రతో మోతకర్రలు తయారుచేసి, వాటిని ఇత్తడితో పొదిగించాలి. బలిపీఠాన్ని మోసినప్పుడు దాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలు దాని రెండు ప్రక్కలా ఉన్న ఉంగరాల్లో దూర్చాలి. పలకలను ఉపయోగించి బలిపీఠాన్ని గుల్లగా చేయాలి. కొండమీద నీకు చూపించిన నమూనా ప్రకారమే దాన్ని చేయాలి.
నిర్గమకాండము 27:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“నీవు తుమ్మచెక్కతో ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠం చెయ్యాలి. ఆ బలిపీఠం నలుచదరంగా ఉండాలి. దాని యెత్తు మూడు మూరలు. దాని నాలుగు మూలలా దానికి కొమ్ములు చెయ్యాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి. దానికి ఇత్తడి రేకు పొదిగించాలి. దాని బూడిద ఎత్తడానికి కుండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అగ్నిపాత్రలను చెయ్యాలి. ఈ ఉపకారణాలన్నిటినీ ఇత్తడితో చెయ్యాలి. దానికి వలలాంటి ఇత్తడి జల్లెడ చెయ్యాలి. ఆ వల మీద దాని నాలుగు మూలలా నాలుగు ఇత్తడి రింగులు చేసి ఆ వల బలిపీఠం మధ్యకి చేరేలా కిందిభాగంలో బలిపీఠం గట్టు కింద దాన్ని ఉంచాలి. బలిపీఠం కోసం మోతకర్రలను చెయ్యాలి. ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగించాలి. ఆ మోతకర్రలను ఆ రింగుల్లో చొప్పించాలి. బలిపీఠం మోయడానికి ఆ మోతకర్రలు దాని రెండువైపులా ఉండాలి. పలకలతో గుల్లగా దాన్ని చెయ్యాలి. కొండ మీద నీకు చూపించిన నమూనా ప్రకారం దాన్ని చెయ్యాలి.
నిర్గమకాండము 27:1-8 పవిత్ర బైబిల్ (TERV)
“తుమ్మకర్రతో ఒక బలిపీఠం నిర్మించు. బలిపీఠం చతురస్రంగా ఉండాలి. అది 7 1/2 అంగుళాల పొడవు 7 1/2 అంగుళాల వెడల్పు 4 1/2 అంగుళాల ఎత్తు ఉండాలి. బలిపీఠం నలుమూలలా ఒక్కోదానికి ఒక్కో కొమ్ము చేయాలి. అంతా ఒక్క వస్తువుగా ఉండేటట్టు ఒక్కో కొమ్మును దాని మూలకు జత చేయాలి. బలిపీఠాన్ని యిత్తడితో తాపడం చేయాలి. “బలిపీఠం మీద ఉపయోగించబడే పరికరాలు, పాత్రలు అన్నింటినీ ఇత్తడితో చేయాలి. బిందెలు, పారలు, పాత్రలు, పళ్లపారలు, నిప్పునెత్తే పెంకులు ఇత్తడితో చేయాలి. బలిపీఠం నుండి బూడిద ఎత్తి శుభ్రం చేయడానికి యివి ఉపయోగించబడతాయి. ఒక పెద్ద యిత్తడి జల్లెడలాంటి దానిని చేయాలి. తెర నాలుగు మూలలకు నాలుగు యిత్తడి ఉంగరాలు చెయ్యాలి. బలిపీఠానికి అడుగున మెట్టు కింద తెరను పెట్టాలి. కింద నుండి బలిపీఠంలో సగం పై వరకు, తెర ఉంటుంది. “బలిపీఠపు కర్రలు చేయడానికి తుమ్మకర్ర ఉపయోగించి వాటిని ఇత్తడితో తాపడం చేయాలి. బలిపీఠం రెండు వైపులా ఉండే ఉంగరాల్లోనుంచి ఆ కర్రలను దూర్చాలి. బలిపీఠం మోయడానికి ఈ కర్రలను ఉపయోగించాలి. బలిపీఠం గుల్లగా ఉంటుంది. దాని ప్రక్కలు పలకలతో చేయబడతాయి. నేను నీకు పర్వతం మీద చూపించినట్టే బలిపీఠాన్ని తయారు చెయ్యి.
నిర్గమకాండము 27:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు. దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిదె ఎత్తుటకుకుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నియు ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను. మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.