దానియేలు 7:1-8
దానియేలు 7:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
బబులోను రాజైన బెల్షస్సరు పరిపాలనలోని మొదటి సంవత్సరంలో, దానియేలు తన పడక మీద పడుకుని ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది, దర్శనాలు తన మనస్సులో కలిగాయి. అతడు తన కలను ఇలా సంక్షిప్తంగా వ్రాశాడు. దానియేలు, “రాత్రివేళ నా దర్శనంలో నేను తేరిచూడగా నా ఎదుట ఆకాశం నాలుగు వైపుల నుండి గాలులు వీచి మహా సముద్రాన్ని కదిలించాయి. అప్పుడు సముద్రంలో నుండి నాలుగు గొప్ప మృగాలు పైకి లేచాయి, ఇవి ఒక దానికి ఒకటి భిన్నంగా ఉన్నాయి. “మొదటి మృగం సింహంలా ఉంది, దానికి గ్రద్ద రెక్కలవంటి రెక్కలున్నాయి. దాని రెక్కలు తీసివేయగా అది మనిషిలా రెండు కాళ్లమీద నిలబడడం చూశాను, దానికి మనిషి మనస్సు ఇవ్వబడింది. “తర్వాత నా ఎదుట రెండవ మృగం ఎలుగుబంటిలా ఉంది. అది ఒకవైపు ఎత్తుగా ఉండి దాని నోటి పళ్ల మధ్యలో మూడు ప్రక్కటెముకలు ఉన్నాయి. ‘లేచి నీవు తినగలిగినంత మాంసం తిను!’ అని దానికి చెప్పబడింది. “ఆ తర్వాత నాకు చిరుతపులిలా ఉన్న ఇంకొక మృగం కనిపించింది. దాని వీపుకు పక్షి రెక్కలవంటి నాలుగు రెక్కలున్నాయి. ఈ మృగానికి నాలుగు తలలు ఉన్నాయి, పరిపాలించడానికి దీనికి అధికారం ఇవ్వబడింది. “దాని తర్వాత రాత్రివేళ నా దర్శనంలో నేను చూస్తుండగా నాలుగవ మృగం కనిపించింది. అది భయానకంగా, భయం కలిగించేదిగా, మహా శక్తి కలిగి ఉంది. దానికి పెద్ద ఇనుప పళ్లున్నాయి; అది దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది. అంతకుముందు కనిపించిన మృగాల కంటే అది భిన్నమైనది, దానికి పది కొమ్ములున్నాయి. “నేను కొమ్ముల గురించి ఆలోచిస్తుండగా వాటి మధ్య నుండి మరొక చిన్న కొమ్ము పైకి వచ్చింది. మొదటి మూడు కొమ్ములు దాని ఎదుట నుండి పెరికివేయబడ్డాయి. ఈ కొమ్ముకు మనిషిలాంటి కళ్లు, గర్వంగా మాట్లాడే నోరు ఉన్నాయి.
దానియేలు 7:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బబులోను రాజు బెల్షస్సరు పరిపాలన మొదటి సంవత్సరంలో దానియేలుకు దర్శనాలు కలిగాయి. అతడు తన మంచం మీద పండుకుని ఒక కల కన్నాడు. ఆ కల సంగతిని సంక్షిప్తంగా వివరించి రాశాడు. దానియేలు వివరించి చెప్పిన దేమిటంటే రాత్రి వేళ దర్శనాలు కలిగి నప్పుడు నేను తేరి చూస్తుండగా ఆకాశం నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి వీయడం నాకు కనబడింది. అప్పుడు నాలుగు గొప్ప జంతువులు మహా సముద్రంలో నుండి ఎక్కి వచ్చాయి. ఆ జంతువులు ఒక దానికొకటి వేరుగా ఉన్నాయి. మొదటిది సింహం లాటిది. దానికి గరుడ పక్షి రెక్కలవంటి రెక్కలున్నాయి. నేను చూస్తుండగా దాని రెక్కలు తీసేశారు. అందువల్ల అది మనిషి లాగా కాళ్ళతో నేలపై నిలబడింది. మనిషి మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడింది. రెండవ జంతువు ఎలుగుబంటి లాటిది. అది ఒక పక్కకి తిరిగి పడుకుని తన నోట్లో పళ్ళ మధ్య మూడు ప్రక్కటెముకలను కరిచి పట్టుకుని ఉంది. కొందరు “లే, బాగా మాంసం తిను” అని దానితో చెప్పారు. అటు తరువాత చిరుతపులివంటి మరొక జంతువును చూశాను. దాని వీపు మీద పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలున్నాయి. దానికి నాలుగు తలలున్నాయి. దానికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. తరువాత రాత్రి వేళ నాకు దర్శనాలు కలిగినప్పుడు నేను చూస్తుంటే, ఘోరమైన, భీకరమైన, మహా బలిష్ఠమైన నాలుగవ జంతువొకటి కనబడింది. అది తనకు ముందున్న ఇతర జంతువులకు భిన్నమైనది. దానికి పెద్ద ఇనుప దంతాలు, పది కొమ్ములు ఉన్నాయి. అది సమస్తాన్నీ భక్షిస్తూ తుత్తునియలు చేస్తూ మిగిలిన దాన్ని కాళ్లతో తొక్కేస్తూ ఉంది. నేను దాని కొమ్ములను కనిపెట్టి చూస్తుంటే ఒక చిన్న కొమ్ము వాటి మధ్య మొలిచింది. దానికి చోటు ఇవ్వడానికి ఆ కొమ్ముల్లో మూడింటిని పీకి వేశారు. ఈ కొమ్ముకు మనిషి కళ్ళ వంటి కళ్ళు, గర్వంగా మాటలాడే నోరు ఉన్నాయి.
దానియేలు 7:1-8 పవిత్ర బైబిల్ (TERV)
బెల్షస్సరు బబులోనుకు రాజుగా ఉన్న మొదటి సంవత్సరంలో, దానియేలు ఒక కలగన్నాడు. దానియేలు ఈ దర్శనాలు చూశాడు. అప్పుడతను తన పడకమీద పడుకునివున్నాడు. తాను కలగన్న విషయాల్ని దానియేలు వ్రాశాడు. దానియేలు ఇలా చెప్పాడు: “నేను రాత్రివేళ ఒక దర్శనం చూశాను. అందులో నాలుగు వైపులనుండి గాలి వీచింది. ఆ గాలులకు సముద్రం అల్లకల్లోలంగా ఉండింది. నేను నాలుగు పెద్ద మృగాల్ని చూశాను. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వున్నాయి. ఆ నాలుగు మృగాలు సముద్రం నుండి పైకి వచ్చాయి. “మొదటి మృగము సింహంవలె ఉండింది. దానికి గ్రద్ద రెక్కలున్నాయి. ఆ మృగాన్ని గమనిస్తూండగా దాని రెక్కలు విరిచివేయబడ్డాయి. అది నేలనుండి పైకి లేచి, మనిషిలాగ రెండు కాళ్లమీద నిలబడింది. దానికి మానవుని మనస్సువంటి మనస్సు ఇవ్వబడింది. “ఆ తర్వాత నా ఎదుట రెండవ మృగాన్ని చూశాను. ఇది ఎలుగుబంటివలె కనిపించింది. ఒక వైపుకి అది లేవనెత్తబడింది. దాని నోట్లో పళ్ల మధ్య మూడు ప్రక్కటెముకలున్నాయి. పైకి లేచి, నీకు కావలసినంత మాంసం తిను” అని దానికి చెప్పబడింది. “తర్వాత నేను చూడగా నా ఎదుట మూడవ మృగము ఉంది. ఇది చిరుతపులిలాగ ఉంది. దానివీపుమీద నాలుగు పక్షి రెక్కలున్నాయి. దీనికి నాలుగు తలలున్నాయి. పరిపాలించే అధికారం దానికి ఇవ్వబడింది. “ఆ తర్వాత, నా దర్శనాలలో రాత్రివేళ చూస్తూండగా నా ఎదుట నాలుగవ మృగము ఉంది. ఇది చాలా ఘోరంగాను, భయంకరంగాను కనిపించింది. అది మహా బలంగా ఉంది. దానికి ఇనుప పళ్లు ఉన్నాయి. ఈ మృగం సమస్తాన్ని ముక్కలుగా చీల్చి మ్రింగుచూ, మిగిలిన దాన్ని తన కాళ్ల క్రింద త్రొక్కుచుండినది. అంతకు మునుపు నేను చూసిన ఇతర మృగాలకంటె ఈ నాలుగవ మృగం భిన్నంగా ఉంది. దీనికి పది కొమ్ములున్నాయి. “ఈ కొమ్ముల విషయం నేను తలస్తూండగా వాటిమధ్యలో ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. దాని స్థానంలో మొదట ఉన్న మూడు కొమ్ములు కుదురుతో సహా పెరికివేయబడ్డాయి. ఈ చిన్న కొమ్ముమీద మానవ కళ్లలాంటి కళ్లు, డంబాలు పలికేనోరు దానికి ఉన్నాయి.
దానియేలు 7:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
బబులోను రాజగు బెల్షస్సరుయొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడకమీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా–రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రముమీద గాలి విసరుట నాకు కనబడెను. అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పై కెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. కొందరు – లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులినిపోలిన మరియొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్యమియ్య బడెను. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్మ్యములుగలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్మువాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.