ప్రసంగి 8:2-15
ప్రసంగి 8:2-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నీవు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కాబట్టి రాజాజ్ఞకు లోబడమని నేను చెప్తున్నాను. రాజు సముఖం నుండి తొందరపడి వెళ్లి పోవద్దు. అతడు తనకు ఏది ఇష్టమైతే అది చేస్తాడు కాబట్టి చెడ్డపనులు చేయవద్దు. రాజు మాట మహోన్నతమైనది, “మీరు నీవు ఏం చేస్తున్నావు?” అని రాజును ఎవరు అడగగలరు? అతని ఆజ్ఞను పాటించే వారెవరికి ఏ హాని జరగదు, ఏది సరియైన సమయమో న్యాయమో జ్ఞానుల హృదయానికి తెలుసు. ఒక వ్యక్తి కష్టం అతని మీద అధిక భారంగా ఉన్నప్పటికీ, ప్రతి దానికి సరియైన సమయం విధానం ఉంది. భవిష్యత్తు గురించి ఎవరికి తెలియదు కాబట్టి, ఏది రాబోతుందో ఒకరికి ఎవరు చెప్పగలరు? గాలిని అదుపుచేసే శక్తి ఎవరికీ లేదు, కాబట్టి తమ మరణ సమయం మీద ఎవరికీ అధికారం లేదు. ఎలాగైతే యుద్ధ సమయంలో ఎవరూ విడుదల చేయబడరో, అలాగే దుర్మార్గం దానిని ఆచరించేవారిని విడుదల చేయదు. ఇవన్నీ నేను చూశాను, సూర్యుని క్రింద చేసిన ప్రతిదానికీ నేను నా మనస్సులో ఆలోచించాను. ఒకరు ఇతరులపై ఉన్న అధికారంతో తనకే హాని తెచ్చుకుంటున్నారు. పవిత్ర స్థలానికి తరచూ వెళ్లేవారు ఇప్పుడు ఎక్కడ నేరాలు చేశారో అదే పట్టణంలో పొగడబడతారు. అలాంటి దుర్మార్గులు సక్రమంగా పాతిపెట్టబడడం నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే. చేసిన నేరానికి శిక్ష త్వరగా పడకపోతే ప్రజలు భయం లేకుండా చెడుపనులు చేస్తారు. వంద నేరాలకు పాల్పడిన దుర్మార్గుడు ఎక్కువకాలం జీవించినప్పటికీ, దేవునికి భయపడుతూ ఆయన పట్ల భక్తిగలవారి స్థితి మేలు అని నాకు తెలుసు. దుర్మార్గులు దేవునికి భయపడరు కాబట్టి, వారు అభివృద్ధి చెందరు, వారి రోజులు నీడలా ధీర్ఘకాలం ఉండవు. భూమిపై అర్థరహితమైనది మరొకటి ఉంది: దుర్మార్గులు పొందవలసిన దాన్ని నీతిమంతులు, నీతిమంతులు పొందవలసిన దాన్ని దుర్మార్గులు పొందుతున్నారు. ఇది కూడా అర్థరహితమే అని నేను చెప్తున్నాను. కాబట్టి జీవితాన్ని ఆనందించడాన్ని నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే సూర్యుని క్రింద ఉన్నవారు తిని త్రాగి సంతోషించడం కన్నా గొప్పది లేదు. అప్పుడు దేవుడు సూర్యుని క్రింద వారికి ఇచ్చిన జీవితకాలంలో వారి కష్టంలో వారికి తోడుగా ఉండేది ఆ సంతోషమే.
ప్రసంగి 8:2-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వు దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నట్టుగా రాజు ఆజ్ఞలకు లోబడి నడుచుకో. రాజు సన్నిధి నుండి హడావుడిగా బయటికి వెళ్లకు. అతడు అనుకున్న దానంతటినీ జరిగించగలడు కాబట్టి చెడు కార్యాల్లో పాలు పుచ్చుకోకు. రాజుల ఆజ్ఞ అధికారంతో కూడినది. “నువ్వు చేసేది ఏమిటి?” అని రాజును అడిగే వాడెవడు? రాజుకు లోబడేవాడికి ఏ కీడూ జరగదు. ఏది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో జ్ఞానుల హృదయాలకు తెలుసు. ప్రతి దానికీ ఒక స్పందన, ఒక సమయం నియామకమై ఉంది. అలా లేకపోతే మనుష్యులకు జరిగే కీడు అధికమైపోతుంది. జరగబోయేది మనుషులకి తెలియదు. రాబోయే దాని గురించి ఎవరు చెప్పగలరు? ఊపిరి విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు. తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు. యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు. దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు. సూర్యుని కింద జరిగే ప్రతి పని గురించి నేను తీవ్రంగా ఆలోచించినప్పుడు ఇదంతా నాకు తెలిసింది. ఒకడు మరొకడిపై ఉన్న అధికారంతో వాడికి కీడు జరిగిస్తాడు. దుష్టులను సక్రమంగా పాతిపెట్టడం, పరిశుద్ధ స్థలం నుండి తీసుకుపోవడం, వారు ఎక్కడ చెడ్డ పనులు చేశారో అదే పట్టణస్థులు వారిని పొగడడం నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనమే. చెడు పనికి తగిన శిక్ష వెంటనే కలగకపోవడం చూసి మనుషులు భయం లేకుండా చెడ్డ పనులు చేస్తారు. ఒక దుర్మార్గుడు వంద సార్లు పాపం చేసి దీర్ఘకాలం జీవించినా, దేవునిలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని గౌరవించేవారు క్షేమంగా ఉంటారని నాకు తెలుసు. దుర్మార్గులు దేవుని సన్నిధికి భయపడరు కాబట్టి వారికి క్షేమం ఉండదు. వారి జీవితకాలం అశాశ్వతమైన నీడలాగా ఉంటుంది. సూర్యుని కింద మరొక నిష్ప్రయోజనమైంది జరుగుతూ ఉంది. అదేమంటే భక్తిహీనులకు జరిగినట్టు నీతిమంతుల్లో కొందరికీ నీతిమంతులకు జరిగినట్టు భక్తిహీనుల్లో కొందరికీ జరుగుతున్నది. ఇది కూడా నిష్ప్రయోజనమే అని నేను అనుకున్నాను. అన్నపానాలు పుచ్చుకుని సంతోషించడం కంటే మనుషులకు మంచి విషయమేమీ లేదు. మనిషి పని చేసి కష్టపడాలని దేవుడు వారికి నియమించిన అతని జీవిత కాలమంతా వారికి తోడుగా ఉండేది వారి సంతోషమే.
ప్రసంగి 8:2-15 పవిత్ర బైబిల్ (TERV)
నేను చెప్పేదేమిటంటే, నీవు ఎల్లప్పుడూ రాజాజ్ఞను పాటింలించాలి. నీవు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కనుక నీవీ పని చెయ్యాలి. రాజుకు సలహాలు ఇచ్చేందుకు భయపడకు. చెడ్డదాన్ని దేన్ని సమర్థించకు. కాని ఒక విషయం గుర్తుంచుకో: రాజు తనకు సంతోషం కలిగించే ఆజ్ఞలు ఇస్తాడు. రాజుకు ఆజ్ఞలు ఇచ్చే అధికారం ఉంది. రాజు ఏమి చెయ్యాలో అతనికి ఎవరూ చెప్పలేరు. రాజాజ్ఞను పాటించే వ్యక్తి క్షేమంగా వుంటాడు. అయితే, వివేకవంతుడికి ఈ పని చేయవలసిన సరైన తరుణం ఏదో, ఆ సరైన పని ఎప్పుడు చెయ్యాలో తెలుస్తుంది. మనిషి ఏ పనైనా చెయ్యవలసినప్పుడు, దానికి సరైన సమయం, సరైన మార్గం వుంటాయి. (ప్రతి వ్యక్తీ ప్రయత్నించి, తాను చెయ్యవలసింది ఏమిటో నిర్ణయించుకోవాలి.) తనకి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమి జరుగుతుందో తెలియనప్పుడు కూడా అతనీ పని చెయ్యాలి. ఎందుకంటే, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఏ ఒక్కరూ చెప్పలేరు గనుక. తన ఆత్మ తొలగిపోకుండా నిలుపుకోగల శక్తి ఏ ఒక్కరికి లేదు. తన మృత్యువును ఆపు చేయగల శక్తి ఏ ఒక్కరికీ లేదు. యుద్ధ సమయంలో తన ఇష్టంవచ్చిన చోటికి పోగల స్వేచ్ఛ సైనికుడికి ఎలా వుండదో, అలాగే ఒక వ్యక్తి పాపం చేస్తే, ఆ పాపం అతన్ని స్వేచ్ఛగా వుండనివ్వదు. నేనీ విషయాలన్నీ గమనించాను. ఈ ప్రపంచంలో జరిగే విషయాలను గురించి నేను తీవ్రంగా ఆలోచించాను. మనుష్యులు ఎప్పుడూ యితరుల మీద అధికారం చలాయించే శక్తిని సంపాదించుకునేందుకు తంటాలు పడుతూ ఉంటారన్న విషయం నేను గమనించాను. ఇది వాళ్లకి చెరుపు చేస్తుంది. దుర్మార్గులకు ఘనంగా అంత్యక్రియలు జరగడం కూడా నేను చూశాను. అంత్యక్రియలు ముగించి, మనుష్యులు ఇళ్లకి తిరిగివెళ్లేటప్పుడు, చనిపోయిన దుర్మార్గుణ్ణి గురించి మంచి మాటలు చెప్పడం నేను విన్నాను. ఆ దుర్మార్గులు అనేకానేకమైన చెడ్డ పనులు చేసిన పట్టణాల్లో కూడా అర్థరహితమైన పని జరిగింది. అది అర్థరహితమైనది. కొన్ని సందర్భాల్లో, మనుష్యులు చేసిన చెడ్డ పనులకుగాను, వాళ్లు వెంటనే శిక్షింపబడరు. శిక్ష తాపీగా వస్తుంది. దానితో, యితరులకు కూడా చెడ్డ పనులు చెయ్యాలన్న కోర్కె కలుగుతుంది. ఒకానొక పాపి నూరు చెడు పనులు చేసియుండవచ్చు, అతను దీర్ఘాయుష్షు కలిగియుండవచ్చు. అయినప్పటికీ, దేవుడిపట్ల విధేయత, గౌరవం కలిగివుండటం మేలన్న విషయం నాకు తెలుసు. దుర్మార్గులు దేవుణ్ణి గౌరవించరు. అందుకని, నిజంగానే వాళ్లకి మంచి ఫలితాలు లభించవు. ఆ దుర్మార్గులు దీర్గకాలం జీవించరు. (సూర్యుడు క్రిందకి వాలిన కొద్ది) పొడుగయ్యే నీడల్లాగా వాళ్ల జీవితాలు దీర్ఘంకావు. న్యాయంగా కనిపించని మరొకటి కూడా భూమి మీద సంభవిస్తూ ఉంటుంది. చెడ్డవాళ్లకి చెడు, మంచి వాళ్లకి మంచి జరగాలి. కాని, కొన్ని సందర్భాల్లో మంచి వాళ్లకి చెడు, చెడ్డవాళ్లకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇది సరైనది కాదు. అందుకని, జీవితాన్ని హాయిగా అనుభవించడం మరింత మెరుగైనదని నేను తీర్మానించుకున్నాను. ఈ ప్రపంచంలో మనుష్యులు చెయ్యగలిగిన అత్యుత్తమమైన పనేమిటంటే, తినడం, తాగడం, జీవితాన్ని హాయిగా అనుభవించడమే. కనీసం అలా చేస్తేనైనా, తమ జీవితకాలంలో దేవుడు తమకిచ్చిన కఠిన శ్రమని మనుష్యులు సరదాగా సంతోషంగా చేసేందుకు అది తోడ్పడుతుంది.
ప్రసంగి 8:2-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవు దేవునికి ఒట్టుపెట్టుకొంటివని జ్ఞాపకము చేసికొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పు చున్నాను. రాజుల సముఖమునుండి అనాలోచనగా వెళ్లకుము; వారు తాము కోరినదెల్ల నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకుము. రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయుపని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు; సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది; లేనియెడల మనుష్యులుచేయు కీడు బహు భారమగును. సంభవింప బోవునది నరులకు తెలియదు; అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయువారెవరు? గాలి విసరకుండ చేయుటకు గాలిమీద ఎవరికిని అధికారములేదు; మరణదినము ఎవరికిని వశముకాదు. ఈ యుద్ధమందు విడుదల దొర కదు; దౌష్ట్యము దాని ననుసరించువారిని తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనినిగూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతినొందుటయు, న్యాయముగా నడుచుకొన్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థులవలన మరువ బడియుండుటయు నేను చూచితిని; ఇదియు వ్యర్థమే. దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్ క్రియలు చేయుదురు. పాపాత్ములు నూరు మారులు దుష్కార్యముచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులుకలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును. వ్యర్థమైనది మరియొకటి సూర్యునిక్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది; నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది; ఇదియును వ్యర్థమే అని నేననుకొంటిని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుటకంటె మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని; బ్రదికి కష్టపడ వలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది.