దానియేలు 7:9-10
దానియేలు 7:9-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“నేను చూస్తుండగా, “సింహాసనాలు వాటి స్థానాల్లో వేయబడ్డాయి, వాటిపై మహా వృద్ధుడు కూర్చున్నారు. ఆయన వస్త్రం మంచులా తెల్లగా, ఆయన తలవెంట్రుకలు శుద్ధమైన తెల్లని గొర్రె ఉన్నిలా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్నిలా మండుతూ ఉంది, దాని చక్రాలు మండుతూ ఉన్నాయి. ఆయన ఎదుట నుండి అగ్ని నది ప్రవహిస్తూ వస్తుంది, వేవేలకొలది ఆయనకు సేవ చేస్తున్నారు; పదివేలకొలది ఆయన ఎదుట నిలబడ్డారు, న్యాయసభ మొదలైంది, గ్రంధాలు విప్పారు.
దానియేలు 7:9-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను ఇంకా చూస్తూ ఉండగా, ఇంకా సింహాసనాలను వేయడం చూశాను. మహా వృద్ధుడు కూర్చున్నాడు. ఆయన వస్త్రం మంచులాగా తెల్లగా, ఆయన జుత్తు శుద్ధమైన గొర్రెబొచ్చులాగా తెల్లగా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్నిజ్వాలల్లాగా మండుతూ ఉంది. దాని చక్రాలు మంటల్లాగా ఉన్నాయి. అగ్నిప్రవాహం ఒకటి ఆయన దగ్గర నుండి ప్రవహిస్తూ ఉంది. వేవేలకొలది ఆయనకు పరిచారకులున్నారు. కోట్లకొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు. తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరిచారు.
దానియేలు 7:9-10 పవిత్ర బైబిల్ (TERV)
“నేను చూస్తూండగా సింహాసనాలు వేయబడ్డాయి. మరియు ప్రాచీన రాజు తన సింహాసనమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన వస్త్రాలు మంచులా తెల్లగాను, ఆయన తల వెంట్రుకలు స్వచ్ఛమైన ఉన్నివలె తెల్లగా ఉండినవి. ఆయన సింహాసనం అగ్ని జ్వాలలతోను, ఆ సింహాసనపు చక్రాలు మంటలతోను మండుచున్నవి. ఆయన ఎదుట నుండి అగ్ని ప్రవాహము బయలు వెళ్లింది. వేవేల కొలది ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు. కోట్లకొలది ఆయన ఎదుట నిలబడ్డారు. తీర్పుకై ఆయన న్యాయసభలో కూర్చుండగా గ్రంథాలు తెరువబడ్డాయి.
దానియేలు 7:9-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను. అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.