దానియేలు 5:1-6
దానియేలు 5:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
బెల్షస్సరు రాజు తన వేయిమంది ప్రముఖులకు గొప్ప విందు ఏర్పాటు చేసి వారితో కలిసి ద్రాక్షరసం త్రాగాడు. బెల్షస్సరు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు, తన తండ్రియైన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజు, తన ప్రముఖులు, తన భార్యలు, తన ఉంపుడుగత్తెలు వాటిలో ద్రాక్షరసం త్రాగాలని అనుకున్నాడు. కాబట్టి వారు యెరూషలేములోని దేవుని మందిరంలో నుండి తెచ్చిన బంగారు గిన్నెలు తీసుకురాగా రాజు, అతని ప్రముఖులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు వాటిలో త్రాగారు. వారు ద్రాక్షరసం త్రాగుతూ, తమ బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అనే వాటితో చేసిన దేవుళ్ళను స్తుతించారు. అకస్మాత్తుగా మనిషి చేతివ్రేళ్లు కనిపించాయి, అవి దీపస్తంభానికి ఎదురుగా రాజభవనం గోడ మీద ఆ చేయి వ్రాస్తుండగా రాజు చూశాడు. అప్పుడు రాజు ముఖం తెల్లబోయింది, భయంతో అతని మోకాళ్లు వణుకుతూ కొట్టుకున్నాయి.
దానియేలు 5:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొన్ని సంవత్సరాలు తరువాత ఒక రోజు రాజైన బెల్షస్సరు తన రాజ్యంలోని వెయ్యి మంది అధికారులకు గొప్ప విందు చేయించాడు. ఆ వెయ్యి మందితో కలిసి ద్రాక్షమద్యం తాగుతున్నాడు. బెల్షస్సరు ద్రాక్షమద్యం సేవిస్తూ తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేమును కొల్లగొట్టి దేవాలయంలో నుండి తెచ్చిన బంగారు, వెండి పాత్రలను తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అతడు, అతని అధికారులు, రాణులు, ఉపపత్నులు వాటిలో ద్రాక్ష మద్యం సేవించాలన్నది అతడి ఉద్దేశం. సేవకులు యెరూషలేములో ఉన్న దేవుని నివాసమైన ఆలయం నుండి దోచుకువచ్చిన బంగారు పాత్రలు తీసుకువచ్చారు. రాజు, అతని అధికారులు, రాణులు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్ష మద్యం పోసుకుని సేవించారు. అలా సేవిస్తూ బంగారం, వెండి, యిత్తడి, ఇనుము, చెక్క, రాయిలతో చేయబడిన తమ దేవుళ్ళను కీర్తించారు. ఆ సమయంలోనే రాజుకు మనిషి చేతి వేళ్ళు కనిపించాయి. దీపస్తంభం ఎదురుగా రాజ భవనం గోడ మీద ఏదో ఒక రాత రాస్తూ ఉన్నట్టు కనబడింది. ఆ చెయ్యి గోడపై రాస్తూ ఉండడం చూసిన రాజు ముఖం పాలిపోయింది. అతడు హృదయంలో కలవరం చెందాడు. అతని మోకాళ్ళు వణుకుతూ గడగడ కొట్టుకున్నాయి. నడుము కీళ్లు పట్టు సడలాయి.
దానియేలు 5:1-6 పవిత్ర బైబిల్ (TERV)
రాజైన బెల్షస్సరు తన వెయ్యిమంది అధికారులకు ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు. బెల్షస్సరు ద్రాక్షామద్యం త్రాగుతుండగా తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము ఆలయంనుంచి తీసుకువచ్చిన బంగారు, వెండి పాత్రలు తీసుకురమ్మని అతతడు సేవకులకు ఆజ్ఞాపించాడు. బెల్షస్సరు తన సామంతులు, తన భార్యలు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్షామద్యం పానం చేయాలని కోరాడు. కనుక యెరూషలేము ఆలయంనుంచి తెచ్చిన ఆ ప్రాత్రల్ని వారు తీసుకు వచ్చారు. రాజు మరియు అతని సామంతులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు ఆ పాత్రల్లో పానం చేశారు. త్రాగుచూ వారు బంగారం, వెండి, కంచు, ఇనుము, కర్ర, రాయి మొదలైన వాటితో తయారు చేయబడిన తమ దేవుళ్లను కీర్తించారు. అప్పుడు ఉన్నట్టుండి, ఒక వ్యక్తి చేతి వ్రేళ్లు కనబడి, గోడమీద వ్రాయసాగాయి. రాజగృహములో దీపం ప్రక్కగా గోడమీద ఆ చెయ్యి వ్రాసింది. ఆ చెయ్యి వ్రాస్తుండగా, రాజు చూశాడు. రాజైన బెల్షస్సరు భయభ్రాంతుడయ్యాడు, భయంవల్ల అతని ముఖం పాలిపోయింది. మోకాళ్ళు వణకుతు ఒకదానితో ఒకటి కొట్టుకొనసాగాయి. అతని కాళ్లు చాలా బలహీనంకాగా, అతడు నిలబడలేక పోయాడు.
దానియేలు 5:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
రాజగు బెల్షస్సరు తన యధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందుచేయించి, ఆ వెయ్యిమందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.