ప్రసంగి 2:24-26
ప్రసంగి 2:24-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మనుష్యులు అన్నపానాలు పుచ్చుకుని తమ కష్టార్జితంతో మేలుపొందడం కంటే క్షేమం ఇంకేముంది? అయినా ఇది కూడా దేవుని వలనే కలుగుతుందని నేను తెలుసుకున్నాను. ఆయన అనుమతి లేకుండా, ఎవరు తినగలరు ఆనందాన్ని పొందగలరు? తనను సంతోషపెట్టే వారికి దేవుడు జ్ఞానం, తెలివి, సంతోషాన్ని ఇస్తారు, కాని దేవున్ని సంతోషపెట్టే వారికి కోసం సంపదను పోగుచేసే పని ఆయన పాపికి ఇస్తారు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే.
ప్రసంగి 2:24-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్టమైంది లేదు. అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను. ఆయన అనుమతి లేకుండా భోజనం చేయడం, సంతోషించడం ఎవరికి సాధ్యం? ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి సంతోషింప జేస్తారో వాడికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ఇస్తాడు. అయితే తనకిష్టమైన వాడికి ఇవ్వడానికి కష్టపడి పోగుచేసే పనిని ఆయన పాపాత్మునికి అప్పగిస్తాడు. ఇది కూడా నిష్ప్రయోజనం, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఉంది.
ప్రసంగి 2:24-26 పవిత్ర బైబిల్ (TERV)
జీవితంలో సుఖాలు అనుభవించేందుకు నాకంటె ఎక్కువగా ప్రయత్నించిన మనషి మరొకడెవడైనా ఉన్నాడా? లేడు! నేను గ్రహించిన దేమిటంటే: మనిషి చెయ్యగలిగిన అత్యుత్తమమైన పని యేమిటంటే, తినడం, తాగడం, తాను చేసి తీరవలసిన పనిని సరదాగా చెయ్యడం. దేవుని ఆదేశం కూడా ఇదేనని నేను గ్రహించాను. మనిషి మంచి చేసి, దేవుణ్ణి సంతృప్తి పరిస్తే, అప్పుడిక దేవుడు ఆ మనిషికి వివేకాన్నీ, జ్ఞానాన్నీ, సుఖసంతోషాలనీ అనుగ్రహిస్తాడు. అయితే, పాపాలు చేసేవాడికి దేవుడు ప్రయాసపడే పని, పోగు చేసే పని, కుప్పలుగా పోసే పని మాత్రమే ఇస్తాడు. దేవుడు చెడ్డవానినుంచి తీసుకొని మంచివానికి ఇస్తాడు. అయితే, ఈ పని అంతా వ్యర్థమైనదిగానూ, గాలిని పట్టుకొనే ప్రయత్నంగానూ కనిపిస్తుంది.
ప్రసంగి 2:24-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జి తముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసి కొంటిని. ఆయన సెలవులేక భోజనముచేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టు డగువాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయుపనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది.