ప్రసంగి 12:12-14
ప్రసంగి 12:12-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా కుమారుడా, వీటితో పాటు ఇతర వాటి గురించి జాగ్రత్తగా ఉండు. పుస్తకాల రచనకు అంతం లేదు, అధిక చదువు శరీరానికి అలసట కలిగిస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత, అన్నిటి ముగింపు ఇదే: దేవునికి భయపడాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఇదే మనుష్యులందరి కర్తవ్యము. దేవుడు ప్రతి పనిని తీర్పులోనికి తెస్తారు, దాచబడిన ప్రతి దానిని, అది మంచిదైనా చెడ్డదైనా సరే తీర్పులోనికి తెస్తారు.
ప్రసంగి 12:12-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కుమారా, ఇంకా ఇతర విషయాల గూర్చి జాగ్రత్తపడు. అంతూ పొంతూ లేని గ్రంథాల రచన. విపరీతంగా చదవడం వలన శరీరం అలిసిపోతుంది. ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే. నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాలి. మానవులంతా చేయాల్సింది ఇదే. ఎందుకంటే దేవుడు ప్రతి పనినీ, రహస్యంగా ఉంచిన ప్రతి విషయాన్నీ, అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోకి తెస్తాడు.
ప్రసంగి 12:12-14 పవిత్ర బైబిల్ (TERV)
అందుకని కుమారుడా, (ఆ ఉపదేశాలను అధ్యయనం చెయ్యి) అయితే ఇతర గ్రంథాలను గురించి ఒక హెచ్చరిక. రచయితలు గ్రంథాలు ఎప్పుడూ వ్రాస్తూనే ఉన్నారు. అతిగా అధ్యయనం చేయడం నీకు చాలా అలసట కలిగిస్తుంది. సరే, ఈ గ్రంథంలోని విషయాలన్నీ చదివి మనం నేర్చుకోవలసింది ఏమిటి? మనిషి చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పనేమిటంటే, దేవుని పట్ల భయ భక్తులు కలిగివుండటం, దేవుని ఆజ్ఞలు పాటించడం. ఎందుకంటే, మనుష్యులు చేసే పనులన్నీ గుప్త కార్యాలతో బాటు దేవునికి తెలుసు. ఆయనకి మనుష్యుల మంచి పనులను గురించీ చెడ్డ పనులను గురించీ సర్వం తెలుసు. మనుష్యుల పనులేవీ దేవుని విచారణకు రాకుండా పోవు.
ప్రసంగి 12:12-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము; పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.



