ద్వితీయోపదేశకాండము 16:1-3 - Compare All Versions
ద్వితీయోపదేశకాండము 16:1-3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అబీబు నెలను ఆచరించి మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగించాలి, ఎందుకంటే అబీబు నెలలో రాత్రివేళ మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో నుండి మిమ్మల్ని తీసుకువచ్చారు. యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించి పశువుల్లో నుండి గాని మందలో నుండి గాని ఒక జంతువును బలి ఇవ్వాలి. పులిసిన దానితో చేసిన రొట్టెలు తినకూడదు, కాని మీరు ఈజిప్టులో నుండి త్వరగా బయలుదేరి వచ్చారు కాబట్టి, ఈజిప్టు దేశం నుండి వచ్చిన ఆ రోజును జీవితకాలమంతా జ్ఞాపకముంచుకోడానికి ఏడు రోజులు మీరు బాధను సూచించే రొట్టె అనగా పులియని రొట్టెలు తినాలి.
ద్వితీయోపదేశకాండము 16:1-3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“మీరు ఆబీబు నెలలో పండగ ఆచరించి మీ యెహోవా దేవునికి పస్కా పండగ జరిగించాలి. ఎందుకంటే ఆబీబు నెలలో రాత్రివేళ మీ యెహోవా దేవుడు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించాడు. యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే మీ యెహోవా దేవునికి పస్కా ఆచరించి, గొర్రెలను, మేకలను, ఆవులను బలి అర్పించాలి. పస్కా పండగలో కాల్చినప్పుడు పొంగకుండా ఉన్న రొట్టెలను తినాలి. మీరు ఐగుప్తు దేశం నుండి త్వరత్వరగా వచ్చారు గదా. మీరు వచ్చిన రోజును మీ జీవితం అంతటిలో జ్ఞాపకం ఉంచుకునేలా పొంగని రొట్టెలు ఏడు రోజులపాటు తినాలి.
ద్వితీయోపదేశకాండము 16:1-3 TERV (పవిత్ర బైబిల్)
“అబీబు నెలలో మీరు మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి. ఎందుకంటే అబీబు నెలలోనే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రాత్రిపూట ఈజిప్టునుంటి బయటకు రప్పించాడు. యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఏర్పరచుకొనే చోటుకు మీరు వెళ్లాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుకు, పస్కా పండుగ భోజనానికి ఒక ఆవును లేక మేకను మీరు బలి యివ్వాలి. ఈ బలితోపాటు పొంగినది ఏదీ తినవద్దు. ఏడు రోజులపాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఇది “బాధరొట్టె అని పిలువబడుతుంది.” ఈజిప్టు దేశంలో మీ బాధలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది సహాయపడుతుంది. ఎంత త్వరగా మీరు ఆ దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందో జ్ఞాపకం ఉందా! మీరు బ్రదికినంత కాలం ఆ రోజును జ్ఞాపకం ఉంచుకోవాలి.
ద్వితీయోపదేశకాండము 16:1-3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱె మేకలలోగాని గోవులలోగాని బలి అర్పింపవలెను. పస్కా పండు గలో పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములోనుండి వచ్చిన దినమును నీ జీవితమంతటిలో జ్ఞాపకము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.