ప్రసంగి 5:8-10
ప్రసంగి 5:8-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒక ప్రాంతంలో పేదలను అణచివేయడం, న్యాయాన్ని హక్కులను పాటించకపోవడం లాంటివి నీవు చూస్తే ఆశ్చర్యపడవద్దు; ఎందుకంటే ఒక అధికారి మీద పైఅధికారులు ఉంటారు, వారందరిపైన ఉన్నతాధికారులు ఉంటారు. దేశం అభివృద్ధి చెందినప్పుడు అందరు పంచుకుంటారు; స్వయాన రాజు పొలాల నుండి లబ్ది పొందుతారు. డబ్బును ప్రేమించేవారు ఆ డబ్బుతో తృప్తి పడరు; సంపదను ప్రేమించేవారు తమ ఆదాయంతో ఎప్పుడూ సంతృప్తి చెందరు. ఇది కూడా అర్థరహితము.
ప్రసంగి 5:8-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒక రాజ్యంలో బీదవారిని బాధించడం, ధర్మాన్ని, న్యాయాన్ని బలవంతంగా అణచివేయడం నీకు కనిపిస్తే ఆశ్చర్యపోవద్దు. అధికారంలో ఉన్నవారికంటే ఎక్కువ అధికారం గలవారున్నారు. వారందరి పైన ఇంకా ఎక్కువ అధికారం గలవాడు ఉన్నాడు. ఏ దేశంలో రాజు భూమి గురించి శ్రద్ధ వహిస్తాడో ఆ దేశానికి అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది. డబ్బు కోరుకునే వాడికి ఆ డబ్బుతో తృప్తి కలగదు. ఐశ్వర్యం కోరుకునేవాడు ఇంకా ఎక్కువ ఆస్తిని కోరుకుంటాడు. ఇది కూడా నిష్ప్రయోజనమే.
ప్రసంగి 5:8-10 పవిత్ర బైబిల్ (TERV)
ఏ దేశమైనా తీసుకో. బీదవాళ్లు బలవంతముగా కఠిన పని చేయడం నీవు చూడవచ్చు. బీదల విషయంలో ఇది అన్యాయ వర్తన అని, బీదల హక్కులకు ఇది విరుద్ధమని నీవు చూడగలుగుతావు. అయితే, నీవు యిందుకు ఆశ్చర్యపడబోకు! వాళ్లచేత అలా బలవంతాన పనిచేయించే అధికారి పైన, మరో అధికారి ఉంటాడు. ఈ ఇద్దరు అధికారులపైనా పెత్తనం చలాయించి పనిచేయించే మరో పై అధికారి వుంటాడు. రాజు కూడా బానిసే. అతని రాజ్యం అతనికి యజమాని. డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు తనకు ఉన్న డబ్బుతో ఎన్నడూ తృప్తి చెందడు. ఐశ్వర్యాన్ని ప్రేమించేవాడు తనికు ఇంకా ఇంకా వచ్చి పడినా తృప్తి చెందడు. ధన వ్యామోహం కూడా అర్థరహిత మైనదే.
ప్రసంగి 5:8-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవా రున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా నున్నాడు. ఏ దేశములో రాజు భూమివిషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వవిషయములయందు మేలు కలుగును. ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తి నొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు; ఇదియు వ్యర్థమే.