దానియేలు 9:24-27

దానియేలు 9:24-27 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“దోషం ముగించడానికి, పాపం తుదముట్టించడానికి, దుష్టత్వానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, శాశ్వత నీతిని చేకూర్చడానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, నీ పరిశుద్ధ పట్టణానికి డెబ్బై ‘ఏడులు’ నిర్ణయించబడ్డాయి. “దీనిని తెలుసుకొని, గ్రహించు: యెరూషలేము పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం ఆజ్ఞ ఇయ్యబడింది మొదలుకొని, అభిషిక్తుడైన అధిపతి వచ్చేవరకు ఏడు ‘వారాలు,’ అరవై రెండు ‘వారాలు’ పడుతుంది. అయితే కష్టకాలంలో యెరూషలేము నడి వీధులతో, కాలువతో పునర్నిర్మించబడుతుంది. అరవై రెండు ‘సంవత్సరాల’ తర్వాత అభిషిక్తుడు హతం చేయబడతాడు, ఆయన స్వాధీనంలో ఏమీ ఉండదు. ఆ తర్వాత వచ్చే పరిపాలకుని ప్రజలు పట్టణాన్ని, పరిశుద్ధాలయాన్ని నాశనం చేస్తారు. అంతం వరదలా వస్తుంది: యుద్ధం అంతం వరకు కొనసాగుతుంది, వినాశనం జరగాలని నిర్ణయంచబడింది. ఆ పరిపాలకుడు ఒక ‘ఏడు’ కోసం చాలా మందితో నిబంధన నెలకొల్పుతాడు. అయితే ఆ ‘ఏడు’ సగం గడిచాక, బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అతని మీద శాసించబడిన అంతం కుమ్మరించబడేవరకు, మందిరం దగ్గర వినాశనం కలిగించే హేయమైన దానిని నిలుపుతాడు.”

దానియేలు 9:24-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తిరుగుబాటును అణచి వేయడానికి, పాపాన్ని నివారణ చేయడానికి, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతం వరకు ఉండే నీతిని వెల్లడి చేయడానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు విధించబడ్డాయి. యెరూషలేమును మళ్ళీ కట్టించవచ్చని ఆజ్ఞ బయలు దేరిన సమయం మొదలుకుని అభిషిక్తుడైన నాయకుడు వచ్చే దాకా ఏడు ఏడులు, 62 ఏడులు పడుతుందని గ్రహించి అర్థం చేసుకో. దురవస్థ గల కాలం అయినప్పటికీ పట్టణం రాచవీధులను కందకాలను మళ్ళీ కడతారు. ఈ 62 వారాలు జరిగిన తరువాత అభిషిక్తుడు పూర్తిగా నిర్మూలం అయి పోతాడు. వస్తున్న రాజు ప్రజలు పవిత్ర పట్టణాన్ని పరిశుద్ధ ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. వాడి అంతం హఠాత్తుగా వస్తుంది. యుద్ధ కాలం సమాప్తమయ్యే వరకూ నాశనం జరుగుతుందని నిర్ణయం అయింది. అతడు ఒక వారం వరకూ చాలా మందితో నిబంధన చేసుకుంటాడు. అర్థవారానికల్లా బలి, నైవేద్యం నిలిపివేస్తాడు. అసహ్యమైన దానితో బాటే నాశనం చేసేవాడు వస్తాడు. నాశనం చేసేవాడి పైకి రావాలని నిర్ణయించిన నాశనం అంతా పూర్తిగా వచ్చే దాకా ఇలా జరుగుతుంది.”

దానియేలు 9:24-27 పవిత్ర బైబిల్ (TERV)

“నీ ప్రజలకు, నీ పవిత్ర నగరానికి డెబ్బై వారాల గడువు ఇవ్వబడింది: అనగా అతిక్రమాన్ని ముగించటానికి, పాపాన్ని అంతం చేయటానికి, అపరాధాన్ని ప్రాయశ్చిత్తం చేయటానికి, నీతిని శాశ్వతంగా తేవటానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించటానికి మరియు పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించటానికి డెబ్బై వారాలు పడుతుంది. “కాబట్టి ఈ విషయం తెలుసుకొని గ్రహించుకో. యెరూషలేమును తిరిగి కట్టమని సందేశం బయలు వెళ్లిన సమయంనుండి, అభిషేకింపబడిన రాజు వరకు ఏడు వారాలు మరియు అరవైరెండు వారాలు. యెరూషలేము రాజవీధులతోను, కందకములతోను మరల కట్టబడుతుంది, కాని కష్ట సమయాల్లో అది కట్టబడుతుంది. అరవై రెండు వారాల తర్వాత అభిషేకింపబడిన రాజు చంపబడతాడు. అప్పుడు రాబోయే రాజుయొక్క ప్రజలు నగరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని నాశనం చేస్తారు. దాని అంతం ఒక ప్రళయంతో వస్తుంది. అంతం వరకు యుద్ధం కొనసాగుతుంది. నాశనాలు జరగటానికి ఆజ్ఞాపించబడ్డాయి. “ఒక వారంపాటు రాబోయే రాజు చాలామందితో ఒక స్థిరమైన ఒప్పందం చేస్తాడు. అర్ధవారంకు బలి అర్పణలు నిలుపు చేస్తాడు. అసహ్య కార్యాలు జరిగించే (దేవాలయములో) నాశనకారుడు ఒకడు వస్తాడు. ఆజ్ఞా పించబడిన అంతము ఈ నాశనకారుని మీద క్రుమ్మరించబడేవరకు ఈ విధముగా జరుగుతుంది”

దానియేలు 9:24-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతమువరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను. యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును. ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియులేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజుయొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.