నిర్గమకాండము 2:1-9
నిర్గమకాండము 2:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ రోజుల్లో లేవీ గోత్రపు పురుషుడు లేవీ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు, ఆమె గర్భవతియై ఒక కుమారుడిని కన్నది. అతడు చక్కగా ఉండడం చూసి, ఆమె వానిని మూడు నెలలు దాచిపెట్టింది. కాని ఆమె వానిని ఇక దాచలేకపోయినప్పుడు, వాని కోసం ఒక జమ్ము బుట్ట తీసుకుని దానికి జిగటమన్ను తారు పూసింది. ఆ పిల్లవాన్ని అందులో పడుకోబెట్టి దానిని నైలు నది ఒడ్డున ఉన్న జమ్ములో ఉంచింది. అతనికి ఏమి జరుగుతుందో చూడడానికి ఆ పిల్లవాని అక్క దూరంలో నిలబడి ఉంది. ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైలు నదికి రాగా ఆమె పనికత్తెలు నది ఒడ్డున నడుస్తున్నారు. ఆమె జమ్ము మధ్యలో ఉన్న పెట్టెను చూసి దానిని తీసుకురావడానికి తన దాసిని పంపించింది. దానిని తెరిచి ఆ పిల్లవాన్ని చూసింది. ఆ పిల్లవాడు ఏడ్వడం చూసిన ఆమె అతనిపై కనికరపడి, “వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు” అన్నది. అప్పుడు ఆ పిల్లవాని అక్క ఫరో కుమార్తెతో, “ఈ పిల్లవాన్ని నీకోసం పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒకరిని పిలుచుకొని రమ్మంటారా?” అని అడిగింది. అందుకు ఆమె, “సరే, వెళ్లు” అన్నది. కాబట్టి ఆ అమ్మాయి వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకువచ్చింది. ఫరో కుమార్తె ఆమెతో, “నీవు ఈ బిడ్డను తీసుకెళ్లి నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతమిస్తాను” అని చెప్పింది. ఆమె ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచింది.
నిర్గమకాండము 2:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్లి లేవి స్త్రీలలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. వాడు ఎంతో అందంగా ఉండడం వల్ల అతణ్ణి మూడు నెలల పాటు దాచిపెట్టింది. ఇక అతణ్ణి దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టె చేయించి, దానికి జిగురు, కీలు పూసి, అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి, నది ఒడ్డున జమ్ము గడ్డిలో ఉంచింది. పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది. ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. “వీడు హెబ్రీయుల పిల్లవాడు” అంది. అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో “నీ కోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకు రమ్మంటారా?” అని అడిగింది. ఫరో కూతురు “వెళ్లి తీసుకు రా” అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకు వచ్చింది. ఫరో కూతురు ఆమెతో “ఈ పిల్లవాణ్ణి తీసుకు పోయి నా కోసం పాలిచ్చి పెంచు. నేను నీకు జీతం ఇస్తాను” అని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకు పోయి పాలిచ్చి పెంచింది.
నిర్గమకాండము 2:1-9 పవిత్ర బైబిల్ (TERV)
లేవీ వంశానికి చెందిన ఒకడు ఉన్నాడు. లేవీ వంశానికి చెందినదాన్నే ఒకామెను అతడు పెళ్లి చేసుకొన్నాడు. ఆమె గర్భవతియై ఒక కుమారుణ్ణి కన్నది. శిశువు చాలా అందంగా ఉండడం చూసి ఆ తల్లి మూడు నెలలపాటు ఆ శిశువును దాచి ఉంచింది. అయితే మూడు నెలలు అయ్యాక ఆ శిశువు సంగతి తెలిసిపోతుందేమోనని ఆ తల్లి భయపడింది. అలా తెలిస్తే ఆ శిశువు మగపిల్లవాడు కనుక వాడ్ని చంపేస్తారు. అందుకని ఆమె జమ్ముతో ఒక బుట్టను తయారు చేసి, అది నీళ్లలో తేలడానికిగాను దానికి తారు పూసింది. శిశువును ఆ బుట్టలో పెట్టింది. ఆమె తర్వాత నది ఒడ్డున ఏపుగా పెరిగిన జమ్ములో ఆ బుట్టను పెట్టింది. ఆ పసివాడి అక్క అక్కడే వుండి గమనిస్తూవుంది. ఆమె ఆ పసివాడికి ఏమి జరుగుతుందో చూడాలని అనుకొంది. సరిగ్గా అదే సమయంలో ఫరో కూతురు స్నానం చేయడానికి నది దగ్గరకు వెళ్లింది. ఆమె పని మనుషులు నది గట్టు మీద తిరుగుతూ ఉన్నారు. జమ్ములో ఉన్న బుట్టను ఆమె చూసింది. వెళ్లి ఆ బుట్టను తీసుకు రమ్మని ఆమె తన పనికత్తెల్లో ఒక దానితో చెప్పింది. రాజకుమారి ఆ బుట్ట తెరచి, అందులో ఉన్న మగ పిల్లాడ్ని చూసింది. ఆ పసివాడు ఏడుస్తూ ఉండడం చూసి, ఆమె జాలి పడింది. “వీడు హీబ్రూ పిల్లవాడని” ఆమె చెప్పింది. ఇంకా అప్పటివరకు దాక్కొని ఉన్న ఆ పసివాని అక్క లేచి, “ఈ పసివాడ్ని పెంచటానికి మీకు సహాయం చేసేందుకు ఒక హీబ్రూ స్త్రీని వెదకి తీసుకొని రమ్మంటారా?” అని రాజకుమారిని అడిగింది. “సరే అలాగే తీసుకురా” అంది రాజకుమారి. ఆ పిల్ల వెళ్లి ఆ పసివాడి స్వంత తల్లినే తీసుకొచ్చింది. “ఈ పసివాడ్ని తీసుకొని వెళ్లి పాలిచ్చి నాకోసం పెంచు. పసివాడ్ని జాగ్రత్తగా చూడు. నీకు నేను జీతం ఇస్తాను” అంది ఆ రాజకుమారి. కనుక ఆ స్త్రీ తన పసివాణ్ణి తీసుకొని జాగ్రత్తగా పెంచింది.
నిర్గమకాండము 2:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను. ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని,వాడు సుందరుడైయుండుట చూచి మూడునెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వానికొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానినిపెట్టి యేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా, వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచు లోని ఆ పెట్టెను చూచి, తన పనికత్తె నొకతెను పంపి దాని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి– వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె–వెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో–ఈ బిడ్డను తీసికొనిపోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొనిపోయి పాలిచ్చి పెంచెను.