Skip to content

ఎస్తేరు 4:4-6 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 4:4-6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎస్తేరుయొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై–మొర్దకై కట్టుకొని యున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, కట్టించు కొనుటకై అతనియొద్దకు వస్త్రములు పంపెనుగాని అతడు వాటిని తీసికొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి–అది ఏమియైనది, ఎందుకైనది తెలిసి కొనుటకు మొర్దకైయొద్దకు వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెను. హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దకైయొద్దకు పోగా

ఎస్తేరు 4 TELUBSI

ఎస్తేరు 4:4-6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎస్తేరు దాసీలు, ఆమె దగ్గరున్న నపుంసకులు వచ్చి జరిగిన సంగతి ఆమెకు తెలియజేశారు. రాణికి చాలా దిగులు కలిగింది. మొర్దెకై కట్టుకున్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి, అతడు కట్టుకోవడానికి బట్టలు పంపించిందిగానీ అతడు వాటిని తీసుకోలేదు. అప్పుడు ఎస్తేరు తనను సేవించడానికి రాజు నియమించిన నపుంసకుల్లో హతాకు అనే వాణ్ణి పిలిచి ఏమి జరిగిందో అదంతా ఎందుకో తెలుసుకుని రమ్మని పంపింది. హతాకు రాజద్వారం ఎదురుగా ఉన్న పట్టణ కూడలిలో మొర్దెకై దగ్గరికి వచ్చాడు.

ఎస్తేరు 4 IRVTEL

ఎస్తేరు 4:4-6 TERV (పవిత్ర బైబిల్)

ఎస్తేరు పరిచారికలు, నపుంసకులు ఆమె దగ్గరికి వెళ్లి, ఆమెకి మొర్దెకై గురించి చెప్పారు. దానితో, ఎస్తేరు మహారాణి గాభరా చెందింది, బాగా విచారగ్రస్తి అయింది. విషాద సూచకమైన దుస్తులు వదలి, వాటి స్థానంలో వేసుకొనేందుకు మంచి దుస్తులు ఆమె మొర్దెకైకి పంపింది. కాని, అతను ఆ దుస్తులు ధరించేందుకు నిరాకరించాడు. హతాకు అనే నపుంసకుడు ఎస్తేరు ప్రధాన సేవకుడు. ఎస్తేరు అతన్ని మొర్దెకై వద్దకు పోయి అతన్ని కలవరపరుస్తున్నదేమిటో, దానికి కారణం ఏమిటో కనుక్కోమని పంపింది. రాజభవన ద్వారం ముందర నగరంలోని, ఖాళీ స్థలంలో వున్న మొర్దెకైని హతాకు పోయి కలిశాడు.

ఎస్తేరు 4 TERV

ఎస్తేరు 4:4-6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎస్తేరు రాణి యొక్క నపుంసకులు, చెలికత్తెలు వచ్చి మొర్దెకై గురించి చెప్పినప్పుడు ఆమె తీవ్ర వేదనకు గురైంది. గోనెపట్ట తీసివేయమని చెప్పి కట్టుకోవడానికి అతనికి బట్టలు పంపించింది, కాని అతడు వాటిని తీసుకోలేదు. అప్పుడు ఎస్తేరు, మొర్దెకైను అంత బాధ పెడుతున్న విషయం ఏమిటో తెలుసుకోమని రాజు ఆమె కోసం నియమించిన నపుంసకులలో హతాకు అనే అతన్ని పంపింది. కాబట్టి హతాకు రాజభవన ద్వారం ఎదురుగా నగర వీధిలో ఉన్న మొర్దెకై దగ్గరకు వెళ్లాడు.

ఎస్తేరు 4 TSA