ఎస్తేరు 4:1-3
ఎస్తేరు 4:1-3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మొర్దెకై జరిగిందంతా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని వేదనతో గట్టిగా ఏడుస్తూ పట్టణంలోనికి వెళ్లాడు. అయితే అతడు రాజభవన ద్వారం వరకు మాత్రమే వెళ్లాడు, ఎందుకంటే గోనెపట్ట కట్టుకున్న వారెవరికి భవనం లోనికి వెళ్లడానికి అనుమతి లేదు. రాజు శాసనం, ఆదేశం వెళ్లిన ప్రతి సంస్థానంలో ఉన్న యూదులంతా ఉపవాసం ఉండి ఏడుస్తూ వేదనతో తీవ్రమైన దుఃఖంతో ఉన్నారు. చాలామంది గోనెపట్ట కట్టుకుని బూడిద పోసుకొని ఉన్నారు.
ఎస్తేరు 4:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జరిగినదంతా మొర్దెకై విన్నాడు. అతడు తన బట్టలు చింపుకుని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకున్నాడు. నగరం నడిబొడ్డుకు వెళ్లి మహా శోకంతో విలపించాడు. అతడు రాజ భవన ద్వారం వరకూ మాత్రమే వచ్చాడు. ఎందుకంటే గోనె కట్టుకున్న వాడు రాజు ద్వారం గుండా ప్రవేశించకూడదు అనే ఆజ్ఞ ఉంది. రాజాజ్ఞ, శాసనం అందిన సంస్థానాలన్నిటిలో అక్కడి యూదులంతా దుఃఖంలో మునిగిపోయి ఉపవాసం ఉంటూ గొప్ప శోకంతో, రోదనతో ఉన్నారు. చాలా మంది గోనె కట్టుకుని బూడిద పోసుకుని పడి ఉన్నారు.
ఎస్తేరు 4:1-3 పవిత్ర బైబిల్ (TERV)
మొర్దకై జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. యూదులకు వ్యతిరేకంగా మహారాజు ఆజ్ఞలను గురించి విన్న మొర్దెకై తన బట్టలు చింపుకొని, తన నెత్తిమీద బూడిద పోసుకొని, విషాద సూచకమైన దుస్తులు ధరించి, నగరంలోకి పోయిగట్టిగా ఏడ్వ నారంభించాడు. కాని, మొర్దెకై రాజభవన ద్వారం వరకు మాత్రమే పోగలిగాడు. అయితే, విషాద సూచక దుస్తులు ధరించినవారెవరూ ఆ ద్వారంలో ప్రవేశించేందుకు అనుమతింపబడరు. రాజాజ్ఞ చేరిన ప్రతి సామంత రాజ్యంలోనూ యూదుల్లో విచారం అలుముకొంది. ఏడ్పులు చెలరేగాయి. వాళ్లు శోకాలు పెడుతూ, ఉపవాసాలుండసాగారు. చాలామంది యూదులు నెత్తిన బూడిద పోసుకొని, సంతాప సూచక దుస్తులు వేసుకొని నేలమీద పడి వున్నారు.
ఎస్తేరు 4:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జరిగినదంతయు తెలియగానే మొర్దకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహా శోకముతో రోద నముచేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను; గోనె కట్టుకొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజుయొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాస ముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి, అనేకులు గోనెను బూడిదెను వేసికొని పడియుండిరి.