ప్రసంగి 9:11-18
ప్రసంగి 9:11-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సూర్యుని క్రింద మరొకటి కూడ నేను గమనించాను: వేగంగా ఉన్నవారే పందెం గెలవలేరు బలంగా ఉన్నవారే యుద్ధాన్ని జయించలేరు, జ్ఞానులకు ఆహారం లభించదు తెలివైన వారికే సంపద ఉండదు చదువుకున్న వారికి దయ లభించదు; కాని సమయాన్ని బట్టే అందరికి అవకాశాలు వస్తాయి. అంతేకాక, వాటి సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు: చేపలు వలలో పట్టబడినట్లు, పక్షులు వలలో చిక్కుకున్నట్లు హఠాత్తుగా వారి మీద పడే చెడు కాలంలో ప్రజలు చిక్కుపడతారు. నేను సూర్యుని క్రింద నన్ను బాగా ఆకట్టుకొన్న జ్ఞానం యొక్క ఈ ఉదాహరణను నేను చూశాను: ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఉన్న ఒక చిన్న పట్టణం ఉండేది. ఒక శక్తివంతమైన రాజు వచ్చి దానిని చుట్టుముట్టి, దానికి ఎదురుగా భారీ ముట్టడి దిబ్బలు కట్టాడు. ఇప్పుడు ఆ పట్టణంలో ఉండే ఒక పేదవాడు తన జ్ఞానంతో ఆ పట్టణాన్ని కాపాడాడు. కానీ ఆ పేదవాన్ని ఎవరూ జ్ఞాపకం ఉంచుకోలేదు. కాబట్టి నేను ఇలా అనుకున్నాను, “బలం కన్నా జ్ఞానం మేలు” కానీ ఆ పేదవాడి జ్ఞానం తృణీకరించబడింది, అతని మాటలు ఇకపై పట్టించుకోరు. మూర్ఖుల పాలకుడి కేకల కంటే జ్ఞానులు మెల్లగా చెప్పే మాటలు వినడం మంచిది. యుద్ధాయుధాలకంటె జ్ఞానం మేలు, కాని ఒక్క పాపి అనేకమైన మంచి వాటిని నాశనం చేస్తాడు.
ప్రసంగి 9:11-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను ఇంకా ఆలోచిస్తుండగా సూర్యుని కింద జరిగేది నాకు అర్థమైంది ఏమంటే, వేగం గలవారు పరుగులో గెలవరు. బలమైన వారికి యుద్ధంలో విజయం దొరకదు. తెలివైన వారికి ఆహారం లభించదు. అవగాహన ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం కలగదు. జ్ఞానవంతులకు అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టం కొద్దీ కాలవశాన అందరికీ కలుగుతున్నాయి. తమకాలం ఎప్పుడు వస్తుందో మనుషులకు తెలియదు. చేపలు తమకు మరణకరమైన వలలో చిక్కుకున్నట్టు, పిట్టలు వలలో పట్టుబడినట్టు, హఠాత్తుగా ఏదో ఒక చెడ్డ సమయం తమ మీదికి వచ్చినప్పుడు వారు చిక్కుకుంటారు. ఇంకా జరుగుతున్న దాన్ని చూసినప్పుడు నేను అది జ్ఞానం అనుకున్నాను. అది నా దృష్టికి గొప్పదిగా ఉంది. ఏమంటే కొద్దిమంది నివసించే ఒక చిన్న పట్టణం ఉంది. దానిమీదికి ఒక గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడించి దాని ఎదురుగా గొప్ప బురుజులు కట్టించాడు. అయితే అందులో ఉండే ఒక బీదవాడు తన తెలివితో ఆ పట్టణాన్ని కాపాడాడు. అయినా ఎవరూ అతణ్ణి జ్ఞాపకం ఉంచుకోలేదు. కాబట్టి నేనిలా అనుకున్నాను “బలం కంటే తెలివి శ్రేష్ఠమేగాని బీదవారి తెలివిని, వారి మాటలను ఎవరూ లెక్కచేయరు.” మూర్ఖులను పాలించేవాడి కేకలకంటే మెల్లగా వినిపించే జ్ఞానుల మాటలు మంచివి. యుద్ధాయుధాల కంటే తెలివి మంచిది. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు.
ప్రసంగి 9:11-18 పవిత్ర బైబిల్ (TERV)
ఈ ప్రపంచంలో నేను చూసిన సక్రమం కాని విషయాలు ఇంకా ఉన్నాయి: అతి వేగంగా పరిగెత్తేవాడు పరుగు పోటీలో ఎల్లప్పుడూ గెలవలేడు. అత్యంత బలీయమైన సైన్యమైనా యుద్ధంలో ఎల్లప్పుడూ గెలవలేదు. మిక్కిలి వివేకవంతుడు కూడా తాను సంపాదించిన ఆహారాన్ని ఎల్లప్పుడూ పొందలేడు. మిక్కిలి చురుకైనవాడు కూడా సంపదను ఎల్లప్పుడూ సాధించుకోలేడు. విద్యావంతుడికైనా ఎల్లప్పుడూ తనికి యోగ్యమైన ప్రశంస లభ్యంకాదు. చెడు కాలము దాపురించినప్పుడు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. తనకు మరు క్షణంలో ఏమి జరగనున్నదో మనిషికి ఎన్నడూ తెలియదు. మనిషి వలలో చిక్కిన చేపలాంటివాడు. ముందేమి జరగబోతున్నదీ ఆ చేపకి తెలియదు. అతను పంజరంలో చిక్కిన పక్షిలాంటివాడు, ఆ పక్షికి ముందేమి జరగనున్నది తెలియదు. అదే విధంగా, మనిషి కూడా తనకి ఆకస్మికంగా సంభవించే కీడుల బోనులో చిక్కుకుంటాడు. ఈ భూమిమీద ఒక వ్యక్తి వివేకవంతమైన ఒక పని చెయ్యడం కూడా నేను చూశాను. అది చాలా ముఖ్యమైన పని అని నాకు అనిపించింది. స్వల్ప జనాభా కలిగిన ఒక చిన్న పట్టణం వుంది. ఒక గొప్ప రాజు ఆ పట్టణం మీదకి దండెత్తి, దాని చుట్టూ తన సేనలను నిలిపాడు. కాని, ఆ పట్టణంలో ఒక జ్ఞాని వున్నాడు. ఆ జ్ఞాని పేదవాడు. అయితే, అతను తన జ్ఞానాన్ని తన పట్టణాన్ని కాపాడేందుకు వినియోగించాడు. అన్నీ ముగిసిపోయాక, జనం అతన్ని గురించి మరచిపోయారు. అయినప్పటికీ, ఆ జ్ఞానం ఆ బలం కంటె మెరుగైనదని నేనంటాను. ఆ జనం ఆ పేదవాని జ్ఞానం గురించి మరిచిపోయారు. అతని మాటలను ఆ జనం పట్టించుకోవడం మానేశారు. (అయినా కూడా ఆ జ్ఞానం మెరుగైనదని నేను నమ్ముతాను.) మూర్ఖుడైన ఒక రాజు వేసే కేకల కంటె ఒక జ్ఞాని పలికే మెల్లని పలుకులు మరెంతో మెరుగైనవి. యుద్ధంలో ఆయుధాల కంటె జ్ఞానం గొప్పది. అయితే ఒక్క మూర్ఖుడు ఎన్ని మంచి పనుల్నైనా పాడు చేయగలడు.
ప్రసంగి 9:11-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయమొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుటవలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి. తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి యిది జ్ఞానమని తలంచితిని, యిది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దానియందు కొద్ది మంది కాపురముండిరి; దానిమీదికి గొప్పరాజు వచ్చి దాని ముట్టడివేసి దానియెదుట గొప్ప బురుజులు కట్టించెను; అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించెను, అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు. కాగా నేనిట్లను కొంటిని–బలముకంటె జ్ఞానము శ్రేష్ఠమేగాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకలకంటె మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్ఠములు. యుద్ధా యుధములకంటె జ్ఞానము శ్రేష్ఠము; ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును.