నిర్గమకాండము 10:13-19

నిర్గమకాండము 10:13-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మోషే తన కర్రను ఈజిప్టు మీద చాపినప్పుడు యెహోవా పగలంతా రాత్రంతా ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశారు. ఉదయానికి ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చాయి. ఆ మిడతలు ఈజిప్టు దేశమంతటిని ఆక్రమించుకుని దేశంలోని ప్రతిచోట వాలాయి. అవి అసంఖ్యాకమైనవి. అటువంటి మిడతలు గతంలో ఎన్నడూ లేవు ఇకముందు ఉండవు. నల్లగా ఉండే వరకు అవి భూమి అంతా కప్పాయి. వడగళ్ళకు పాడవకుండ పొలాల్లో ఉన్నవాటిని చెట్లకున్న పండ్లను అవి తినివేశాయి. ఈజిప్టు దేశమంతా చెట్టు మీద గాని మొక్క మీద గాని పచ్చదనం మిగల్లేదు. ఫరో వెంటనే మోషే అహరోనులను పిలిపించి వారితో, “మీ దేవుడైన యెహోవాకు మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. దయచేసి మరొకసారి నా పాపాన్ని క్షమించి మరణం కలిగించే ఈ తెగులును నా నుండి తొలగించమని మీ దేవుడైన యెహోవాకు ప్రార్థించండి” అని అన్నాడు. మోషే ఫరో దగ్గర నుండి వెళ్లి యెహోవాకు ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి బలమైన పడమటి గాలి వీచేలా చేసినప్పుడు ఆ గాలికి మిడతలు ఎర్ర సముద్రంలోకి కొట్టుకుపోయాయి. ఈజిప్టులో ఎక్కడ కూడా ఒక్క మిడత కూడా మిగల్లేదు.

నిర్గమకాండము 10:13-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలూ, రాత్రీ ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చిపడ్డాయి. తీవ్రంగా హాని కలిగించే ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికీ వచ్చి ఐగుప్తు దేశంలోని అన్ని సరిహద్దుల్లో నిలిచి భూమి మొత్తాన్నీ కప్పివేశాయి. అంతకు ముందెప్పుడూ ఇలాంటి మిడతలు లేవు, ఇకముందు కూడా ఉండబోవు. ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ చెట్లనూ ఫలాలనూ అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు గానీ పొలాల పంటలు గానీ పచ్చగా ఉండేది ఏదీ మిగలలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను వెంటనే పిలిపించాడు. “నేను మీ పట్లా మీ దేవుడు యెహోవా పట్లా తప్పిదం చేశాను. దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా తప్పు క్షమించండి. ఈ చావును తెచ్చే విపత్తును మాత్రం నా మీద నుండి తప్పించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి” అన్నాడు. మోషే ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళి యెహోవాకు ప్రార్ధించాడు. అప్పుడు యెహోవా, గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు.

నిర్గమకాండము 10:13-19 పవిత్ర బైబిల్ (TERV)

కనుక మోషే ఈజిప్టు దేశం మీద తన కర్ర ఎత్తగా తూర్పు నుండి బలంగా గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ రోజంతా, ఆ రాత్రి అంతా గాలి వీచింది. తెల్లవారేటప్పటికి ఈజిప్టు అంతటా మిడతల్ని తెచ్చి పడేసింది ఆ గాలి. మిడతలు ఈజిప్టు దేశంలోకి ఎగిరివచ్చి నేలమీదంతటా కమ్మాయి. ఈజిప్టులో ఇది వరకు ఎన్నడూ లేనన్ని మిడతలు వచ్చేసాయి. పూర్వం ఎన్నడూ అన్ని మిడతలు ఉండలేదు. నేల అంతా మిడతలు కమ్మేశాయి. దేశం అంతా చీకటి అయిపోయింది. వడగళ్లు నాశనం చేయకుండా మిగిల్చిన చెట్లలో ప్రతి ఫలాన్ని, నేలమీద ఉన్న ప్రతి మొక్కనూ మిడతలు తినేసాయి. మొత్తం ఈజిప్టులో ఎక్కడేగాని ఏ చెట్లకూ మొక్కలకూ ఒక్క ఆకు గూడ మిగల్లేదు. వెంటనే మోషే అహరోనులను పిలిపించాడు ఫరో, “మీకు, మీ యెహోవా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసాను. ఈ సారికి నా పాపాలు క్షమించండి. నా దగ్గర్నుండి ఈ మృత్యువును (మిడతలను) తీసివేయమని యెహోవాను అడగండి” అని చెప్పాడు ఫరో. మోషే ఫరో దగ్గరనుండి వెళ్లిపోయి యెహోవాను ప్రార్థించాడు. కనుక యెహోవా ఆ గాలిని మార్చేసాడు. పడమటినుండి గాలి బలంగా వీచేటట్టు చేసాడు. ఆ గాలి మిడతలన్నింటినీ ఎర్ర సముద్రంలోకి కొట్టేసింది. ఈజిప్టులో ఒక్క మిడతకూడ మిగల్లేదు.

నిర్గమకాండము 10:13-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి, అంతకుమునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయేగాని పచ్చని దేదియు మిగిలియుండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి –నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని. మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొల గించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహా బలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు.