నిర్గమకాండము 2:1-25
నిర్గమకాండము 2:1-25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ రోజుల్లో లేవీ గోత్రపు పురుషుడు లేవీ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు, ఆమె గర్భవతియై ఒక కుమారుడిని కన్నది. అతడు చక్కగా ఉండడం చూసి, ఆమె వానిని మూడు నెలలు దాచిపెట్టింది. కాని ఆమె వానిని ఇక దాచలేకపోయినప్పుడు, వాని కోసం ఒక జమ్ము బుట్ట తీసుకుని దానికి జిగటమన్ను తారు పూసింది. ఆ పిల్లవాన్ని అందులో పడుకోబెట్టి దానిని నైలు నది ఒడ్డున ఉన్న జమ్ములో ఉంచింది. అతనికి ఏమి జరుగుతుందో చూడడానికి ఆ పిల్లవాని అక్క దూరంలో నిలబడి ఉంది. ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైలు నదికి రాగా ఆమె పనికత్తెలు నది ఒడ్డున నడుస్తున్నారు. ఆమె జమ్ము మధ్యలో ఉన్న పెట్టెను చూసి దానిని తీసుకురావడానికి తన దాసిని పంపించింది. దానిని తెరిచి ఆ పిల్లవాన్ని చూసింది. ఆ పిల్లవాడు ఏడ్వడం చూసిన ఆమె అతనిపై కనికరపడి, “వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు” అన్నది. అప్పుడు ఆ పిల్లవాని అక్క ఫరో కుమార్తెతో, “ఈ పిల్లవాన్ని నీకోసం పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒకరిని పిలుచుకొని రమ్మంటారా?” అని అడిగింది. అందుకు ఆమె, “సరే, వెళ్లు” అన్నది. కాబట్టి ఆ అమ్మాయి వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకువచ్చింది. ఫరో కుమార్తె ఆమెతో, “నీవు ఈ బిడ్డను తీసుకెళ్లి నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతమిస్తాను” అని చెప్పింది. ఆమె ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచింది. పిల్లవాడు పెద్దయ్యాక, ఆమె అతన్ని ఫరో కుమార్తె దగ్గరకు తీసుకెళ్లింది, అతడు ఆమె కుమారుడయ్యాడు. “నేను అతన్ని నీటి నుండి బయటకు తీశాను” అని ఆమె అతనికి మోషే అని పేరు పెట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత, మోషే పెద్దవాడైన తర్వాత ఒక రోజు అతడు తన సొంత ప్రజలు ఉన్న చోటికి వెళ్లి వారి దుస్థితిని చూశాడు. అప్పుడు అతడు తన సొంత ప్రజల్లో ఒకడైన ఒక హెబ్రీయున్ని ఒక ఈజిప్టువాడు కొట్టడం చూశాడు. మోషే అటు ఇటు తిరిగి ఎవరూ లేకపోవడం చూసి ఆ ఈజిప్టువాన్ని చంపి ఇసుకలో దాచిపెట్టాడు. మరునాడు అతడు బయటకు వెళ్లినప్పుడు ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకోవడం చూశాడు. అతడు వారిలో తప్పు చేసినవానితో, “నీ తోటి హెబ్రీయున్ని ఎందుకు కొడుతున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు, “మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు? ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?” అన్నాడు. అప్పుడు మోషే, “నేను చేసిన పని అందరికి తెలిసిపోయింది” అని అనుకుని భయపడ్డాడు. ఫరో ఈ సంగతి విన్నప్పుడు, అతడు మోషేను చంపడానికి ప్రయత్నించాడు, కాని మోషే ఫరో దగ్గరనుండి పారిపోయి మిద్యానులో జీవించడానికి వెళ్లాడు, అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు, వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి నీళ్లు తోడి తొట్టెలు నింపడం మొదలుపెట్టారు. కొంతమంది గొర్రెల కాపరులు వచ్చి వారిని తరిమివేశారు, అయితే మోషే లేచి వారిని రక్షించి వారి మందకు నీళ్లు పెట్టాడు. వారు తమ తండ్రియైన రెయూయేలు దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు అతడు, “ఈ రోజు మీరు ఇంత త్వరగా ఎందుకు వచ్చారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “ఒక ఈజిప్టువాడు మమ్మల్ని గొర్రెల కాపరుల బారి నుండి కాపాడాడు. అంతేకాక మాకు, మందకు నీళ్లు తోడి పెట్టాడు” అని చెప్పారు. అందుకు రగూయేలు, “అయితే, అతడు ఎక్కడున్నాడు? అతన్ని ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతన్ని భోజనానికి పిలుచుకొని రండి” అని తన కుమార్తెలతో అన్నాడు. మోషే ఆ వ్యక్తితో ఉండడానికి అంగీకరించాడు. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషేకిచ్చి పెళ్ళి చేశాడు. సిప్పోరా ఒక కుమారుని కన్నది, మోషే, “నేను పరాయి దేశంలో పరదేశినయ్యాను” అని అతనికి గెర్షోము అని పేరు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు గడచిన తర్వాత, ఈజిప్టు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తమ బానిసత్వంలో మూల్గుతూ మొరపెట్టారు, తమ బానిస చాకిరీని బట్టి వారు పెట్టిన మొర దేవుని దగ్గరకు చేరింది. దేవుడు వారి మూల్గును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులను చూసి వారి పట్ల దయ చూపించారు.
నిర్గమకాండము 2:1-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్లి లేవి స్త్రీలలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. వాడు ఎంతో అందంగా ఉండడం వల్ల అతణ్ణి మూడు నెలల పాటు దాచిపెట్టింది. ఇక అతణ్ణి దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టె చేయించి, దానికి జిగురు, కీలు పూసి, అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి, నది ఒడ్డున జమ్ము గడ్డిలో ఉంచింది. పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది. ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. “వీడు హెబ్రీయుల పిల్లవాడు” అంది. అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో “నీ కోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకు రమ్మంటారా?” అని అడిగింది. ఫరో కూతురు “వెళ్లి తీసుకు రా” అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకు వచ్చింది. ఫరో కూతురు ఆమెతో “ఈ పిల్లవాణ్ణి తీసుకు పోయి నా కోసం పాలిచ్చి పెంచు. నేను నీకు జీతం ఇస్తాను” అని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకు పోయి పాలిచ్చి పెంచింది. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత ఆమె అతణ్ణి ఫరో కూతురి దగ్గరికి తీసుకు వచ్చింది. అతడు ఆమెకు కొడుకు అయ్యాడు. ఆమె “నీళ్ళలో నుండి నేను ఇతన్ని బయటకు తీశాను, కాబట్టి ఇతని పేరు మోషే” అని చెప్పింది. మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు. అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు. తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతున్నారు. అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో “నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు “మా మీద నిన్ను అధికారిగా, తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా?” అన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు. ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గరనుండి నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. మిద్యాను దేశంలో ఉన్న యాజకునికి ఏడుగురు కూతుళ్ళు. వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్ళ తొట్టెలు నింపుతున్నారు. అప్పుడు వేరే మంద కాపరులు వచ్చి వాళ్ళను అక్కడి నుండి తోలివేశారు. మోషే లేచి ఆ అమ్మాయిలకు సహాయం చేసి, వాళ్ళ మందకు నీళ్లు తోడిపెట్టాడు. వాళ్ళు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చాక వారి తండ్రి రగూయేలు “మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు?” అని అడిగాడు. అందుకు వాళ్ళు “ఒక ఐగుప్తీయుడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని కాపాడి, నీళ్లు తోడి మన మందకు పోశాడు” అన్నారు. అతడు తన కూతుళ్ళతో “అతడు ఏడీ? ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతణ్ణి భోజనానికి పిలుచుకు రండి” అని చెప్పాడు. మోషే ఆ కుటుంబంతో కలిసి నివసించడానికి అంగీకరించాడు. రగూయేలు తన కూతురు సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు మోషే “నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను” అనుకుని తన కొడుక్కి “గెర్షోము” అని పేరు పెట్టాడు. ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు వారి నిట్టూర్పులు, మూలుగులు విన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు.
నిర్గమకాండము 2:1-25 పవిత్ర బైబిల్ (TERV)
లేవీ వంశానికి చెందిన ఒకడు ఉన్నాడు. లేవీ వంశానికి చెందినదాన్నే ఒకామెను అతడు పెళ్లి చేసుకొన్నాడు. ఆమె గర్భవతియై ఒక కుమారుణ్ణి కన్నది. శిశువు చాలా అందంగా ఉండడం చూసి ఆ తల్లి మూడు నెలలపాటు ఆ శిశువును దాచి ఉంచింది. అయితే మూడు నెలలు అయ్యాక ఆ శిశువు సంగతి తెలిసిపోతుందేమోనని ఆ తల్లి భయపడింది. అలా తెలిస్తే ఆ శిశువు మగపిల్లవాడు కనుక వాడ్ని చంపేస్తారు. అందుకని ఆమె జమ్ముతో ఒక బుట్టను తయారు చేసి, అది నీళ్లలో తేలడానికిగాను దానికి తారు పూసింది. శిశువును ఆ బుట్టలో పెట్టింది. ఆమె తర్వాత నది ఒడ్డున ఏపుగా పెరిగిన జమ్ములో ఆ బుట్టను పెట్టింది. ఆ పసివాడి అక్క అక్కడే వుండి గమనిస్తూవుంది. ఆమె ఆ పసివాడికి ఏమి జరుగుతుందో చూడాలని అనుకొంది. సరిగ్గా అదే సమయంలో ఫరో కూతురు స్నానం చేయడానికి నది దగ్గరకు వెళ్లింది. ఆమె పని మనుషులు నది గట్టు మీద తిరుగుతూ ఉన్నారు. జమ్ములో ఉన్న బుట్టను ఆమె చూసింది. వెళ్లి ఆ బుట్టను తీసుకు రమ్మని ఆమె తన పనికత్తెల్లో ఒక దానితో చెప్పింది. రాజకుమారి ఆ బుట్ట తెరచి, అందులో ఉన్న మగ పిల్లాడ్ని చూసింది. ఆ పసివాడు ఏడుస్తూ ఉండడం చూసి, ఆమె జాలి పడింది. “వీడు హీబ్రూ పిల్లవాడని” ఆమె చెప్పింది. ఇంకా అప్పటివరకు దాక్కొని ఉన్న ఆ పసివాని అక్క లేచి, “ఈ పసివాడ్ని పెంచటానికి మీకు సహాయం చేసేందుకు ఒక హీబ్రూ స్త్రీని వెదకి తీసుకొని రమ్మంటారా?” అని రాజకుమారిని అడిగింది. “సరే అలాగే తీసుకురా” అంది రాజకుమారి. ఆ పిల్ల వెళ్లి ఆ పసివాడి స్వంత తల్లినే తీసుకొచ్చింది. “ఈ పసివాడ్ని తీసుకొని వెళ్లి పాలిచ్చి నాకోసం పెంచు. పసివాడ్ని జాగ్రత్తగా చూడు. నీకు నేను జీతం ఇస్తాను” అంది ఆ రాజకుమారి. కనుక ఆ స్త్రీ తన పసివాణ్ణి తీసుకొని జాగ్రత్తగా పెంచింది. ఆ పసివాడు పెద్దవాడయ్యాడు. కొన్నాళ్లకు ఆ స్త్రీ పిల్లవాడ్ని రాజకుమారి దగ్గరకు తీసుకొచ్చింది. రాజకుమారి ఆ పిల్లవాడ్ని తన సొంత కుమారుడుగా స్వీకరించింది. ఆ పిల్లవాడ్ని నీళ్లలోంచి బయటికి తీసింది కనుక ఆమె వానికి మోషే అని పేరు పెట్టింది. మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. తన ప్రజలు అంటే, హీబ్రూవారు బలవంతంగా చాలా కష్టపడి పని చేయాల్సి ఉన్నట్టు మోషే గ్రహించాడు. ఒకరోజు ఈజిప్టు వాడొకడు హీబ్రూవాడ్ని కొట్టడం మోషే చూసాడు. ఎవరైనా గమనిస్తున్నారేమోనని మోషే అటు ఇటు చూసాడు. తర్వాత మోషే ఆ ఈజిప్టువాడ్ని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు. మర్నాడు హీబ్రూవాళ్లే ఇద్దరు పోట్లాడుకోవడం మోషే చూసాడు. వారిలో ఒకడిది తప్పని తెలుసుకొని “అతనితో ఎందుకిలా మీవాడ్ని కొడుతున్నావు?” అని అన్నాడు. దానికి అతను జవాబిస్తూ, “మామీద నీవు అధికారివనిగాని, న్యాయమూర్తివనిగాని ఎవరయినా నియమించారా? నిన్న నీవు ఆ ఈజిప్టువాడ్ని చంపినట్టు నన్నూ చంపుతావా?” అన్నాడు. అప్పుడు మోషే భయపడిపోయాడు. “అలాగైతే నేను చేసిన ఆ పని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని” మోషే తనలో తాను అనుకొన్నాడు. మోషే చేసినదాన్ని గూర్చి విని ఫరో మోషేను చంపెయ్యాలనే నిర్ణయానికొచ్చాడు! కానీ ఫరో దగ్గర్నుండి మోషే పారిపోయాడు. మోషే మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావివద్ద ఆగిపోయాడు. మిద్యానులో ఒక యాజకునికి ఏడుగురు కుమార్తెలు. ఒకరోజు వారు తమ తండ్రిగారి గొర్రెలకు నీళ్లు తీసుకొని రావడానికి ఆ బావి దగ్గరకు వెళ్లారు. వారు ఆ నీళ్ల కుండలను నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాని అక్కడ ఉన్న కొందరు గొర్రెల కాపరులు ఆ అమ్మాయిలను నీళ్లు చేదుకోనివ్వకుండా వెళ్లగొట్టేస్తున్నారు. కనుక ఆ అమ్మాయిలకు మోషే సహాయం చేసి, వారి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు. తర్వాత వాళ్లు వారి తండ్రి రగూయేలు దగ్గరకు వెళ్లిపోయారు. “ఆయన వారితో ఈ రోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు” అని అన్నాడు. “గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను మాకు సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు ఆ అమ్మాయిలు. అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు తన కూతుళ్లతో. అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు. అతను సిప్పోర అనే తన కూతుర్ని మోషేకు భార్యగా ఇచ్చాడు. సిప్పోరాకు కొడుకు పుట్టాడు. అతనికి గెర్షోము అని మోషే పేరు పెట్టాడు. మోషే తనది కాని మరో పరాయి దేశంలో ఉండడం చేత తన కొడుక్కు ఈ పేరు పెట్టాడు. చాలాకాలం గడచిపోయింది. ఈజిప్టురాజు చనిపోయాడు. అప్పటికి ఇశ్రాయేలు వాళ్లు ఇంకా కష్టతరమైన పనులు చేసేందుకు బలవంత పెట్టబడుతూనే ఉన్నారు. వాళ్లు సహాయం కోసం మొరపెడుతూ ఉన్నారు. దేవుడు వారి మొర విన్నాడు. దేవుడు వారి ప్రార్థనలు విని, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసుకొన్న ఒడంబడికను జ్ఞాపకం చేసుకొన్నాడు. ఇశ్రాయేలీయుల కష్టాలను దేవుడు చూచాడు. త్వరలోనే వారి కష్టాలను కడతేర్చాలని ఆయనకు తెలుసు.
నిర్గమకాండము 2:1-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను. ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని,వాడు సుందరుడైయుండుట చూచి మూడునెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వానికొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానినిపెట్టి యేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా, వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచు లోని ఆ పెట్టెను చూచి, తన పనికత్తె నొకతెను పంపి దాని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి– వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె–వెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో–ఈ బిడ్డను తీసికొనిపోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొనిపోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె–నీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి–నీ వేల నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు–మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే–నిశ్చయముగా ఈ సంగతి బయలు పడెననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచి పోయి యొక బావియొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రియైన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు–నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు–ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలోనుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో–అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే–నేను అన్య దేశములో పర దేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను. ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారు పెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.