ద్వితీయోపదేశకాండము 5:12-15

ద్వితీయోపదేశకాండము 5:12-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి. ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి, కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ ఎద్దు గాని, మీ గాడిద గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు తద్వార మీలా మీ దాసదాసీలు విశ్రాంతి తీసుకుంటారు. మీరు ఈజిప్టులో బానిసత్వంలో ఉన్నప్పుడు, మీ దేవుడైన యెహోవా బలమైన హస్తంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడినుండి బయటకు తీసుకువచ్చారని జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి సబ్బాతు దినాన్ని పాటించమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించారు.

ద్వితీయోపదేశకాండము 5:12-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి. ఏడో రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా, ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి. మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు.

ద్వితీయోపదేశకాండము 5:12-15 పవిత్ర బైబిల్ (TERV)

“సబ్బాతు రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చేందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారం లోని ఇతర దినాలకంటే విశ్రాంతి దినాన్ని వేరుగా ఉంచమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞ యిచ్చాడు. మొదటి ఆరు రోజులు మీ పని చేసుకొనేందుకు. అయితే ఏడో రోజు మీ దేవుడైన యెహోవా గౌరవార్థం విశ్రాంతి రోజు అవుతుంది. కనుక విశ్రాంతి రోజున ఏ వ్యక్తీ పనిచేయకూడదు. అంటే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ ఆడ, మగ బానిసలు, మీ ఆవులు, మీ గాడిదలు, ఏ ఇతర జంతువులు, మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులు, మీ బానిసలు కూడ మీవలెనే విశ్రాంతి తీసుకోగలగాలి. ఈజిప్టులో ఉన్నప్పుడు మీరూ బానిసలే అని మరచిపోవద్దు. మీ దేవుడైన యెహోవా తన మహా శక్తితో ఈజిప్టునుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేసాడు. అందుచేతనే ఎల్లప్పుడూ సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా ఆచరించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.

ద్వితీయోపదేశకాండము 5:12-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుము. ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిద యైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పర దేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందు చేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను.