ఎఫెసీయులకు 6:13-17
ఎఫెసీయులకు 6:13-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అందుకే ఆపద రోజున మీరు వారిని ఎదిరించడానికి, శక్తిమంతులుగా నిలబడడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. స్థిరంగా నిలబడి, మీ నడుములకు సత్యమనే నడికట్టు కట్టుకుని, నీతి అనే కవచాన్ని ధరించుకొని, పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే చెప్పులు వేసుకుని నిలబడండి. వీటితో పాటు, విశ్వాసమనే డాలు పట్టుకోండి. దీనితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు. రక్షణ అనే శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి.
ఎఫెసీయులకు 6:13-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.
ఎఫెసీయులకు 6:13-17 పవిత్ర బైబిల్ (TERV)
కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు. కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి.
ఎఫెసీయులకు 6:13-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.