ఎస్తేరు 9:20-32
ఎస్తేరు 9:20-32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మొర్దెకై ఈ సంగతులన్ని నమోదు చేసి, రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటికి దగ్గరలో దూరంలో నివసిస్తున్న యూదులందరికి ఉత్తరాలు పంపాడు. యూదులు తమ శత్రువుల నుండి ఉపశమనం పొందుకున్నారు, తమ బాధ సంతోషంగా మారింది, తమ దుఃఖం ఆనందించే రోజుగా మారింది కాబట్టి ప్రతి ఏట అదారు నెల పద్నాలుగు, పదిహేను రోజుల్లో వార్షిక పండగ జరుపుకోవాలని అతడు వ్రాశాడు. ఆ రోజులు విందు చేసుకుని ఆనందించే రోజులుగా, ఒకరికి ఒకరు ఆహార బహుమానాలు ఇచ్చుకునే రోజులుగా, పేదలకు బహుమానాలు ఇచ్చే రోజులుగా జరుపుకోవాలాని అతడు వారికి వ్రాశాడు. కాబట్టి యూదులు మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారం తాము ప్రారంభించిన ఉత్సవం కొనసాగిస్తామని ఒప్పుకున్నారు. యూదులందరికి శత్రువైన అగగీయుడు హమ్మెదాతా కుమారుడైన హామాను యూదులను నాశనం చేయడానికి కుట్రపన్ని, వారిని నాశనం చేసి, నిర్మూలించడానికి పూరు (అనగా, చీట్లు) వేశాడు. అయితే ఈ కుట్ర గురించి రాజుకు తెలిసినప్పుడు, అతడు హామాను యూదులకు వ్యతిరేకంగా తలపెట్టిన కీడు అతని మీదికే వచ్చేలా చేసి, అతన్ని అతని కుమారులను ఉరికంబాలకు వ్రేలాడదీయాలని రాజు వ్రాతపూర్వక ఆదేశాలు జారీ చేశాడు. (అందువల్ల ఈ రోజులకు పూరు అనే పదం నుండి వచ్చిన పూరీము అని పేరు వచ్చింది.) ఈ ఉత్తరంలో వ్రాయబడిన ప్రతి విషయం బట్టి, వారు చూసిన, తమకు జరిగిన వాటిని బట్టి, వారు ఏమి చూశారో, వారికి ఏమి జరిగిందో దానిని బట్టి, యూదులు ప్రతి సంవత్సరం ఈ రెండు రోజులను ఒక ఆచారంగా నిర్ణయించిన విధానంలో నియమించిన సమయంలో తాము తమ వారసులు, తమతో కలిసే వారందరితో ఖచ్చితంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. తరతరాల వరకు ప్రతి సంస్థానంలో, ప్రతి పట్టణంలో, ప్రతి కుటుంబం ద్వారా వచ్చే ప్రతి తరం వారు ఈ రోజులను జ్ఞాపకం చేసుకుని ఉత్సవంగా జరుపుకోవాలి. యూదులు ఈ పూరీము రోజులు పాటించకుండా ఉండకూడదు. ఈ రోజుల జ్ఞాపకం వారి వారసులు ఎన్నడూ మరచిపోకూడదు. కాబట్టి అబీహయిలు కుమార్తెయైన ఎస్తేరు రాణి, యూదుడైన మొర్దెకైతో కలిసి పూరీము గురించి ఈ రెండవ లేఖను ధృవీకరించడానికి పూర్తి అధికారంతో వ్రాశారు. అహష్వేరోషు సామ్రాజ్యంలో 127 సంస్థానాలలో ఉన్న యూదులందరికి క్షేమం, నమ్మకం కలిగించే మాటలతో కూడిన ఉత్తరాన్ని మొర్దెకై పంపాడు. యూదుడైన మొర్దెకై ఎస్తేరు రాణి శాసించిన విధంగా పూరీము దినాలను వాటి సమయాల్లో జరిగేలా నిర్ధారించినట్లే వారు తమ కోసం తమ వారసుల కోసం ఉపవాస విలాప దినాలను పాటించే బాధ్యత తీసుకున్నారు. ఎస్తేరు శాసనం వలన పూరీము గురించిన ఈ నిబంధనలు నిర్ధారించబడి చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడ్డాయి.
ఎస్తేరు 9:20-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మొర్దెకై ఈ విషయాల గురించి రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటికీ దగ్గరలో గానీ, దూరంలో గానీ నివసిస్తున్న యూదులందరికీ ఉత్తరాలు రాసి పంపించాడు. యూదులు ప్రతి సంవత్సరం అదారు నెలలో పద్నాలుగు, పదిహేనవ తేదీల్లో పండగ చేసుకోవాలని నిర్ణయించాడు. తమ శత్రువుల బారి నుండి విడుదల, వారి దుఃఖానికి బదులు సంతోషం వచ్చిన రోజు అదేననీ, విందు వినోదాలు చేసుకుంటూ ఒకరికొకరు కానుకలు పంపుకుని, పేదలకు సహాయం చేయాలని నియమించాడు. అప్పుడు యూదులు తాము మొదలు పెట్టిన దాన్ని కొనసాగిస్తూ మొర్దెకై తమకు రాసిన ప్రకారం చేస్తామని అంగీకరించారు. యూదుల శత్రువు, హమ్మెదాతా కొడుకు, అగగు వంశికుడు అయిన హామాను యూదులను మట్టుబెట్టాలనీ, వారిని చంపి సమూల నాశనం చెయ్యాలనీ పూరు, అంటే చీటి వేయించాడు గదా. అయితే ఈ సంగతి రాజు దృష్టికి వచ్చాక హామాను యూదులకు విరోధంగా చేసిన కుట్రను అతని తల మీదికే వచ్చేలా చేసి, వాడిని, వాడి కొడుకులను ఉరికొయ్య మీద వేలాడ దీసేలా ఆజ్ఞ జారీ చేశాడు. ఆ విధంగా ఆ రోజులకు పూరు అనే మాటనుబట్టి పూరీము అని పేరు వచ్చింది. ఈ ఆజ్ఞలో రాసిన వాటిని బట్టి తాము చూసిన, తమకు దాపురించిన వాటన్నిటిని బట్టి యూదులు ఈ రెండు రోజులను గూర్చి ఆజ్ఞ అందినట్టే ఏటేటా నియమించిన రోజుల్లో ఉత్సవం చేసుకుంటామని ఒప్పందం చేసుకున్నారు. ఈ పండగ రోజులను తరతరాలు ప్రతి కుటుంబంలో ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణంలో జ్ఞాపకార్థంగా ఆచరిస్తామని నిశ్చయించుకున్నారు. పూరీము అనే ఈ పండగని యూదులు తప్పక ఆచరించాలని, తమ సంతానం మర్చిపోకుండేలా దీన్ని కొనసాగించాలని, తామూ, తమ సంతానం నమ్మకంగా దీన్ని పాటించాలని కట్టుబాటు చేసుకున్నారు. అప్పుడు పూరీమును గూర్చి రాసిన ఈ రెండో ఆజ్ఞను ధృవీకరించడానికి అబీహాయిలు కుమార్తె, రాణి అయిన ఎస్తేరు, యూదుడైన మొర్దెకై అధికార పూర్వకంగా రాసి పంపారు. అహష్వేరోషు సామ్రాజ్యంలోని 127 సంస్థానాల్లోని యూదులందరికీ ఉత్తరాలు వెళ్ళాయి. యూదుడైన మొర్దెకై, ఎస్తేరు రాణి పూరీము పండగ రోజులను నిర్ధారిస్తూ ఆ ఉత్తరాలు రాశారు. యూదులంతా తామూ, తమ సంతతీ ఆ విధంగానే ఉపవాస, విలాప దినాలను పాటించే బాధ్యత తీసుకున్నారు. ఈ విధంగా ఎస్తేరు రాణి ఆజ్ఞ చేత ఈ పూరీము సంప్రదాయాన్ని నిర్ధారించి వాటిని గ్రంథంలో రాశారు.
ఎస్తేరు 9:20-32 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు జరిగిన ఘటనలన్నింటినీ మొర్దెకై గ్రంథస్తం చేయించాడు. తర్వాత అతను అహష్వేరోషు మహారాజు సామంత రాజ్యాలన్నింటిలోని యూదులందరికీ లేఖలు పంపాడు. అతనా లేఖలను దగ్గర ప్రాంతాలకే కాకుండా దూర ప్రాంతాలకు కూడా పంపాడు. ఏటా అదారు నెల 14, 15 తేదీల్లో యూదులందరూ పూరీము పండుగను పాటించాలని తెలియ చెప్పేందుకుగాను మొర్దెకై ఈ పని చేశాడు. అవి యూదులు తమ శత్రువులను నిశ్శేషం చేసిన రోజులు. అందుకని యూదులు పండుగ దినాలుగా జరుపుకోవాలి. తమ దుఃఖం సంతోషంగా మారిన ఆ నెలను కూడా వాళ్లు పండుగ మాసంగా జరుపుకోవాలి. వాళ్ల రోదన పండుగ దినాలుగా మారిన నెల అది. మొర్దెకై యూదులందరికీ లేఖలు వ్రాశాడు. అతను ఆ రోజులను ఆనందం వెల్లివిరిసే పండుగ దినాలుగా జరుపుకోమని యూదులకు ఆజ్ఞాపించాడు. వాళ్లా రోజుల్లో విందులు జరుపుకోవాలి, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవాలి, పేదలకు కానుకలివ్వాలి. యూదులు మొర్దెకై తమకు వ్రాసిన విధంగా చేసేందుకు అంగీకరించారు. తాము ప్రారంభించిన వేడుకలను కొనసాగించేందుకు సమ్మతించారు. అగాగీయుడైన హామ్మెదాతా కొడుకు హామాను యూదులందరికీ గర్భశతృవు. యూదులను నాశనం చేసేందుకుగాను వాళ్లకి వ్యతిరేకంగా అతనొక దుష్ట పథకం వేశాడు. యూదులను నాశనం చేసేందుకూ, నిర్మూలించేందుకూ అనువైన రోజును ఎంపిక చేసేందుకుగాను అతను చీట్లు వేశాడు. ఆ కాలంలో దాన్ని “పూరు” అనేవారు, అందుకే ఆ పండుగను “పూరీము” అంటారు హామాను దుష్కార్యాలు చేశాడు. ఎస్తేరు మహారాజు సన్నిధికి వెళ్లి, మాట్లాడింది. దానితో అతను కొత్త ఆజ్ఞలు పంపాడు. ఆ ఆజ్ఞలు హామాను దుష్ట పథకాలను భగ్నం చయడమేగాక, హామాను దుష్ట పథకంలోని దుష్కార్యాలు హామానుకీ, అతని కుటుంబ సభ్యులకీ సంభవించేలా చేశాయి! దానితో హామానూ, అతని కొడుకులూ ఉరికంబాలకు వేలాడదీయబడ్డారు. ఆ కాలంలో చీట్లను “పూరీము” అనేవారు, అందుకే ఈ పండుగను “పూరీము” అంటారు. మొర్దెకై ఒక లేఖ వ్రాసి, యూదులను ఈ పండుగ చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అందుకే, యూదులు ఏటా ఈ పండుగను రెండు రోజులపాటు జరుపుకోవడం ఆచారం అయింది. వాళ్లీ పండుగను తమకు గతంలో జరిగినవాటిని గుర్తుంచుకోగలిగేందుకు గాను జరుపుకుంటారు. యూదులూ, వాళ్లతో చేరేవాళ్లూ ఏటా యీ పండుగను సరైన కాలంలో, సక్రమమైన పద్ధతిలో జరుపుకుంటారు. ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ యీ రెండు రోజులనూ గుర్తుంచుకుంటాయి. వాళ్లీ పండుగను ప్రతి సామంత రాజ్యంలోనూ, ప్రతి పట్టణంలోనూ జరుపుకుంటారు. పూరీము రోజుల్లో పండుగ జరుపుకోవడాన్ని యూదులు ఎన్నడూ మానరు. యూదుల ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ ఈ పండుగను సదా గుర్తుంచుకుంటారు. పూరీమును గురించిన ఉత్తరువు లేఖను అబీహాయిలు కూతురు ఎస్తేరు మహారాణీ, యూదుడైన మొర్దెకైలు కలిసి వ్రాశారు. ఈ రెండవ లేఖ నిజమని నిరూపించేందుకుగాను దాన్ని వారు మహారాజు పూర్తి అనుమతి (ఆజ్ఞ)తో వ్రాశారు. మొర్దెకై ఆ లేఖలను అహష్వేరోషు మహారాజు వారి 127 సామంత రాజ్యాల్లోని యూదులందరికీ పంపాడు. ఈ పండుగ శాంతినీ, ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్నీ పెంపొందించాలని జనానికి మొర్దెకై సూచించాడు. పూరీము పండుగ సంబరాలు మొదలు పెట్టమని చెప్పేందుకుగాను మొర్దెకై ఈ లేఖలు వ్రాశాడు. ఈ కొత్త పండుగను ఎప్పుడు మొదలు పెట్టాలోకూడా అతను ఆ లేఖల్లో వాళ్లకి తెలియచేశాడు. యూదులకు యీ ఉత్తరువును యూదుడైన మొర్దెకై, మహారాణి ఎస్తేరూ పంపారు. తద్వారా వాళ్లు యీ రెండు రోజుల పండుగను తమ తరతరాల యూదుల కోసం స్థిరపరిచారు. తాము ఉపవాసాలు చేసి, జరిగిన చెడుగుల విషయంలో విలపించే ఇతర పండుగలను గుర్తు పెట్టుకొనేటట్లే యూదులు ఈ పండుగను కూడా గుర్తు పెట్టుకుంటారు. ఎస్తేరు ఉత్తరువు పూరీము పండుగ నియమాలను స్థిరపరచింది. ఆ విషయాలు గ్రంథాల్లో నమోదు చేయబడ్డాయి.
ఎస్తేరు 9:20-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మొర్దకై యీ సంగతులనుగూర్చి రాజైన అహష్వే రోషుయొక్క సంస్థానములన్నిటికి సమీపముననేమి దూరముననేమి నివసించియున్న యూదులకందరికి పత్రికలను పంపి –యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించుకొనుచు విందుచేసికొనుచు సంతోషముగానుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించినదానిని మొర్దకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని యొప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగా గీయుడగు హామాను యూదులను సంహరింప దలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని, పూరు, అనగా చీటి, వేయించియుండగా ఎస్తేరు, రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తల పెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి,వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయబడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అను పేరునుబట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటినిబట్టియు, ఈ సంగతినిబట్టియు, తాము చూచినదానినంతటినిబట్టియు తమమీదికి వచ్చినదానినిబట్టియు యూదులు ఈ రెండు దినములనుగూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమునుబట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడునట్లుగా ఆచరించెదమనియు, పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతివారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచి పోకుండునట్లు, తమమీదను, తమ సంతతివారిమీదను, తమతో కలిసికొనిన వారిమీదను ఇది యొక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమునుగూర్చి వ్రాయబడిన యీ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దకైయును ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దకైయును రాణియైన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానినిబట్టి వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని, అది తమమీదను తమ వంశపు వారిమీదను ఒక బాధ్యతయని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండుగదినములను స్థిరపరచుటకు అతడు అహష్వే రోషుయొక్క రాజ్యమందుండు నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న యూదులకందరికి వారి క్షేమము కోరునట్టియు, విశ్వాసార్థములగునట్టియు మాటలుగల పత్రికలు పంపెను. ఈలాగున ఎస్తేరుయొక్క ఆజ్ఞచేత ఈ పూరీముయొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను.