ఎస్తేరు 5:1-8
ఎస్తేరు 5:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మూడవ రోజు ఎస్తేరు తన రాజవస్త్రాలు ధరించి, రాజభవనం లోపలి ఆవరణంలో రాజు గది దగ్గర నిలబడింది. ద్వారానికి ఎదురుగా రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆవరణంలో ఎస్తేరు రాణి నిలబడి ఉండడం రాజు చూసినప్పుడు, అతనికి ఆమె పట్ల ఇష్టం కలిగి, తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు సమీపించి, ఆ దండం యొక్క అంచును ముట్టుకుంది. అప్పుడు రాజు, “ఎస్తేరు రాణి, ఏంటి విషయం? నీ మనవి ఏంటి? రాజ్యంలో సగమైనా సరే, నీకు ఇవ్వబడుతుంది” అని అన్నాడు. ఎస్తేరు జవాబిస్తూ, “రాజుకు ఇష్టమైతే, ఈ రోజు నేను రాజు కోసం సిద్ధం చేయించిన విందుకు మీరు హామానుతో పాటు రావాలి” అన్నది. రాజు తన సేవకులతో, “ఎస్తేరు అడిగింది జరిగేలా వెంటనే హామానును తీసుకురండి” అన్నాడు. కాబట్టి రాజు, హామాను, ఎస్తేరు చేయించిన విందుకు వెళ్లారు. వారు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు రాజు మరలా ఎస్తేరుతో, “నీ విన్నపం ఏంటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏంటి? రాజ్యంలో సగం అడిగినా సరే నీకు ఇస్తాను” అన్నాడు. ఎస్తేరు జవాబిస్తూ, “నా విన్నపం, నా మనవి ఇది: రాజుకు నాపై దయ కలిగి, నా అభ్యర్థనను మన్నించి నా మనవిని నెరవేరుస్తానంటే, నేను మీకోసం రేపు ఏర్పాటు చేసే విందుకు రాజైన మీరు, హామాను రావాలి. అప్పుడు నేను రాజు ప్రశ్నకు జవాబిస్తాను” అన్నది.
ఎస్తేరు 5:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మూడో రోజున ఎస్తేరు రాణివస్త్రాలు ధరించుకుని రాజభవనం ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలబడింది. రాజనగరు ద్వారానికి ఎదురుగా ఉన్న ఆవరణంలో రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎస్తేరురాణి ఆవరణంలో నిలబడి ఉండడం రాజు చూశాడు. అతనికి ఆమెపై ఇష్టం పుట్టింది. రాజు తన చేతిలోని బంగారపు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు. ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం కొనను తాకింది. రాజు “రాణివైన ఎస్తేరూ, నీకేమి కావాలి? నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యం కోరినా సరే, నీకు ఇచ్చేస్తాను” అన్నాడు. అప్పుడు ఎస్తేరు “రాజుకు సమంజసం అనిపిస్తే నేను రాజు కోసం ఏర్పాటు చేయించిన విందుకు రాజైన మీరూ హామానూ ఈ రోజు రావాలని నా కోరిక” అంది. అప్పుడు రాజు “ఎస్తేరు అడిగిన ప్రకారం జరిగేలా హామానును కూడా త్వరగా తెండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు, హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చారు. విందులో ద్రాక్షారసం పోస్తుండగా రాజు ఎస్తేరుతో “నీ కోరిక ఏమిటి? దాన్ని తీరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే, నీకు ఇస్తాను” అని చెప్పాడు. ఎస్తేరు ఇలా బదులు ఇచ్చింది “రాజైన మీకు నాపై అనుగ్రహం కలిగితే, నా మనవి ప్రకారం చేయడం రాజైన మీకు అనుకూలమైతే, రాజైన మీరూ హామానూ రేపు కూడా మీ కోసం నేను చేయించబోయే విందుకు రావాలి. మీ ప్రశ్నకు జవాబు అప్పుడు ఇస్తాను.”
ఎస్తేరు 5:1-8 పవిత్ర బైబిల్ (TERV)
మూడవ రోజున ఎస్తేరు ప్రత్యేకమైన దుస్తులు ధరించి, రాజ నగరులోని, రాజభవనమెదుటవున్న లోపలి భవనములో నిలిచింది. మహారాజు అక్కడ సింహాసనం మీద కూర్చుని వున్నాడు. అతను న్యాయస్థానంలోకి జనం ప్రవేశించే దిశగా చూపు తిప్పి కూర్చున్నాడు. అప్పుడు అతని దృష్టి లోపలి ఆవరణలో నిలిచివున్న ఎస్తేరుపై పడింది. ఆమెను అక్కడ చూచినంతనే మహారాజు మనస్సు సంతోష భరితమైంది. ఆయన తన చేతిలోని బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు రాజు దర్బారు మందిరంలోకి పోయి బంగారు దండపు కొనని తాకింది. అప్పుడు మహారాజు ఎస్తేరుతో ఇలా అన్నాడు: “మహారాణి, ఏమిటి నీ దిగులు? నువ్వు నన్ను కోరాలనుకున్నదేమిటో కోరుకో, నువ్వేమి కోరుకున్నా, అర్ధ రాజ్యమైనా ఇచ్చేస్తాను.” ఎస్తేరు, “నేను తమకీ, హామానుకీ ఒక విందు ఏర్పాటు చేశాను. దయచేసి మీరూ, హామానూ యీ రోజు నా విందుకి రావాలని నా కోరిక” అని అడిగింది. అప్పుడు మహారాజు సేవకులకు, “మహారాణి ఎస్తేరు కోర్కెను మేము తీర్చాలి. వెంటనే పోయి, హామానును తొందరగా తీసుకురండి” అని ఆజ్ఞాపించాడు. ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకి మహారాజూ, హామానూ వెళ్లారు. వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూండగా, మహారాజు ఎస్తేరును మళ్లీ ఇలా అడిగాడు: “ఎస్తేరూ, నువ్వేదైనా కోరుకో. అర్ధ రాజ్యమైనా సరే కోరుకో, నేను నీకిస్తాను.” అందుకు ఎస్తేరిలా సమాధానమిచ్చింది, “నేను మిమ్మల్ని కోరదలుచుకున్నది యిదీ మహారాజా! తమరికి నా మనవి అంగీకారమై, నేను కోరినది ఇవ్వాల నుకుంటే, రేపు నేనివ్వబోయే మరో విందుకి మీరూ, హామానూ తప్పక వేంచేయాలి. నా అసలు మనవి ఏమిటో నేను అప్పుడు విన్నవించుకుంటాను.”
ఎస్తేరు 5:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, రాజునగరుయొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనముమీద రాజు కూర్చుని యుండెను. రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండముయొక్క కొన ముట్టెను. రాజు – రాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకను గ్రహించెదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. ఎస్తేరు మాటప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవియ్యగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడునని చెప్పగా ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను– రాజవైన తమ దృష్టికి నా యెడల దయకలిగి నా మనవి చొప్పునను నా కోరికచొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయుననెను.