నిర్గమకాండము 14:1-14

నిర్గమకాండము 14:1-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

తర్వాత యెహోవా మోషేతో అన్నారు, “ఇశ్రాయేలీయులను వెనుకకు తిరిగి పీ హహీరోతుకు సమీపంలో మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో బయల్-సెఫోనుకు సరిగ్గా ఎదురుగా సముద్రతీరాన బసచేయమని వారితో చెప్పు. ఫరో ఇశ్రాయేలీయుల గురించి, ‘వారు ఈ దేశంలో కలవరంతో దారితప్పి తిరుగుతున్నారని, ఎడారిలో చిక్కుకున్నారని’ అనుకుంటాడు. నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను కాబట్టి అతడు వారిని వెంటాడుతాడు. కాని ఫరో, అతని సైన్యం వలన నాకు మహిమ కలుగుతుంది. నేను యెహోవానై యున్నానని ఈజిప్టువారందరు తెలుసుకుంటారు.” కాబట్టి ఇశ్రాయేలీయులు అలాగే చేశారు. ప్రజలు పారిపోయారని ఈజిప్టు రాజుకు తెలియజేసినప్పుడు, వారి గురించి ఫరో అతని సేవకులు తమ మనస్సులు మార్చుకొని, “మనమెందుకు ఇలా చేశాము? మనకు సేవలు చేయకుండా మనం ఇశ్రాయేలీయులను వెళ్లనిచ్చాము!” అని చెప్పుకొన్నారు. కాబట్టి అతడు తన రథాన్ని సిద్ధం చేసుకుని తనతో పాటు తన సైన్యాన్ని తీసుకెళ్లాడు. అతడు ప్రత్యేకమైన ఆరువందల రథాలను వాటితో పాటు ఈజిప్టులో ఉన్న ఇతర రథాలన్నిటిని ప్రతి దాని మీద అధిపతులతో తీసుకెళ్లాడు. యెహోవా ఈజిప్టు రాజైన ఫరో హృదయాన్ని కఠినం చేసినప్పుడు అతడు నిర్భయంగా వెళ్తున్న ఇశ్రాయేలీయులను వెంటాడాడు. ఈజిప్టువారు అంటే ఫరో యొక్క అన్ని గుర్రాలు, రథాలు, గుర్రపురౌతులు, దళాలు ఇశ్రాయేలీయులను వెంటాడి, వారిని దాటి బయల్-సెఫోను ఎదురుగా ఉన్న పీ హహీరోతుకు సమీపంలో సముద్రతీరాన బసచేసి వారిని పట్టుకోడానికి వచ్చారు. ఫరో దగ్గరగా వస్తుండగా, ఇశ్రాయేలీయులు పైకి చూసినప్పుడు ఈజిప్టువారు తమ వెనుక రావడం చూశారు. వారు భయపడి యెహోవాకు మొరపెట్టారు. వారు మోషేతో, “ఈజిప్టులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని తీసుకువచ్చావా? ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చి మాకు నీవు చేసిందేంటి? మమ్మల్ని వదిలిపెట్టు, మేము ఈజిప్టువారికి సేవచేసుకుంటామని ఈజిప్టులో మేము నీతో చెప్పలేక? ఈ ఎడారిలో చావడం కంటే ఈజిప్టువారికి సేవచేసుకోవడం మాకు మేలు కదా!” అన్నారు. అందుకు మోషే ప్రజలతో అన్నాడు, “భయపడకండి. స్థిరంగా నిలబడి యెహోవా ఈ రోజు మీకు కలుగజేసే విడుదలను చూడండి. ఈ రోజు మీరు చూస్తున్న ఈజిప్టువారు మరలా మీరెప్పుడూ చూడరు. యెహోవా మీ కోసం యుద్ధం చేస్తారు; మీరు మౌనంగా ఉంటే చాలు.”

నిర్గమకాండము 14:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి పీహహీరోతు ఎదుట, అంటే మిగ్దోలుకూ, సముద్రానికీ మధ్యలో ఉన్న బయల్సెఫోను దగ్గర విడిది చేయమని వారితో చెప్పు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఫరో, ‘ఆ ప్రజలు ఈ దేశంలో ఎడారి మధ్యలో చిక్కుబడిపోయారు’ అనుకుంటాడు. నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాను. అతడు వాళ్ళను తరుముతాడు. నేను ఫరో ద్వారా, మిగిలిన అతని సేన ద్వారా మహిమ పొందుతాను. నేను యెహోవాను అని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.” ఇశ్రాయేలు ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయిన విషయం ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయాలు ఇశ్రాయేలు ప్రజపై కక్షతో నిండి పోయాయి. “మనం చేసిందేమిటి? మన కోసం పనులు చేయకుండా వాళ్ళను ఎందుకు వెళ్ళనిచ్చాం?” అని చెప్పుకున్నారు. అప్పుడు ఫరో తన రథాలు సిద్ధం చేయించి తన సైన్యాన్ని వెంట బెట్టుకుని బయలుదేరాడు. అతడు తన ఐగుప్తులోని శ్రేష్ఠమైన 600 రథాలను, ప్రతి రథంలోనూ సైన్యాధిపతులను తీసుకు పోయాడు. యెహోవా ఐగుప్తు రాజు ఫరో హృదయాన్ని కఠినం చేసినందువల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను తరిమాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ బలగం అంతటితో తరలి వెళ్తున్నారు. బయల్సెఫోను ఎదురుగా ఉన్న పీహహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వాళ్ళను సమీపించారు. ఫరో, అతని సైన్యం తమను తరుముతూ రావడం చూసిన ఇశ్రాయేలు ప్రజలు హడలిపోయారు. కేకలు వేస్తూ యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు వాళ్ళు మోషేతో “ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తావా? మేము ఐగుప్తీయులకు బానిసలుగానే ఉంటాం, మా జోలికి రావద్దు అని ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది ఇందుకే గదా. మేము ఈ ఎడారిలో చనిపోవడం కంటే ఐగుప్తులో బానిసలుగా బతకడమే మంచిది” అని నిష్టూరంగా మాట్లాడారు. అందుకు మోషే “భయపడకండి, ఈ రోజు యెహోవా మీకు కలిగించే రక్షణను అలా నిలబడి చూడండి. మీరు ఈ రోజు చూసిన ఐగుప్తీయులను ఇకపై ఎన్నడూ చూడరు. మీరు ఊరికే నిలబడి ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు” అని ప్రజలతో చెప్పాడు.

నిర్గమకాండము 14:1-14 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ప్రజలు వెనక్కు తిరిగి పీహ హీరోతుకు ప్రయాణం కట్టమని చెప్పు. మిగ్దోలుకు, సముద్రానికి మధ్య ప్రదేశంలో రాత్రికి బసచేయాలని వారితో చెప్పు. ఇది బయల్సెఫోను దగ్గర్లో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తప్పిపోయి ఉంటారని ఫరో తలుస్తాడు. పైగా ప్రజలు వెళ్ల గలిగినచోటు ఇంకేమీ ఉండదు అనుకొంటాడు. ఫరోను నేను ధైర్యశాలిగా చేస్తాను. అతడేమో మిమ్మల్ని తరుముతాడు. అయితే ఫరోను, అతని సైన్యాన్ని నేను ఓడిస్తాను. ఇది నాకు కీర్తి తెచ్చి పెడుతుంది. నేనే యెహోవానని ఈజిప్టు వాళ్లు అప్పుడు తెల్సుకొంటారు.” ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విధేయులై ఆయన చెప్పినట్టు చేసారు. ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారని ఫరోకు ఒక సమాచారం అందింది. ఎప్పుడైతే ఈ సంగతి విన్నారో అప్పుడు వెంటనే ఫరో, అతని అధికారులు తాము చేసిన దాన్ని గూర్చి తమ మనసు మార్చుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల్ని అసలు మనం ఎందుకు వెళ్లనిచ్చాం? వాళ్లను మనం ఎందుకు పారిపోనిచ్చాం? ఇప్పుడు మనం మన బానిసల్ని పోగొట్టుకొన్నాం” అన్నాడు ఫరో. కనుక ఫరో తన యుద్ధరథాన్ని సిద్ధం చేసుకొని, తన మనుష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్లాడు. తన మనుష్యుల్లో బలవంతులయిన వాళ్లు 600 మందిని, రథాలు అన్నింటిని తనతో తీసుకొని వెళ్లాడు. ఒక్కోరథానికి ఒక్కో అధికారి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు విజయ సంకేతంగా చేతులు పైకెత్తి వెళ్లి పోతున్నారు. కానీ ఈజిప్టురాజైన ఫరో ఇంకా ధైర్యశాలి అయ్యేటట్టు యెహోవా చేసాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా తరిమాడు. ఈజిప్టు సైన్యంలో అశ్వదళాలు, రథాలు చాల ఉన్నాయి. వారు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి, వారు బయల్సెఫోనుకు తూర్పున పీహహీరోతు వద్ద ఎర్ర సముద్రానికి దగ్గర్లో బస చేస్తూ ఉండగానే వారిని సమీపించారు. ఫరో, అతని సైన్యం తమవైపే రావడం ఇశ్రాయేలు ప్రజలు చూసారు. ప్రజలు చాల భయపడ్డారు. సహాయం చేయమని వారు యెహోవాకు మొరపెట్టారు. మోషేతో వాళ్లు యిలా అన్నారు, “అసలు ఈజిప్టు నుండి నీవు మమ్మల్నెందుకు బయటకు తీసుకొచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకురావడం ఎందుకు? మేము హాయిగా ఈజిప్టులోనే చచ్చేవాళ్లం అక్కడ ఈజిప్టులో కావాల్సినన్ని సమాధులున్నాయి. ఇలా జరుగుతుందని మేము నీతో చెప్పాము. ‘దయచేసి మమ్మల్ని విసిగించకు. మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి, ఈజిప్టు వాళ్లకు సేవ చేయనియ్యి అని ఈజిప్టులోనే మేము చెప్పాము.’ ఇలా బయటకు వచ్చి ఈఎడారిలో చావడంకంటె ఈజిప్టులోనే ఉండిపోయి బానిసలంగా ఉంటేనే యింకా బాగుండేది మాకు.” కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు! మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయాల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు.”

నిర్గమకాండము 14:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను –ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులనుగూర్చి–వారు ఈ దేశములో చిక్కు బడి యున్నారు; అరణ్యము వారిని మూసి వేసెనని అను కొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను; అతడు వారిని తరుమగా; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయులందరు తెలిసికొందురనెను. వారు ఆలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి –మనమెందుకీలాగు చేసితిమి? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పు కొనిరి. అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొని పోయెను. మరియు అతడు శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడుకొనిపోయెను. యెహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లుచుండిరి. ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱములన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి. అంతట వారు మోషేతో–ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటె ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే–భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ జేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.