నిర్గమకాండము 15:25-26
నిర్గమకాండము 15:25-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా యెహోవా అతనికి ఒక చెట్టు కొమ్మను చూపించారు. అతడు దానిని నీటిలో వేయగా ఆ నీరు తియ్యగా మారాయి. అక్కడే యెహోవా వారికి ఒక శాసనాన్ని నియమించి వారిని పరీక్షించారు. ఆయన వారితో, “మీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు సరిగ్గా విని, ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చేసి, మీరు ఆయన ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడి ఆయన శాసనాలన్నిటిని అనుసరిస్తే, నేను ఈజిప్టువారి మీదికి రప్పించిన తెగుళ్ళలో ఏదీ మీ మీదికి రాదు, మిమ్మల్ని స్వస్థపరచే యెహోవాను నేనే” అన్నారు.
నిర్గమకాండము 15:25-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు తియ్యగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించాడు, “మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.”
నిర్గమకాండము 15:25-26 పవిత్ర బైబిల్ (TERV)
మోషే యెహోవాకు మొర పెట్టాడు. యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును నీళ్లలో వేసాడు. అతను యిలా చేయగానే ఆ నీళ్లు తాగే మంచి నీళ్లయ్యాయి. ఆ స్థలంలో ప్రజలకు యెహోవా తీర్పు తీర్చి వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ ప్రజల విశ్వాసాన్ని కూడ యెహోవా పరీక్షించాడు. “మీ యెహోవా దేవునికి మీరు విధేయులు కావాలి. ఆయన ఏవి సరైనవని చెబతాడో వాటిని మీరు చేయాలి. యెహోవా ఆజ్ఞలకు, చట్టానికి మీరు విధేయులైతే, ఈజిప్టు వాళ్లలా మీరు రోగులు అవ్వరు. నేను, యెహోవాను, ఈజిప్టు వాళ్ల మీదకు పంపిన రోగాలు ఏవీ మీ మీదకు పంపించను. నేనే యెహోవాను. మిమ్మల్ని స్వస్థపరచేవాడ్ని నేనే.”
నిర్గమకాండము 15:25-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి, –మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.