ప్రసంగి 7:1-6

ప్రసంగి 7:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది, జన్మదినం కంటే మరణ దినం మంచిది. విందు జరిగే వారి ఇళ్ళకు వెళ్లే కంటే ఏడ్చేవారి ఇళ్ళకు వెళ్లడం మంచిది. ఎందుకంటే మరణం ప్రతి ఒక్కరికీ వస్తుంది; జీవించి ఉన్నవారు దీనిని హృదయపూర్వకంగా స్వీకరించాలి. నవ్వడం కంటే దుఃఖపడడం మేలు, ఎందుకంటే విచారంగా ఉన్న ముఖం గుండెకు మంచిది. జ్ఞానుల హృదయం దుఃఖపడే వారి గృహంలో ఉంటుంది కాని బుద్ధిహీనుల మనస్సు సంతోషించే వారి ఇంట్లో ఉంటుంది. మూర్ఖుల పాటలు వినడంకంటే, జ్ఞానుల గద్దింపు వినడం మేలు. కుండ క్రింద చిటపటమనే ముండ్ల కంప మంట ఎలాంటిదో, మూర్ఖుల నవ్వు అలాంటిదే. అది కూడా అర్థరహితమే.

ప్రసంగి 7:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు. ఒకడు పుట్టిన రోజు కంటే చనిపోయిన రోజే మేలు. విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే దుఃఖంతో ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్ళడం మేలు. ఎందుకంటే చావు అందరికీ వస్తుంది కాబట్టి జీవించి ఉన్నవారు దాన్ని గుర్తు పెట్టుకోవాలి. నవ్వడం కంటే ఏడవడం మేలు. ఎందుకంటే దుఃఖ ముఖం తరవాత హృదయంలో సంతోషం కలుగుతుంది. జ్ఞానులు తమ దృష్టిని దుఃఖంలో ఉన్నవారి ఇంటి మీద ఉంచుతారు. అయితే మూర్ఖుల ఆలోచనలన్నీ విందులు చేసుకొనే వారి ఇళ్ళపై ఉంటాయి. మూర్ఖుల పాటలు వినడం కంటే జ్ఞానుల గద్దింపు వినడం మేలు. ఎందుకంటే మూర్ఖుల నవ్వు బాన కింద చిటపట శబ్దం చేసే చితుకుల మంటలాంటిది. ఇది కూడా నిష్ప్రయోజనం.

ప్రసంగి 7:1-6 పవిత్ర బైబిల్ (TERV)

మంచి పరిమళ ద్రవ్యంకంటె మంచి పేరు (గౌరవం) కలిగివుండటం మేలు. జన్మ దినం కంటె మరణ దినం మేలు. విందుకి పోవడంకంటె, మరణించినవారి అంత్య క్రియలకి హాజరవడం మేలు. ఎందుకంటే, పుట్టిన వాళ్లెవరూ గిట్టకమానరు, బ్రతికున్న ప్రతివాడు ఈ విషయం గుర్తుంచుకోవాలి. నవ్వుకంటె దుఃఖం మరింత మేలు, ఎందుకంటే, మన ముఖం విచారగ్రస్తమైనప్పుడు, మన మనస్సు మెరుగవుతుంది. అవివేకి సరదాగా హాయిగా గడపాలని మాత్రమే ఆలోచిస్తాడు, కాని, వివేకి మృత్యువు గురించి ఆలోచిస్తాడు. మూర్ఖుడి పొగడ్త పొందడం కంటె, వివేకిచే విమర్శింప బడటం మేలు. మూర్ఖుల నవ్వులాటలు కుండ కింద చిటపట మండే ముళ్లలా ఉంటాయి. (కుండ వేడైనా ఎక్కకముందే, ఆ ముళ్లు చురచుర మండి పోతాయి.) ఇది కూడా నిష్ర్పయోజనమే.

ప్రసంగి 7:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సుగంధతైలముకంటె మంచిపేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు. విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును. బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము.